రియల్ ఎస్టేట్​ వ్యాపారి ఆత్మహత్య

రియల్ ఎస్టేట్​ వ్యాపారి ఆత్మహత్య
  • సంగారెడ్డి జిల్లా రామేశ్వర బండ సమీపంలో గడ్డిమందు తాగిన చెన్నకేశవ రెడ్డి  
  • వ్యాపారంలో నష్టం, ఆర్థిక ఇబ్బందులే కారణమన్న భార్య

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో ఆర్థి ఇబ్బందులతో ఓ రియల్ వ్యాపారి సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్ చెరు పోలీసుల కథనం ప్రకారం..అమీన్​పూర్​ మున్సిపల్ పరిధిలోని లేక్ వ్యూ విల్లాలో చెన్నకేశవరెడ్డి (45) అనే రియల్​ఎస్టేట్​వ్యాపారి భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. రియల్​ ఎస్టేట్​ బిజినెస్ కోసం అప్పులు తీసుకోగా వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. దీంతో అప్పులు ఇచ్చినవారితో పాటు భార్యతోనూ గొడవలు జరిగేవి. అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో సోమవారం ఇంట్లో చెప్పకుండా రామేశ్వరం బండ సమీపంలోని తన పొలానికి వెళ్లి గడ్డి మందు తాగాడు.

చెప్పకుండా వెళ్లిన భర్త రాత్రి అయినా రాకపోవడంతో రామేశ్వరంబండ సమీపంలోని పొలానికి వెళ్లి చూడగా అపాస్మరక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మరొక ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. చెన్నకేశవరెడ్డి భార్య శారద ఫిర్యాదు మేరకు మంగళవారం పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నకేశవరెడ్డి రియల్ ఎస్టేట్​వ్యాపారి కావడంతో మరణానికి మరేదైనా  కారణం ఉందా అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.