బిగ్గెస్ట్ స్కాం : మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి మరణ శిక్ష

రియల్ ఎస్టేట్ రంగంలో మోసం చేస్తే ఏమవుతుంది.. మన దేశంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు.. విదేశాల్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు.. అవును.. వియత్నాం దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కాం చేసిన మహిళా పారిశ్రామికవేత్తకు మరణ శిక్ష విధించింది అక్కడి కోర్టు. అవును.. రియల్ ఎస్టేట్ లో ఆమె చేసిన మోసం అలాంటిది మరి.. ఏకంగా అక్షరాల లక్ష కోట్ల రూపాయలు మోసం చేసిందంట.. రెండేళ్ల క్రితమే.. అంటే 2022లో ఈ స్కాం వెలుగులోకి రాగా.. 2024 ఏప్రిల్ 11వ తేదీ ఆ మహిళా పారిశ్రామికవేత్తకు మరణ శిక్ష విధించింది కోర్టు.. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే...
 
వియత్నాం దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా పేరు గాంచిన  త్రువాంగ్ మిలాన్‌కు ఆ దేశ కోర్టు మరణ శిక్ష విధించింది. మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్ ఫ్రాడ్ కేసులో ఆమెకు ఈ శిక్షను ఖ‌రారు చేశారు. డెవ‌ల‌ప‌ర్ వాన్ తిన్ ఫ‌ట్ కంపెనీకి ఛీఫ్ గా ఉన్న త్రువాంగ్ 2012 నుంచి 2022 వరకు సైగాన్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్‌(ఎస్‌సీబీ) నుంచి ఫేక్ ద‌ర‌ఖాస్తులతో దాదాపు 27 బిలియ‌న్ల డాల‌ర్లు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. 

ఈ మొత్తం అమౌంట్‌ ఆ దేశ జీడీపీలో ఆరు శాతం అని తేలింది. కేసు విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఈ ఫ్రాడ్ లో ఆ దేశానికి చెందిన అనేక మంది అధికారులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 84 మందికి మూడేళ్లపాటు ప్రొబేషన్ నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. 

కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్న మిలాన్ మేనకోడలు ట్రూంగ్ హ్యూ వాన్ కూడా ఈ కేసులో నిందితురాలిగా ఉన్నారు. మరో వైపు ఆమె భర్త హాంగ్‌కాంగ్‌కు చెందిన సంప‌న్న వ్యాపార‌వేత్త  ఎరిక్ చు నాప్-కీ కూడా ఈ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం డబ్బును ఏం చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.