‘రియల్’ టెన్షన్ పుట్టిస్తున్న రియల్ ఎస్టేట్

‘రియల్’ టెన్షన్ పుట్టిస్తున్న రియల్ ఎస్టేట్

కొత్త ఆర్డర్స్తో తో ఎక్కడికక్కడే నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
వ్యవసాయ భూములు, తనఖా ల్యాండ్స్ తోనే సరి
భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఇన్ కం
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీగా అక్రమ వెంచర్లు

నల్గొండ, వెలుగు: కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. కొత్తమున్సిపల్, పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం అనుమతి లేని లేఅవుట్లు, భవనాలను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆర్డర్స్ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని రియల్ వ్యాపారుల్లో టెన్షన్ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా గురువారం జిల్లాలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అగ్రికల్చర్, తనఖా ల్యాండ్స్ కు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయి.

324 డాక్యుమెంట్లు… రూ. 46.41 లక్షల ఇన్ కం
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది ఆఫీసుల్లో గురువారం రాత్రి వరకు కేవలం 324 డాక్యుమెంట్లే రిజిస్టర్ అయ్యాయి. వీటి ద్వారా వచ్చిన ఇన్కం కేవలం రూ.46.41 లక్షలే. నిత్యం కళకళలాడే బీబీనగర్, నల్గొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ ఆఫీసులు వెలవెలబోయాయి. కొత్త చట్టాల ప్రకారం డీటీసీపీ పర్మిషన్ తో వస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేసే పవర్స్అధికారులకు లేకపోవడంతో ప్లాట్లు , ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోలికి పోలేదు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇన్నాళ్లు పర్మిషన్లేకుండా అక్రమ దందా నడిపిన రియల్ వ్యాపారులు ఇప్పుడు తలలు పట్టుకున్నారు. అలాగే ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు సైతం ఆలోచనలో పడ్డారు.

రియల్ వ్యాపారుల్లో దడ
మున్సిపల్, పంచాయతీ ఆఫీసర్లు గ్రామాలు, పట్టణాల్లో అక్రమ లే అవుట్లను గుర్తించారు. అయితే మున్సిపల్ చట్టం ప్రకారం కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ అమలవుతోంది. ఇక్కడ గుర్తించిన అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. కానీ
రియల్ వ్యాపారులు మాత్రం పర్మిషన్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే అనేక సార్లు నోటీసులు జారీ చేసినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆఫీసర్లు అంటున్నారు. ఇక పాత మున్సిపాలిటీల్లోమాత్రం అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పట్టణాల్లో
ఆఫీసర్లు గుర్తించిన వాటి కంటే అనధికారిక లేఅవుట్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన అక్రమ లేఅవుట్ల వివరాలను రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పంపించడంతో వాటి రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. దీంతో మరో గత్యంతరం లేక వ్యాపారులు పర్మిషన్ల కోసం మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక తాత్కాలిక లేఅవుట్ పర్మిషన్లు తీసుకున్న చాలా మంది వ్యాపారులు ఇప్పటికే ప్లాట్లను అమ్మేశారు. దీంతో ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు తిరిగి అమ్మాలంటే కుదరదు. లే అవుట్ పర్మిషన్ ఉంటే తప్ప అమ్మకాలు, కొనుగోళ్లకు వీలు కాదు. దీంతో ఇంతకాలం అక్రమంగా సాగిన భూదందాలన్నీఇప్పుడు బయటపడతాయని ఆఫీసర్లు చెప్తున్నారు.

మేజర్ మండలాల్లో రియల్ జోరు
నల్గొండ జిల్లాలో 20, సూర్యాపేటలో 14 మండలాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో భూముల ధరలు అమాతంగా పెరిగిపోవడంతో రియల్ బిజినెస్కు రెక్కలొచ్చాయి. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారులను ఆనుకొని ఉన్న మండలాల్లోనే వందల ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి. నల్గొండ జిల్లాలోనే అనుమతి లేనివెంచర్లు385 ఉండగా, సూర్యాపేట జిల్లాలో 50 ఉన్నట్లు గుర్తించారు. లే అవుట్ పర్మిషన్ లేకుండానే ప్లాట్లను అమ్మకానికి పెట్టారు.

నల్గొండ జిల్లాలోనే అధికం
నల్గొండ జిల్లాలో 20 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అనుమతి లేని వెంచర్లు సుమారు 385 ఉన్నట్లు జిల్లా పంచాయతీ శాఖ గుర్తించింది. చందంపేట మండలంలో 5, చండూరులో 19, చింతపల్లిలో 48, చిట్యాలలో 17, దామరచర్లలో 3, దేవరకొండలో 23, డిండిలో 2, గుర్రంపోడులో 4, కట్టంగూరులో 10, కేతేపల్లిలో 10 వెంచర్లకు పర్మిషన్ లేదు. అలాగే కొండమల్లేపల్లిలో 33, మర్రిగూడలో 16, మిర్యాలగూడలో 14, మునుగోడులో 10, నకిరేకల్లో 33, నల్గొండలో 10, నార్కట్పల్లిలో 82, పీఏపల్లిలో 80, తిరుమలగిరిలో 4, వేములపల్లి మండలంలో 9 వెంచర్లు ఉన్నాయని గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా ఆత్మకూరు (ఎస్ ) మండలంలో 14, చిలుకూరులో 4, చివ్వెంలలో 3, మునగాల లో 11, తిరుమలగిరి మండలంలో 4 వెంచర్లకు లే అవుట్ పర్మిషన్లు లేవు.

For More News..

దేశంలో ఫస్ట్ టైం హయ్యస్ట్ రికార్డు కరోనా కేసులు

గణేష్ నిమజ్జనంలో ఆర్మీ మాజీ ఉద్యోగి కాల్పులు

రాష్ట్రంలో మరో 2,932 కరోనా కేసులు