
- ధరణి లోపాలతో ఇబ్బంది పడుతున్న వేలాది మంది రైతులు
- స్పెషల్‌డ్రైవ్ పైనే ఆశలు
మెదక్, వెలుగు: రైతులు భూ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారనే విషయాన్ని గ్రహించి గత బీఆర్ఎస్ప్రభుత్వం వాటికి పరిష్కారం చూపేందుకు భూప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదార్ పాస్ బుక్‌లను అందజేసింది. అనంతరం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల భూ సమస్యలన్నీ తీరుతాయని భావించిన రైతులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. తహసీల్దార్ఆఫీస్లలో భూముల వివరాలు ఆన్లైన్ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా భూముల పేర్లు, సర్వే నెంబర్లు తప్పుగా, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువగా నమోదు చేశారు.
దీనివల్ల కొత్త పాస్ బుక్ లు రాక రైతు బంధు, రైతు బీమా, క్రాప్ లోన్ వంటి బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. ధరణి లోపాల సవరణ కోసం ఏళ్ల తరబడిగా రెవెన్యూ ఆఫీసు ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ధరణి సమస్యలకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా వస్తున్నాయి. బాధిత రైతులు ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా, మంత్రులు, ఎమ్యెల్యేలకు ఎంతగా మొరపెట్టుకున్నా గత బీఆర్ఎస్ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ప్రభుత్వం ధరణి పోర్టల్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది.
దీనిపై అధ్యయనానికి ప్రత్యేకంగా మంత్రులతో కమిటీ వేసింది. పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీంతో ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుందా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ధరణి బాధితులు ఉన్నారు. శివ్వంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, కొల్చారం, కౌడిపల్లి, రామాయంపేట మండలాల్లో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యలకు సంబంధించి 5,833 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
ఇవీ సమస్యలు..
కొల్చారం మండలం వరిగుంతం, శేరి వరిగుంతం గ్రామ రైతులకు కొరుకుంట్ల, నల్లంగుంట్ల ఏరియాలో సర్వే నెంబర్ 61, 62, 151, 157, 250, 477, 491, 493లో పట్టా భూములు ఉన్నాయి. తాత, ముత్తాతల కాలం నుంచి వాళ్లు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. గతంలో పట్టాపాస్‌బుక్‌లు ఉండగా, 2017,18లో భూప్రక్షాళన సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్సంబంధిత రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు జారీ చేసింది. ఆయా రైతులకు రైతుబంధు స్కీం కింద పెట్టుబడి సాయం కూడా మంజూరైంది.
కాగా 2022లో కొందరు రైతులు వ్యక్తిగత అవసరాల కోసం భూములు అమ్ముకునేందుకుగాను రిజిస్ట్రేషన్‌కోసం స్లాట్‌బుక్ చేసుకునేందుకు మీసేవా కేంద్రానికి వెళితే ప్రాసెస్ కాలేదు. ఎందుకని పరిశీలిస్తే ధరణి పోర్టల్‌లో ఆన్లైన్లో వారిది లావణి భూమిగా చూపించింది. ఇది తెలిసి ఆయా సర్వే నెంబర్లలో భూములు ఉన్న గ్రామానికి చెందిన ఇతర రైతులు మీసేవకు వెళ్లి చెక్ చేసుకోగా కొందరి పట్టా భూములు ఆన్లైన్లో లావణి, ఖరీజ్ ఖాతా భూములుగా చూపించగా, మరి కొందరి భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిసింది. ధరణి పోర్టల్‌లో భూముల వివరాలు నమోదు చేసేటప్పుడు రెవెన్యూ ఆఫీసర్ల పొరపాట్ల వల్ల భూముల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీనివల్ల రైతులు అవసరానికి భూమి అమ్ముకోవాలనుకున్నా, లోన్ తీసుకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజాంపేట మండల పరిధిలోని కె.వెంకటాపూర్, కె.వెంకటాపూర్ తండా రైతులకు సర్వే నెంబర్ 234 లో సుమారు 300 ఎకరాల భూమి ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం సుమారు 350 మంది రైతులకు అసైన్ మెంట్ భూమి పట్టాలిచ్చింది. అప్పటి నుంచి వారు ఆ భూములను చదును చేసుకుని పంటలు పండిస్తున్నారు. పంట సాగు పెట్టుబడి కోసం బ్యాంక్‌లలో క్రాప్ లోన్లు తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక 2015లో సైతం ఒక్కో రైతు తమకున్న భూమిని బట్టి సెంట్రల్బ్యాంక్ఆఫ్ఇండియా కల్వకుంట బ్రాంచ్‌లో రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు క్రాప్లోన్తీసుకున్నారు.
గతేడాది ప్రభుత్వం రూ.లక్ష వరకు క్రాప్‌లోన్లను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించగా వెంకటాపూర్ రైతులకు రుణ మాఫీ అయినట్టు వారి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతోవారు మళ్లీ క్రాప్లోన్కోసం బ్యాంక్‌కు వెళ్లగా ధరణి పోర్టర్లో సర్వే నెంబర్ 234/120/1 లోని భూమి క్రాప్ హైపోథికేషన్(తనఖా) ప్రాసెస్ కావడం లేదని అందువల్ల మళ్లీ క్రాప్లోన్ఇవ్వడం వీలుకాదని బ్యాంక్ నుంచి రైతులకు నోటీసులు పంపించారు. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రామాయంపేట మండలం కోనాపూర్ లో 40 మంది రైతులకు సర్వే నెంబర్433లో కొందరికి ఎకరా, మరికొందరికి అరెకరా చొప్పున దాదాపు 50 ఎకరాల వరకు పంపిణీ చేసింది.
సంబంధిత రైతులకు అప్పట్లో రెవెన్యూ ఆఫీసర్లు పట్టా సర్టిఫికెట్లతో పాటు, పాస్ బుక్ లు కూడా ఇచ్చారు. కాగా 2018లో ధరణి పోర్టల్అందుబాటులోకి వచ్చాక కోనాపూర్ రైతులకు సమస్య మొదలైంది. ధరణి పోర్టల్‌లో 433 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగా చూపిస్తోందని చెప్పి రెవెన్యూ అధికారులు ప్రధాన మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందుకున్న రైతులకు కొత్త పాస్‌బుక్‌లు జారీ చేయలేదు. దీంతో సంబంధిత రైతులు క్రాప్లోన్లు పొందలేక పోవడంతోపాటు, రైతుబంధు, రైతుబీమా సాయం కూడా అందడం లేదు. తమకు పట్టాదారుపాస్‌బుక్‌లు ఇప్పించాలంటూ ఏండ్ల తరబడిగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కారానికి చర్యలు
ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు జిల్లాలో ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు అన్ని మండలాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ధరణి పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశాం. సంబంధిత రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలి.
- వెంకటేశ్వర్లు,
అడిషనల్ కలెక్టర్, మెదక్