ఆర్డీవో సంతకం ఫోర్జరీ కేసులో రియల్టర్​ అరెస్ట్

ఆర్డీవో సంతకం ఫోర్జరీ కేసులో రియల్టర్​ అరెస్ట్

చౌటుప్పల్, వెలుగు: ఆర్డీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో రియల్  ఎస్టేట్  వ్యాపారిని చౌటుప్పల్  పోలీసులు పట్టుకున్నారు. సీఐ మన్మధకుమార్  వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్  మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన సుర్వి అంజయ్య 2019లో తంగడపల్లి గ్రామంలో 5 ఎకరాల 14 గుంటల భూమి కొనుగోలు చేసి 288 ప్లాట్లతో వెంచర్  చేసి అమ్మాడు. 

చౌటుప్పల్  హెచ్ఎండీఏ పరిధిలో ఉండడంతో నాలా కన్వర్షన్  చేసి హెచ్ఎండీఏ అనుమతితో ప్లాట్లను అమ్మాలి. కానీ, నాలా కన్వర్షన్  లేకుండానే సబ్ రిజిస్ట్రార్​ను మేనేజ్  చేసి కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్  చేశాడు. మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్  చేయాలంటే నాలా కన్వర్షన్  చేయాల్సి ఉండడం, దీనికి పట్టాదారులే అప్లై చేయాల్సి రావడం, వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో సహకరించరని భావించాడు. 

హైదరాబాద్​లోని అయితగోని రాఘవేందర్  అనే వ్యక్తిని సంప్రదించి, గతంలో చౌటుప్పల్  ఆర్డీవోగా పనిచేసిన మహేందర్ రెడ్డి సంతకాలను పోర్జరీ చేసి, మిగిలిన ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్  చేశాడు. ఇటీవల నిర్వహించిన భూముల ఎంక్వైరీలో భాగంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి వెంచర్​ను పరిశీలించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్లాట్లుగా చేసిన భూమికి రైతుబంధు పడుతుండడంతో అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా నాలా కన్వర్షన్  లేదని తేలింది. ఆర్డీవో ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపించారు.