
- పేదల భూములపై పెద్దల కన్ను
- కబ్జా చేసి వెంచర్లు చేస్తున్న రియల్టర్లు, లీడర్లు
హనుమకొండ, వెలుగు : పేదలు వ్యవసాయం చేసుకొని బతికేందుకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు ప్రస్తుతం వారికి దక్కకుండా పోతున్నాయి. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో అసైన్డ్ భూములపై కన్నేసిన రియల్టర్లు, పొలిటికల్ లీడర్లు ఆ భూములను చేజిక్కించుకుంటున్నారు. ఈ విషయంపై బాధితులు ఎన్నిసార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు.
సగానికిపైగా ఇతరుల చేతుల్లో..
రాష్ట్రంలో 1974 నుంచి 2014 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గత ప్రభుత్వాలు భూములను అసైన్డ్ చేశాయి. హనుమకొండ జిల్లాలో సుమారు 80 వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూములను ఎవరూ కొనుగోలు చేయకుండా 1977లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తికి అసైన్డ్ చేసిన భూమిని అమ్మడానికి గానీ, కొనడానికి గానీ వీలు లేదు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అసైన్డ్ భూములు చాలా మంది చేతులు మారాయి. కొందరు తమ అవసరాల కోసం అసైన్డ్ భూములను అమ్ముకోగా, కొన్ని చోట్ల రియల్టర్లు, రాజకీయ పార్టీల నేతలు అక్రమంగా సొంతం చేసుకున్నారు.
ఓ వైపు ప్రభుత్వం.. మరో వైపు రియల్టర్లు
పేదలకు ఇచ్చిన భూములను ఓ వైపు ప్రభుత్వం తీసుకుంటుండగా, మరో వైపు రియల్టర్లు, లీడర్లు లాక్కుంటున్నారు. భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు తన భూములను పేదలకు పంచగా ఆ భూములను ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం వెనక్కి తీసుకుంది. దీంతో సుమారు 120 ఫ్యామిలీలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో పేదలకు ఇచ్చిన సుమారు 130 ఎకరాలను గతేడాది తిరిగి స్వాధీనం చేసుకొని ఉని సిటీ పేరుతో ‘కుడా’ బిజినెస్ చేస్తోంది.
మరికొన్ని చోట్ల రియల్టర్లు, బిల్డర్లు రాజకీయ నేతల అండదండలతో ఖాళీగా కనిపించిన జాగాలను కబ్జా చేయడం, ఇండ్లు కట్టి అమ్మేయడం చేస్తున్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో 1,058, 1,104 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూములను ఇప్పటికే నామరూపాల్లేకుండా చేసేశారు. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు తీసుకుని, వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేశారు.
ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
తమకు కేటాయించిన అసైన్డ్ భూములను లీడర్లు, రియల్టర్లు ఆక్రమిస్తున్నారని బాధితులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని సుబ్బయ్యపల్లి సర్వే నంబర్ 190లోని సుమారు 13.30 ఎకరాల అసైన్డ్ భూమిని కాంగ్రెస్ హయాంలో దళితులకు ఇచ్చారు. ఆ భూమిపై కన్నేసిన కొందరు రియల్టర్లు సర్వే నంబర్‌ను మార్చి, ఆ భూమిని ఆక్రమించి మొత్తం చదును చేశారు. సిద్ధాపురం, వెంకటాపురంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో బాధితులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని బాధితుల వాపోతున్నారు.