దాచారం గుట్టపై రియల్టర్ల కన్ను

దాచారం గుట్టపై రియల్టర్ల కన్ను

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయ సమీపంలోని దాచారం గుట్టపై రియలర్ల కన్నుపడింది. పట్టా భూమి పేరిట కొందరు  గుట్టపై భాగాన్ని తవ్వేందుకు కొద్ది రోజులుగా రియల్టర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో గుట్టపైనున్న ఆలయాలు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మల్లన్న గుడికి కిలోమీటర్ ​దూరంలోనే...

కొమురవెల్లి మల్లన్న టెంపుల్​కు కిలోమీటరు దూరంలో దాచారం గుట్ట(సంగన్న గుట్ట)  దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.  ఈ గుట్టపై సంగన్న గుడి , నంది ఆలయం, మల్లన్న పాదాలు, ఆంజనేయస్వామి , బ్రహ్మంగారి ఆలయాలున్నాయి. గుట్టభూమిలో 1.20 ఎకరాలను తపాసుపల్లి రిజర్వాయర్ కాలువ కోసం ప్రభుత్వం కేటాయించింది. గుట్టను ఆనుకొని 305 /ఎ సర్వే నంబర్ లో ఉన్న దాదాపు 20.1 ఎకరాల పట్టా భూమిని కొందరు రియల్టర్లు కొనుగోలు చేశారు. వాటిని ప్లాట్లుగా చేసే పనులను ప్రారంభించారు. ఇదే అదునుగా గుట్టపై తవ్వకాలు చేపట్టారు. నాలుగైదు రోజులుగా గుట్టపై ఉన్న రాళ్లను  తొలగించేందుకు బ్లాస్టింగ్ చేస్తున్నారు. గుట్టపై నుంచి భారీ శబ్దాలతో వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు అక్కడికెళ్లి చూశారు. వారి రాకను గమనించిన అక్రమార్కులు పనులు వదిలేసి వెళ్లారు. వారు పోగానే మళ్లీ పనులు చేస్తున్నారు. తవ్వకాల వల్ల గుట్టపైనున్న సంగన్న గుడి , నంది ఆలయం, మల్లన్న పాదాలు, ఆంజనేయస్వామి , బ్రహ్మంగారి ఆలయాలు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ తవ్వకాలపై  గ్రామస్తులు, బీజేపీ, సీపీఎం నాయకులు తహసీల్దారుతోపాటు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.

పర్మిషన్​ లేకుండానే తవ్వకాలు

దాచారం గుట్టపై పట్టా భూమిలో  రెవెన్యూ, మైనింగ్ శాఖ ల నుంచి ఎలాంటి పర్మిషన్​లేకుండానే తవ్వకాలు సాగిస్తున్నారు. కొమురవెల్లి పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో  పట్టా భూముల పేరిట గుట్టను తవ్వి చదును చేసి ప్లాట్లు చేస్తున్నారు. పట్టా భూముల్లో తవ్వకాలకు  స్థానిక  తహసీల్దారు నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్​ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మైనింగ్‌‌‌‌ డిపార్ట్​మెంట్​తవ్వకాలకు పర్మిషన్​ ఇస్తుంది. పర్మిషన్​ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలకు క్యూబిక్ మీటర్ కు రూ.30 చొప్పున రాయల్టీ వస్తుంది. కొద్ది రోజులుగా దాచారం గుట్టపై గుట్టుగా సాగుతున్న తవ్వకాలతో గుట్టపైనున్న ఆలయాలు దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. గతంలోనూ కొమురవెల్లి ఆలయ భూముల్లో ఇటీవల కొందరు తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతానికి తవ్వకాలు నిలిచిపోయాయి. 

ఫిర్యాదుపై  చర్యలు తీసుకుంటున్నాం

దాచారం గుట్టపై పట్టా భూమి పేరిట తవ్వకాలు సాగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నాం. పట్టా భూమిలో తవ్వకాలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. గుట్టపై తవ్వకాలు జరగకుండా  చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని విషయాలను పరిశీలిస్తున్నాం. - లక్ష్మీనారాయణ, తహసీల్దారు, కొమురవెల్లి