రండి బాబూ రండి..హైడ్రా ప్రూఫ్​ ఉంది... కస్టమర్లకు రియల్టర్ల మెసేజ్​లు, ఫోన్లు

రండి బాబూ రండి..హైడ్రా ప్రూఫ్​ ఉంది... కస్టమర్లకు రియల్టర్ల మెసేజ్​లు, ఫోన్లు
  • కస్టమర్లకు రియల్టర్ల మెసేజ్​లు, ఫోన్లు
  • కొత్త ప్రాపర్టీలు కొనేందుకు జనం వెనకాడుతుండడంతో కొత్త ప్రచారం  
  • డిప్యూటీ సీఎం రిలీజ్​చేసిన మ్యాపుల్లో తమ ఏరియాలు లేవంటున్న టెలీకాలర్లు  
  • ఒక ప్లాట్​కొంటే మూడు ప్లాట్లు 
  • ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్లు
  • 80 శాతం బ్యాంకు లోన్లు కూడా ఇప్పిస్తామని క్యాంపెయిన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులతోపాటు ఇతర ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై హైడ్రా కొరడా ఝళిపిస్తుండడంతో ఆస్తులను కొనేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కొందరైతే ప్రస్తుతానికి ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో బిజినెస్ పెంచుకునేందుకు రియల్ వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించే తమ వెంచర్లకు ‘హైడ్రా ప్రూఫ్’ ఉందంటూ కస్టమర్లకు మెసేజ్ లు పంపిస్తున్నారు.

ఫోన్లు చేసి వివరిస్తున్నారు. అంతటితో ఆగకుండా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక ప్లాట్​కొంటే మూడు ప్లాట్లు ఫ్రీ అని, ఈ మధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన చెరువుల మ్యాపుల్లో తమ ఏరియాలు లేవని వివరిస్తున్నారు. 80 శాతం బ్యాంకు లోన్లు కూడా ఇప్పిస్తామని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ పండుగకు పెద్ద ఎత్తున బిజినెస్ పెంచుకునేందుకు ప్లాన్​చేస్తున్నారు. ఓఆర్ఆర్ కు దగ్గరలో ఒక ప్లాట్ కొంటే మూడు ప్లాట్లు ఫ్రీ అని, షాద్ నగర్ సమీపంలో ఒక ప్లాటు కొంటే రెండు ప్లాట్లు ఫ్రీ అని, అలాగే ఫోర్త్ సిటీలో ఒక ప్లాట్ కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఓఆర్ఆర్​ బల్దియాలో కలుస్తుందని..  

ఓఆర్ఆర్ పరిధిలోని ప్లాట్లను అమ్ముకునేందుకు రియల్​ఎస్టేట్​సంస్థలు కస్టమర్లకు ఎన్నో మాటలు చెబుతున్నాయి. ఓఆర్ఆర్ పరిధి మొత్తం గ్రేటర్ హైదరాబాద్​లో వీలీనం అవుతోందని, ఇప్పుడు ప్లాట్లు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో రేట్లు అమాంతం పెరుగుతాయని చెబుతున్నాయి. విలీనానికి సంబంధించి గతంలో సీఎం, మంత్రులు మాట్లాడిన వీడియోలను డాక్యుమెంటరీలుగా చేసి కస్టమర్లకు వాట్సాప్​చేస్తున్నారు. ముచ్చర్ల పరిధిలో ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వీడియోలతో అయితే లెక్కలేనంత ప్రచారం జరుగుతోంది. జనంలో హైడ్రా భయం ఉండడంతో తమ వెంచర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

హైడ్రా ఎన్ఓసీలు ఇవ్వదు

హైడ్రా ఎటువంటి ఎన్ఓసీలు, ప్రూఫ్ లు ఇవ్వదని ఇప్పటికే పలుమార్లు కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రాపర్టీలు కొనాలనుకునే వారు అన్నీ ముందే చూసుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు. అనుమానాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం త్వరలో ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, దాంట్లో అన్ని వివరాలు పొందుపరుస్తామని చెబుతున్నారు. ఈ యాప్ వచ్చిన తర్వాత ప్లాట్లు, ఇండ్లు కొనాలని సూచిస్తున్నారు. అప్పటి వరకు కొనేవారు అనుమానాలుంటే హైడ్రా అధికారులను సంప్రదించవచ్చని అంటున్నారు.