చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

  • మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా 
  • ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు  
  • 15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట్టిస్తున్న వైనం 
  • నాలా, లే అవుట్ పర్మిషన్లు లేకుండానే రియల్ బిజినెస్ 
  • గుంటకూ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు, రైతు బీమా 

మంచిర్యాల, వెలుగు: ‘‘చెట్లకు డబ్బులు కాస్తాయా? అవునండీ.. కాస్తాయి! ఫామ్​ ల్యాండ్స్​పై పెట్టుబడి పెట్టండి.. పదిహేనేండ్లలో లక్షాధికారులు కండి” అంటూ మంచిర్యాల జిల్లాలో రియల్టర్లు ఫామ్​ల్యాండ్స్ పేరిట సరికొత్త దందాకు తెరలేపారు. శ్రీగంధం చెట్లు పెంచుతామని, రిసార్ట్స్​లు నిర్మిస్తామని రూల్స్​కు విరుద్ధంగా వందల ఎకరాల్లో అక్రమ వెంచర్లు చేస్తున్నారు. వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకపోయినా అడిగే నాథుడు లేడు. ఈ దందా రియల్టర్లకు కాసులు కురిపిస్తుండగా, వారి మాటలు నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నిలువునా మునుగుతున్నారు. 

నాన్​లే అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో రియల్టర్లు జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ నయా దందాకు తెరలేపారు. గ్రామాల్లో నేషనల్​ హైవేలకు సమీపంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి గుంటల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. నాలా, లే అవుట్​ పర్మిషన్లు లేకుండానే గుంట నుంచి ఐదు గుంటల వరకు అగ్రికల్చర్​ ల్యాండ్​ కింద ధరణిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాటికి పట్టాదారు పాస్​బుక్​లు రావడంతో కొనుగోలుదారులు రైతులుగా నమోదై రైతుబంధు, రైతుబీమాకు అర్హులవుతున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగా గండిపడడమే కాకుండా కస్టమర్లకు ఎలాంటి రక్షణ లేకుండాపోతోంది. 

పెట్టిన మొత్తం రెట్టింపవుతుందని నమ్మించి..

ఫామ్ ల్యాండ్​వెంచర్లలో శ్రీగంధం చెట్లు పెంచుతామంటూ ప్లాట్లు అంటగడుతున్నారు. 15 ఏండ్లు పెంచితే ఒక్కో చెట్టుకు సరాసరి 20 కిలోల శ్రీగంధం దిగుబడి వస్తుందని, ప్రస్తుతం మార్కెట్​లో క్వాలిటీని బట్టి కిలోకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోందని, వచ్చే 15 ఏండ్లలో రెట్టింపు అవుతుందని నమ్మిస్తున్నారు. గుంటకు పది చెట్లు పెంచినా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. చెట్లను పెంచినందుకు 40 శాతం తాము తీసుకుని, 60 శాతం కస్టమర్లకు ఇస్తామంటున్నారు. గుంటకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే 15 ఏండ్లలో లక్షాధికారులు అవుతారంటూ మాయమాటలు చెప్తున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది పేదలు, చిరుద్యోగులు, చిరువ్యాపారులు, సింగరేణి కార్మికులు తమ కష్టార్జితాన్నంతా రియల్టర్లకు ముట్టజెబుతున్నారు. టౌన్లలో భూముల రేట్లు చుక్కల్లో ఉండడంతో ఆర్థిక స్తోమత లేనివారు తక్కువ ధరకే వస్తుందని ఫామ్​ల్యాండ్స్​ కొంటున్నారు. కొంతమంది రియల్టర్లు వెంచర్లలో చెట్లు పెంచుతుండగా, మరికొందరు ప్లాట్లు అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు.  

వందల ఎకరాల్లో దందా..

మంచిర్యాల జిల్లా కేంద్రానికి 5 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఫామ్​ల్యాండ్స్​ దందా జోరుగా సాగుతోంది. ప్రస్తుత హైవేలతో పాటు ప్రతిపాదిత హైవేల సమీపంలో ఎకరం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు వ్యవసాయ భూములు కొంటున్నారు. నాలా, లే అవుట్​పర్మిషన్లు తీసుకోకుండానే 30 ఫీట్ల రోడ్లు వేసి ప్లాటింగ్ చేస్తున్నారు. గజానికి రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారు. జిల్లాలో నాలుగేండ్ల కిందటే ఫామ్​ల్యాండ్స్​దందా మొదలు కాగా, ఇటీవల రిసార్ట్స్​పేరిట కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. జైపూర్ ​మండలంలో ఓ సంస్థ దాదాపు 200 ఎకరాల్లో ఫామ్​ల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేసింది. భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు సమీపంలో మరో సంస్థ 70 ఎకరాల్లో రిసార్ట్స్​ వెంచర్​ చేస్తోంది. 

మందమర్రి మండలం వెంకటాపూర్, గుడిపేట, లేమూరు శివార్లలో సుమారు 200 ఎకరాల్లో ఈ తరహా వెంచర్లు వెలిశాయి. హైదరాబాద్​కు చెందిన పలు రియల్​ఎస్టేట్​ సంస్థలు సైతం జిల్లా బాట పట్టాయంటే ఈ బిజినెస్ ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. లక్సెట్టిపేట మండలం శాంతాపూర్, లక్ష్మీపూర్, ఇటిక్యాల గ్రామ శివార్లలో సుమారు 250 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్​ వెంచర్లు వెలిశాయి. ముందుగా ప్లాట్లు కొన్నవారికి డిస్కౌంట్​ఆఫర్లతో పాటు లక్కీ డ్రాల్లో లక్షల విలువైన బహుమతులు ప్రకటించాయి. మార్కెటింగ్​ఏజెంట్లకు 30 నుంచి 40 శాతం కమీషన్లు ఇస్తూ కస్టమర్ల జేబులు ఖాళీ చేస్తున్నాయి.  

ప్రభుత్వాదాయానికి గండి..

ప్రభుత్వం నాన్​లే అవుట్లపై కొరడా ఝుళిపించడంతో రియల్టర్లు ప్రత్యామ్నాయంగా ఫామ్ ల్యాండ్​దందా సాగిస్తున్నారు. వ్యవసాయ భూములను రియల్​వెంచర్లు చేయాలంటే ముందుగా నాలా కన్వర్షన్​చేయించాలి. తర్వాత డీటీసీపీ పర్మిషన్​ తీసుకోవాలి. 33, 40 ఫీట్ల రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్​లు, సీనరేజీ ప్లాంట్లు నిర్మించాలి. అవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండ్​వాల్స్​ఏర్పాటు చేయాలి. కరెంట్, మంచినీటి సౌకర్యం కల్పించాలి. బడి, గుడి వంటి సామాజిక అవసరాల 10 శాతం భూమిని పంచాయతీకి రిజిస్ట్రేషన్​ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద తతంగం కావడంతో ఫామ్​ల్యాండ్​ పేరిట వ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. తద్వారా కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. ఇటీవల అధికారులు 20 గుంటల్లోపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినప్పటికీ కొన్ని చోట్ల గుట్టుగా చేస్తున్నట్టు సమాచారం.