నదులు, వాగుల బఫర్​ జోన్ల​ను పట్టించుకోని రియల్టర్లు 

  • నస్పూర్​, మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల శివార్లలో దందా 
  • పర్మిషన్లు ఇవ్వరాదన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్ 
  • లక్షల్లో నష్టపోనున్న కొనుగోలుదారులు..  ​  

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్​ ఎస్టేట్​ వెంచర్లు వెలుస్తున్నాయి. మంచిర్యాల, నస్పూర్​ మున్సిపాలిటీలతో పాటు వేంపల్లి, ముల్కల్ల గ్రామపంచాయతీల పరిధిలో రోజుకో వెంచర్ పుట్టుకొస్తోంది. మున్సిపల్​ మినిస్టర్​ కేటీఆర్​ బఫర్​ జోన్లలో వెంచర్లకు పర్మిషన్లు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు మంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు లక్షల్లో నష్టపోనున్నారు.  గోదావరి, రాళ్లవాగు, తోళ్లవాగు....  నిరుడు జూలైలో వచ్చిన వరదలు గోదావరి, రాళ్లవాగు, తోళ్లవాగు పరివాహక ప్రాంతాలను ముంచెత్తాయి. మంచిర్యాల, నస్పూర్​ మున్సిపాలిటీల్లోని సుమారు 15 కాలనీలు నీటమునిగాయి. వేంపల్లి, ముల్కల్ల పంచాయతీల పరిధిలోని పలు ఏరియాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. ముల్కల్ల నుంచి నస్పూర్​ వరకు గోదావరి శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు గోదావరికి, ఇటు మంచిర్యాల, లక్సెట్టిపేట మెయిన్​ రోడ్డుకు మధ్యనున్న ప్రాంతమంతా జలదిగ్భంధంలో చిక్కుకుంది. మంచిర్యాలలో రాళ్లవాగు, నస్పూర్​లో తోళ్లవాగు చుట్టుపక్కల ఏరియాల్లో నాలుగు రోజులపాటు జనజీవనం స్తంభించిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో తరచూ ఈ పరిస్థితి పునరావృతమవుతోంది.  

ముంపు ప్రాంతాల్లో వెంచర్లు....  

జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్​, వేంపల్లి, ముల్కల్ల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న వెంచర్లు మునిగిపోగా, ఇటీవల కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పాత మంచిర్యాలలో రాళ్లవాగు పక్కన ఓ భారీ వెంచర్​ వెలిసింది. సాయికుంట శివారు ప్రాంతాలు, గోదావరి రోడ్డులోని పలు వెంచర్లు, బైపాస్​ రోడ్డులోని మరో వెంచర్​ నీటమునిగాయి. నస్పూర్​లో తోళ్లవాగు, గోదావరి రోడ్డులోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇటీవల ఈ ఏరియాల్లో రియల్​ ఎస్టేట్​ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. అలాగే వేంపల్లి, ముల్కల్ల చుట్టుపక్కల సుమారు పది వెంచర్లు వెలిశాయి. ముల్కల్ల శివారులోని 303, 304 సర్వేనంబర్లలో మరో భారీ వెంచర్​ ఏర్పాటైంది. మరో పదెకరాల్లో ఫామ్​ల్యాండ్​ వెంచర్​ వెలిసింది. ముంపు ప్రాంతాలు కావడంతో రియల్టర్లు రైతుల దగ్గర వ్యవసాయ భూములను తక్కువ రేటుకు కొని వెంచర్లు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు రోడ్లు తీసి మట్టిపోయడమే కాకుండా సిమెంట్​ బిల్లలతో కాంపౌండ్​లు, అర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది లే ఔట్ పర్మిషన్లకు అప్లై చేసుకోగా, మరికొందరు నాన్​ లే ఔట్​ ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఏరియాను బట్టి గజం రూ.8వేల నుంచి రూ.15వేల వరకు అమ్ముతున్నారు.  పట్టించుకోని అధికారులు.... ముంపు ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేయరాదని రూల్స్​ ఉన్నప్పటికీ రియల్టర్లు పట్టించుకోవడం లేదు. గోదావరి, రాళ్లవాగు, తోళ్లవాగు ముంపు ప్రాంతాలను బఫర్​ జోన్​గా ప్రకటించినప్పటికీ యథేచ్ఛగా వెంచర్లు చేస్తున్నారు. అంతేగాకుండా మున్సిపల్​ మినిస్టర్​ కేటీఆర్​ సైతం ముంపు ప్రాంతాల్లో వెంచర్లకు, నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వరాదని ఆదేశించారు. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తే నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎలాంటి యాక్షన్​ తీసుకోవడం లేదు. కనీసం ముంపు ప్రాంతామా, కాదా? అన్నది ఎంక్వయిరీ చేయకుండానే గుడ్డిగా పర్మిషన్లు ఇస్తున్నారు. దీంతో లక్షలు వెచ్చించి ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.