శిష్యుడి వల్లే స్వామీజీ మృతి: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

శిష్యుడి వల్లే స్వామీజీ మృతి: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అఖిల భారతీయ అఖాడా పరిషత్ ప్రెసిడెంట్ మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ (72) మృతి కేసుపై దర్యాప్తులో సూసైడ్‌ నోటే కీలక ఆధారంగా మారింది. సోమవారం సాయంత్రం నరేంద్ర గిరి స్వామీజీ బాఘంబరీ మఠంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారంటూ పోలీసులకు సమాచారం అందించింది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్నం ఆయన సభలో పాల్గొనేందుకు రావాల్సి ఉన్నా.. బయటకు రాకలేదు. ఎంతసేపు పిలిచినా ఆయన గదిలో నుంచి ఏ మాత్రం చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చి సాయంత్రం తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లామని, ఆయన ఉరికి వేలాడుతూ కనిపించారని శిష్యులు తెలిపారు. స్వామీజీ గదిలో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌లో తన శిష్యులు ఆనంద్ గిరితో పాటు సందీప్ తివారీ, ఆద్యా తీవారీల పేర్లను ఆయన ప్రస్తావించారని చెప్పారు.

వారం క్రితమే చనిపోవాలనుకున్నా..

సూసైడ్‌లో స్వామీజీ విస్తుపోయే విషయాలను పేర్కొన్నారు. ‘‘కొద్ది రోజులగా నేను ఆనంద్‌ గిరి కారణంగా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. వారం క్రితం సెప్టెంబర్ 13నే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ ఆ రోజు ధైర్యం సరిపోలేదు. అయితే ఆనంద్‌ గిరి నాపై కొత్త కుట్రలు చేస్తున్నాడని తెలిసింది. నేను అమ్మాయిలతో ఉన్నట్లు కంప్యూటర్‌‌లో మార్ఫింగ్ చేసి వైరల్ చేయాలనుకుంటున్నాడని సమాచారం అందింది. ఒక వేళ ఆనంద్ గిరి ఆ పని చేస్తే నేను వివరణ ఇవ్వొచ్చు. కానీ ఇన్నాళ్లూ అందరూ గర్వపడేలా, అభిమానించేలా బతికాను. ఒక్కసారి అలాంటి ఫోటోలు వైరల్ అయితే నా పరువు పోతుంది. నా గౌరవం నశించిపోయాక బతకడం వృథా. ఈ ఆలోచనలతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నా”అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. 

గెంటేస్తే కాళ్లు పట్టుకుని మఠంలో చేరాడు

మఠంలో అక్రమాలు చేసినందుకు గతంలో ఆనంద్‌ గిరిని స్వామీజీ నరేంద్ర గిరి వెళ్లగొట్టారని, అతడిపై రౌడీ షీట్‌ కూడా ఉందని పోలీసులు తెలిపారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆనంద్ స్వామీజీ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడంతో మళ్లీ మఠంలోకి రానిచ్చారన్నారు. కొన్ని భూ వ్యవహారాలు, ఆర్థిక మోసాల విషయంలో ఆనంద్ గిరి కొన్నాళ్లుగా అక్రమాలు చేస్తూ దొరికిపోవడంతో తన తప్పులు బయటకు రాకుండా స్వామీజీపై బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టినట్లు శిష్యుల సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆనంద్‌ గిరితో పాటు మరో ఇద్దరు శిష్యులు  సందీప్ తివారీ, ఆద్యా తీవారీ కూడా తన ఆత్మహత్యకు కారకులుగా మహంత్ సూసైడ్‌ నోట్‌లో రాశారు. ఈ ముగ్గురినీ కఠినంగా శిక్షించాలని, తద్వారానే తన ఆత్మకు శాంతి కలుగుతుందని అందులో ఆయన కోరారు. ఇక తన తర్వాత మఠానికి ఎవరు మహంత్‌గా ఉండాలనేది కూడా ఆయన సూసైడ్‌ నోట్‌లో సూచించారు. తన శిష్యుడు బల్బీర్‌‌ను మహంత్‌గా నియమించాలని రాశారు.


కఠినంగా శిక్షిస్తామన్న సీఎం యోగి

స్వామీజీ మృతి కేసులో ఇప్పటికే పలు ఆధారాలను సేకరించామని, దోషులను విడిచిపెట్టేది లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి మహంత్ నరేంద్ర గిరి లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు రామ పాదాల దగ్గర స్థానం దొరకాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. స్వామీజీ లేని లోటున తట్టుకునే శక్తిని ఆయన శిష్యులకు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మహంత్ మృతి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్ మౌర్య తెలిపారు. సోమవారం రాత్రే ఆయన శిష్యుడు ఆనంద్‌ గిరిని హరిద్వార్‌‌లో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. మరో ఇద్దరు శిష్యులు సందీప్ తివారీ, ఆద్యా తీవారీలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం