నిరుద్యోగుల పేరిట ఆందోళనలు నడుపుతున్నదెవరు?

నిరుద్యోగుల పేరిట ఆందోళనలు నడుపుతున్నదెవరు?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో  కొద్ది రోజులుగా డీఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్ 1 రిజల్ట్ 1:100 రేషియోలో ఇవ్వాలని, గ్రూప్ 2, 3ల పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల పేరిట ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నదెవరు?  విద్యార్థుల త్యాగాలను మొదటి నుంచీ తమ పార్టీ  పునాదులుగా చేసుకున్నదెవరు? ఈ ఆందోళనలో నిజంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఇది నిరుద్యోగుల నుంచి పుట్టిన ఉద్యమమా..?  పిడికెడు మంది పుట్టించిన కృత్రిమ ఉద్యమమా? ఈ ఆందోళనలతో నష్టం జరిగేదెవరికి ? అనే విషయాలు సునిశితంగా పరిశీలించి అర్థం చేసుకోకుంటే నిరుద్యోగులు మోసపోవడం ఖాయం. 

గత పదేండ్లలో ఉద్యోగ నియామకాల విషయంలో  కేసీఆర్​ సారథ్యంలోని  బీఆర్ఎస్  సర్కార్ ప్రదర్శించిన నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం, యువత ఉపాధిపై ఉదాసీనత  రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలిసిందే. తొలి ఎనిమిదేండ్లలో గ్రూప్ 1 పరీక్షను ఒక్కసారి కూడా నిర్వహించలేదు. చివరి ఏడాదిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే సర్కార్ అసమర్థత కారణంగా పేపర్ లీకైంది. దీంతో అప్పటికే ఏళ్ల తరబడి గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయి రాసిన నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. మరోసారి పరీక్ష నిర్వహణలో చేసిన తప్పిదాల కారణంగా రెండోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. 

గ్రూప్​1 పరీక్ష నిర్వహణలో.. కేసీఆర్​ సర్కార్​ ఫెయిల్​

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో కేసీఆర్​ సర్కార్ ఫెయిల్ కాగా.. నిరుద్యోగులు నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేయబడ్డారు. కానీ, ఏనాడు తమ తప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదు. పైగా ప్రశ్నించిన నిరుద్యోగులపై, మేధావులపై ఎదురుదాడికి దిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షను సక్సెస్​ఫుల్​గా నిర్వహించడం,  గత పదేండ్లలో నిర్వహించని డీఎస్సీని ఇప్పుడు నిర్వహిం చబోతుండడం గులాబీ బ్యాచ్ కు మింగుడు పడడం లేదు. ప్రజా ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరొస్తుందో అనే భయంతో గులాబీ లీడర్లు కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారు. 

వాయిదా పడితే..

పరీక్షలు వాయిదా పడితే మరో నాలుగు బ్యాచ్ లు నడిపి కోట్లాది రూపాయలు సంపాదించవచ్చనే దుర్బుద్ధితో కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సైతం పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. వాస్తవానికి ఇష్టారాజ్యంగా పరీక్షలు వాయిదా వేయడం, ఎప్పుడుపడితే అప్పుడు పరీక్షలు నిర్వహించడం అంత ఈజీ కాదు.

కేంద్ర ప్రభుత్వ నియామ‌‌‌‌‌‌‌‌క ప‌‌‌‌‌‌‌‌రీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే  పోటీ ప‌‌‌‌‌‌‌‌రీక్షలతో ఆటంకాలు ఎదురవుతాయి. వీటన్నింటిని క్రాస్ చేసుకుని పరీక్షల తేదీలను నిర్ణయించాల్సి ఉంటుంది. 

న్యాయ వివాదాలు తలెత్తే ప్రమాదం.. 

సుమారు పుష్కర కాలం త‌‌‌‌‌‌‌‌ర్వాత నిర్వహించిన గ్రూప్ 1 ప‌‌‌‌‌‌‌‌రీక్షకు నాలుగు ల‌‌‌‌‌‌‌‌క్షల మంది అభ్యర్థులు పోటీ ప‌‌‌‌‌‌‌‌డ్డారు.  ప్రిలిమిన‌‌‌‌‌‌‌‌రీ ప‌‌‌‌‌‌‌‌రీక్షను టీజీపీఎస్సీ ప‌‌‌‌‌‌‌‌కడ్బందీగా నిర్వహించి నోఫికేష‌‌‌‌‌‌‌‌న్ లో పేర్కొన్న ప్రకారం.. ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున‌‌‌‌‌‌‌‌ మెయిన్స్ కు ఎంపిక చేశారు. కానీ, 100 మందిని ఎంపిక చేయాలని బీఆర్ఎస్ నాయకులు కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. 

అయితే, నోటిఫికేషన్ కు విరుద్ధంగా నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను స‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌రిస్తే రేపు ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశముంది.అదే జరిగితే గ్రూప్ 1 కథ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముంది. అందుకే,  ప్రభుత్వం నిరుద్యోగుల శ్రేయస్సును ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది.

నష్టపోయేది నిరుద్యోగులే

ఇప్పటికే నిరుద్యోగులకు  ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 28,942 ఉద్యోగ నియామ‌‌‌‌‌‌‌‌కాలు చేపట్టింది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1,  గ్రూప్ 2,  గ్రూప్ 3 నియామ‌‌‌‌‌‌‌‌కాల‌‌‌‌‌‌‌‌కు ఉన్న కోర్టు చిక్కుల‌‌‌‌‌‌‌‌న్నింటిని అధిగ‌‌‌‌‌‌‌‌మించి నోటిఫికేషన్లు జారీ చేసింది.  శాస‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ బ‌‌‌‌‌‌‌‌డ్జెట్ స‌‌‌‌‌‌‌‌మావేశాల్లోనే  చ‌‌‌‌‌‌‌‌ర్చించి జాబ్ క్యాలెండ‌‌‌‌‌‌‌‌ర్ కూడా  విడుద‌‌‌‌‌‌‌‌ల చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ క్రమంలో న్యాయ వివాదాలు తలెత్తవద్దని భావిస్తే ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులు కొంత సమయమివ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహకరించాలి. నోటిఫికేషన్​ నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెంచాలనడం, గ్రూప్ 1 రిజల్ట్ లో 1: 100 ఇవ్వాలనడంలాంటి డిమాండ్లన్నీ నోటిఫికేషన్లు రద్దయ్యేలా చేస్తున్న కుట్రలో భాగమేనని అర్థం చేసుకోకుంటే అంతిమంగా మళ్లీ నష్టపోయేది నిరుద్యోగులే. 

ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే.. 

పదేండ్ల కాలంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోయినా,  గ్రూప్ 1 పేపర్ లీకైనా ఏనాడూ తమ పార్టీ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ ను అడగని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాత్రం చిత్రంగా గగ్గోలు పెట్టడం వింతగా ఉంది. కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో బీఆర్ఎస్ లీడర్లు ప్రత్యక్షంగా పాల్గొనడం చూస్తున్నాం.

తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాగే ఉద్యోగాల పేరిట యువతను రెచ్చగొట్టి, ఆత్మహత్యలకు ప్రేరేపించి తీరా రాష్ట్రం వచ్చాక నిరుద్యోగులను మరిచిన చరిత్ర బీఆర్ఎస్​ది. అధికారం పోయేసరికి మళ్లీ విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్​ ప్రయత్నిస్తోంది. 

నిరుద్యోగులు పట్టని నేతలకు నైతికత ఉందా?

పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిలైందనేది కాదనలేని వాస్తవం. ఈ నిజాన్ని దాచి, నిరుద్యోగులను మభ్యపెట్టి.. కాంగ్రెస్ సర్కార్  ఫెయిలైందని యువతకు చూపేందుకే బీఆర్ఎస్ నాయకులు పిడికెడు మంది రాజకీయ నిరుద్యోగులను పట్టుకుని కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారు.

పదేండ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యలపై ఎన్నడూ మాట్లాడని మాజీ మంత్రి హరీష్ రావుకు, ఇతర బీఆర్ఎస్ లీడర్లకు ఇప్పుడు నిరుద్యోగ సమస్యలపై మాట్లాడే నైతిక‌‌‌‌‌‌‌‌ హక్కు ఉన్నదా? అసలైన నిరుద్యోగులు ఎప్పడూ బీఆర్​ఎస్​ నేతల ఊబిలో చిక్కుకోరు. కృత్రిమ ఆందోళనలు ఎప్పుడూ నిజం కాలేవు. నిజమైన నిరుద్యోగులు అన్ని పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుకుంటున్నారు. 

డీఎస్సీని ఎన్నిసార్లు  వాయిదా వేయాలి?

రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 2023 నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ టెస్ట్(టీఆర్టీ) నిర్వహించేందుకు అప్పట్లో షెడ్యూల్ ప్రకటించారు. అయితే నవంబర్ 30న ఎన్నికలు ఉండడంతో టీఆర్టీ పరీక్షలను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా వేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11,062 టీచర్ పోస్టులతో  నోటిఫికేషన్ ఇచ్చి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోసారి టెట్ నిర్వహించాకే డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం వారికి అవకాశమిచ్చింది. దీంతో డీఎస్సీ పరీక్షార్ధుల సంఖ్య మరికొంత పెరిగింది. ఆరు, ఏడు నెలలుగా వాయిదా పడుతున్న డీఎస్సీని మరోసారి వాయిదా వేయాలని కోరడం ఏమాత్రం సబబు కాదు. డీఎస్సీ రాసేందుకు మెజార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయి ప్రిపరేషన్ లో ఉన్నారు. 

- డాక్టర్ గుగులోత్ దేవోజీ నాయక్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, 
ఎకనామిక్స్ విభాగం, కేయూ