పూర్తి స్థాయి బడ్జెట్ చాన్స్ ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్.. కారణమిదే

పూర్తి స్థాయి బడ్జెట్ చాన్స్ ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్.. కారణమిదే

Reason for vote on account budget, explained by CM Kcrఅసెంబ్లీ ఎన్నికలను డిసెంబరు కల్లా పూర్తి చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా ఓటాన్ అకౌంట్ (తాత్కాలిక) బడ్జెట్ నే పెట్టారు. సాధారణంగా ఎన్నికలకు ముందు లేదా ఎన్నికలు పూర్తయి సాధారణ బడ్జెట్ కు తక్కువ సమయం ఉన్నప్పుడో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ రాష్ట్రంలో సాధారణ బడ్జెట్ కు ముందే ప్రభుత్వం ఏర్పడినా సీఎం కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ఎంచుకున్నారు. దీనికి ప్రత్యేక కారణాలున్నాయని ఆయన సభకు వివరించారు.

కేంద్రం ఇచ్చేవాటిపై అవగాహన కోసమే

‘‘తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి రాబడిని పెంచటం, అవసరాలను తీర్చుకోవడం ఎలా అనే అంశాలపై తొలి ప్రభుత్వానికి స్పష్టమైన అంచనాలు లేవు. ఐదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు పూర్తి అవగాహన ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక స్థితి, సామర్థ్యం, ఆర్థిక వృద్ధి, రాష్ట్ర ప్రాధాన్యతలపై పూర్తి స్పష్టత ఉంది. దీని ఆధారంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రకారమే ఏటా బడ్జెట్ కేటాయింపు చేయాలని నిర్ణయించాం’’ అని కేసీఆర్ చెప్పారు. అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టిందని, అందువల్లే రాష్ట్రంలోనూ ఇదే ఫాలో అవ్వాల్సి వచ్చిందని తెలిపారు.

పూర్తి స్పష్టతతో..

కేంద్రం ఓటాన్ అకౌంట్ పెట్టడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి? ఏఏ రంగాలకు ఎట్లా కేటాయింపులుంటాయి? వారి ప్రాధాన్యాలేంటి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? వంటి అంశాలపై స్పష్టత లేకపోయిందన్నారు. కేంద్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితేనే, రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత ఆర్థిక సహకారం అందుతుందనే విషయంపై క్లారిటీ వస్తుందని కేసీఆర్ అన్నారు.

ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, రాష్ట్రంలోనూ మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతామని సభకు తెలిపారు కేసీఆర్.