కొందరి హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంటుంది. ఇంకొందరిదేమో అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. అందుకే హ్యాండ్ రైటింగ్ బాగుండేవాళ్లకు స్కూల్‌లో కాస్త ఎక్కువ మార్కులు వస్తుంటాయి. మార్కులు రావడమే కాదు.. హ్యాండ్ రైటింగ్ మానసిక స్థితిని కూడా తెలుపుతుంది. అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ఒక్కోసారి హ్యాండ్ రైటింగ్ మారుతుంటుంది. ఎంత ప్రయత్నించినా మునుపటిలా అందంగా రాదు. కానీ.. ఆ విషయాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. అయితే... దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుంది అంటున్నారు సైంటిస్ట్‌లు. ఒత్తిడితో ఉన్నప్పుడు రాస్తే ఒకరకంగా, సంతోషంగా ఉన్నప్పుడు రాస్తే మరో రకంగా ఉంటుందట చేతి రాత. అంటే.. వ్యక్తి మానసిక స్థితికి అనుగుణంగా హ్యాండ్ రైటింగ్ మారుతూ ఉంటుంది. అంతేకాదు... హ్యాండ్ రైటింగ్ ఒక వ్యక్తి తెలివితేటలు, ఆప్టిట్యూడ్, స్వభావం, బలం, బలహీనత, వ్యసనం, నేరపూరిత ఆలోచనలు, ఆసక్తులు, ద్వేషం, సామర్థ్యం లాంటివన్నీ చెప్తుందట.
కాంపాక్ట్ వర్డ్ స్పేసింగ్
రాసేటప్పుడు ఏ పదం తరువాత స్పేస్ ఇవ్వాలి అనేది కరెక్ట్‌గా చేస్తుంటే.. అటువంటి వాళ్లు ఎప్పుడూ ఇతరులతో మంచిగా ఉండాలని కోరుకుంటారు. స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఇతరుల సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ల మద్దతు కోరుకుంటారు. ఎప్పుడూ ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది.
ఎక్ప్‌పాండెడ్ వర్డ్ స్పేసింగ్
పదాల మధ్య స్పేస్ ఎక్కువగా ఉంటే.. ఈ రకమైన వ్యక్తులు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు.. వాళ్లు ఇతరులతో ఈజీగా కనెక్ట్ కూడా కాలేరు.
ఎక్స్‌ట్రా లార్జ్ హ్యాండ్ రైటింగ్
అక్షరాలు పెద్దగా కనిపించేలా రాసే వాళ్లకు ఉన్నతమైన భావాలు ఉంటాయి. ఆధిపత్యం వహిస్తారు. అన్ని విషయాలను బయటకే చెప్తుంటారు. ఎవరి దగ్గర తాను తక్కువ కాదు అన్నట్టు ఉంటారు.
చాలా చిన్నగా..
చిన్న అక్షరాలు రాసే వాళ్లు ఏకాగ్రత, పరిశీలనా శక్తి కలిగి ఉంటారు. ఏ పనిచేసినా పర్ఫెక్ట్గా చేస్తారు.
సాధారణ సైజు
ఇటువంటి వ్యక్తుల స్వభావం బ్యాలెన్స్డ్గా, మంచి అనుచరులుగా, విధేయత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీళ్లలో గొప్పదనం ఏంటంటే మొండిగా ఉండరు. శాంత స్వభావం కలిగి ఉంటారు.
వేరియబుల్ సైజు
ఇలా రాసే వాళ్ల చేతిరాత ఒక పద్ధతిలో ఉండదు. ఇలాంటి వ్యక్తులు మూడీగా ఉంటారు. ఏకాగ్రత ఉండదు. బాధ్యతగా ఉండరు. సోమరితనం ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు.
నిటారుగా..
నిటారుగా ఉండే హ్యాండ్ రైటింగ్ ఉంటే అది భావోద్వేగ వ్యక్తీకరణతో ముడిపడి ఉంటుంది. కుడి వైపు- వాలుగా రాస్తే ఉద్వేగభరితమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అయితే.. ఎడమ వైపు -వాలుగా ఉంటే ఆత్మపరిశీలన, రిజర్వ్‌డ్ ఎమోషన్స్ ఉన్నట్టు.
అక్షరాల మీద ఒత్తిడి
పెన్ను మీద బాగా ఒత్తిడి పెట్టి రాస్తే.. ఎమోషనల్ ఇంటెన్సిటీతో ముడిపడి ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, బలమైన భావోద్వేగాలు, సంకల్పం ఉన్న వ్యక్తులు ఇలా రాస్తుంటారు. తక్కువ ప్రెజర్ పెట్టి రాస్తే.. సున్నితమైన స్వభావం ఉన్నవాళ్లు అన్నమాట.
బేస్‌లైన్
రెండు లైన్ల మధ్యలో ఉండే స్పేస్‌ను బేస్‌లైన్ అంటారు. బేస్‌లైన్ స్పేస్ తక్కువగా ఉండేలా రాసే వ్యక్తులకు స్టెబిలిటీ ఎక్కువ. అన్ని లైన్ల మధ్య స్పేస్ సమానంగా ఉంటే.. బ్యాలెన్స్‌డ్ పర్సనాలటీ.
లెటర్ షేప్స్
అక్షరాల ఆకారాలు కూడా పర్సనాలిటీని చెప్తాయి. గుండ్రని అక్షరాలు రాసే వాళ్లలో క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నట్టు. ఒకే కోణంలో అక్షరాలు ఉంటే ఎనలిటికల్ ఆలోచనలు ఎక్కువ. సంతకం చిన్నగా పెట్టేవాళ్లు వినయం, సంయమనంతో ఉంటారు.