- ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలెన్నో
- అవినీతిపై పోరాడేందుకు వచ్చి.. అదే ఊబిలో చిక్కుకుని..!
- ఆగమైన కేజ్రీవాల్ అండ్ కో
- లిక్కర్ స్కామ్‌తో మొదలైన వ్యతిరేకత
- అధికార నివాసానికి రూ.33 కోట్లతో రిపేర్లపై దుమారం
న్యూఢిల్లీ: ‘‘ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. సామాన్యుడ్ని ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. అవినీతిపై పోరాడేందుకు, సామాన్యుడికి సేవ చేసేందుకే మేం పార్టీ పెడ్తున్నం’’... ఇదీ 2012 నవంబర్ 26న అర్వింద్ కేజ్రీవాల్ చెప్పిన మాట. చెప్పినట్టుగా ఆ రోజు పార్టీని ప్రకటించారు. సామాన్యుడి పేరుతోనే తన పార్టీకి ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’గా నామకరణం చేశారు. అవినీతి పార్టీలను ఊడ్చేస్తామంటూ ‘చీపురు కట్ట’ సింబల్‌తో ముందుకు వచ్చారు. అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచి మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
కేజ్రీవాల్ పార్టీ పెట్టిన కొత్తలో క్యాండిడేట్ ఎవరనేది కూడా చూడకుండా మద్దతు ప్రకటించిన ఓటర్లే.. ఇప్పుడు కేజ్రీ‘వాల్’ను కూల్చేశారు. ‘ఇక చాలు’ అంటూ ఇంటికి సాగనంపారు. తాను సామాన్యుడ్ని అంటూ ‘మఫ్లర్ మ్యాన్’గా జనాల్లో తిరిగిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడానికి, ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటూ ముందుకు వచ్చాడో.. అదే అవినీతి ఆరోపణల్లో కేజ్రీవాల్ కూరుకుపోవడాన్ని ఓటర్లు సహించలేకపోయారు. ‘‘చెప్పింది ఒకటి.. చేస్తున్నది ఒకటి’’ అంటూ ఎన్నికల్లో ఆప్‌పై తిరగబడ్డారు. లిక్కర్ స్కామ్ మొదలు శీష్ మహల్ వరకు అనేక అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్‌ను చుట్టుముట్టాయి. చివరికి అవి ఆయన పార్టీని ఢిల్లీ గద్దె నుంచి దించాయి.
అన్నా హజారేతో కలిసి నడిచి..!
2011లో ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన ‘జన్‌లోక్‌పాల్’ ఉద్యమంతో అర్వింద్ కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చింది. అన్నా హజారేకు సపోర్ట్‌గా ఆ ఉద్యమంలో కేజ్రీవాల్ విస్తృతంగా పాల్గొన్నారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన ఆయన.. 2012 నవంబర్‌లో తాను రాజకీయ పార్టీ పెడ్తున్నట్లు ప్రకటించారు. అవినీతిపై పోరాడేందుకు, సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు తాను ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయిన కేజ్రీవాల్.. ఆ తర్వాత పొత్తులు కుదరక 49 రోజులకే రాజీనామా చేశారు. 2015 ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్ల భారీ మెజార్టీతో ఆప్ గెలిచి.. కేజ్రీవాల్మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా మొదట్లో హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్‌పై ఆయన ఫోకస్ పెట్టారు. స్కూళ్లను తీర్చిదిద్దారు. మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేశారు.
మూడోసారి సీఎం అయ్యాక..!
మూడోసారి సీఎంగా బాధ్యత చేపట్టాక కేజ్రీవాల్ తీరు వివాదాస్పదమవుతూ వచ్చింది. ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారో.. అదే అవినీతి ఆరోపణలు ఆయనను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ స్కామ్‌లో ఏకంగా సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాలే కీలక సూత్రధారిగా జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఈ వ్యవహారం ఆయన చరిష్మాను దెబ్బకొట్టింది. సీఎం అధికారిక నివాసానికి రూ. 33 కోట్లతో రిపేర్లు చేయించుకోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. రిపేర్ల వ్యవహారాన్ని కాగ్ తన రిపోర్ట్‌లో బయటపెట్టింది. 2020లో రూ.7.91 కోట్ల అంచనాలతో రిపేర్లను ప్రారంభించి.. 2022 నాటికి రూ.33 కోట్లు ఖర్చు చేశారని తేల్చిచెప్పింది.
సామాన్యుల సీఎంగా చెప్పుకునే వ్యక్తి తన ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’ కోసం ఇట్ల కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ప్రధాని మోదీ సహా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజలు కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పైగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కట్టడికి ఆప్ సర్కార్ తగిన చర్యలు చేపట్టడం లేదని.. రోడ్లు, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనను కూడా గాలికి వదిలేసిందంటూ జనంలో వ్యతిరేకత తీవ్రమైంది. అవినీతి ఆరోపణలకు తోడు ఢిల్లీలో మౌలిక వసతులు లోపించడం, వాయికాలుష్యాన్ని కట్టడి చేయకపోవడం.. ఇట్ల అనేక కారణాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలయ్యాయి. ‘‘మోదీ..! మీరు ఈ జన్మలో మమ్మల్ని ఓడించలేరు. మరు జన్మలో కూడా మీకు సాధ్యం కాదు’’ అంటూ చెప్పిన కేజ్రీవాలే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయినోళ్లంతా ఓడారు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసారు. ఈ స్కాంతో నేతలు పదవుల్ని కోల్పోయి, జైలు జీవితం గడిపారు. అయితే ఎన్నికల్లో దీన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేసినా.. ప్రజలు విశ్వసించలేదు. తన నిర్దోషిత్వాన్ని చాటుకునేందకు సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్నికల ముందు కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే, ఈ సానుభూతి మాటలను న్యూఢిల్లీ ప్రజలు పక్కన పెట్టారు. న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్ పురా నుంచి సిసోడియా, షత్పుర పుర నుంచి సత్యేంద్ర జైన్ లు పోటీ చేసి ఓడారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో లిక్కర్ స్కాం ఎఫెక్ట్ ఎంతలా పని చేసిందో అర్థమవుతోంది.