వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతన్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిందింది. అయితే ఈ ఫైనల్లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం
ఆరో బౌలర్ లేకపోవడం
టీమిండియా బౌలింగ్ ఎంతో పటిష్టంగా ఉంది. కానీ అసలు సమస్య అక్కడే వచ్చింది. ఉన్న 5 గురు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా ఆరో బౌలర్ లేకుండా ఆడటం ప్రతికూలంగా మారింది. హార్దిక్ పాండ్య లాంటి ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉన్నంతవరకు భారత్ కు తిరుగు లేకుండా పోయింది. అయితే పాండ్యకు ఎప్పుడైతే గాయమైందో టీమిండియా 5 బౌలర్లతోనే ఆడుతుంది. సెమీస్ వరకు ఈ ఫార్ములా కలిసి వచ్చినా ఫైనల్లో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనబడింది. జట్టులో ప్రధాన బౌలర్ సిరాజ్ అసలు పవర్ ప్లే లో ఒక్క ఓవర్ కూడా వేయకపోవడం గమనార్హం. దీంతో భారత్ కు పరాజయం తప్పలేదు.
సూర్య కుమార్ యాదవ్ కు వరుస అవకాశాలు
సూర్య కుమార్ యాదవ్ గ్రేట్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టీ 20ల వరకే పరిమితం. వన్డేల్లో సూర్యకు అంత మంచి రికార్డ్ ఏమీ లేదు. పాండ్య గాయంతో అనూహ్యంగా జట్టులో చోటుకి దక్కించుకున్న సూర్య జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేకపోయాడు. 28 బంతుల్లో 18 పరుగులే చేసి ఔటయ్యాడు. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ గా జట్టులో చోటు దక్కించుకున్న సూర్య స్థానంలో అశ్విన్ ను ఆడించినా అరకొర బ్యాటింగ్ చేస్తూ ఆరో బౌలర్ గా పనికొచ్చే వాడు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఫైనల్లో తేలిపోయిన రోహిత్ కెప్టెన్సీ
టోర్నీ ఆసాంతం అద్భుతంగా జట్టును నడిపించిన రోహిత్ శర్మ ఫైనల్లో సరైన కెప్టెన్సీ చేయలేకపోయాడు. ఎటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయకుండా ఫీల్డర్లందరినీ బౌండరీ దగ్గరకు పంపించేశాడు. కొంత బంతితో సిరాజ్ చేత బౌలింగ్ చేయించకుండా పవర్ ప్లే తర్వాత బౌలింగ్ కు తీసుకొని వచ్చాడు. సెమీస్ లో న్యూజీలాండ్ పై సిరాజ్ భారీగా పరుగులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సిరాజ్ మీద ఫైనల్లో నమ్మకం ఉంచలేదని అభిమానులు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా ఫీల్డింగ్
భారత ఓటమికి ఆస్ట్రేలియా ఓటమికి ఆసీస్ ఓపెనర్ హెడ్ ప్రధాన తేడా. కానీ ఫైనల్ మ్యాచ్ లో కంగారూల ఫీల్డింగ్ నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. తొలి ఓవర్ నుంచి 50 ఓవర్ల దాకా వారి ఫీల్డింగ్ తో దాదాపు 20 నుంచి 30 పరుగులు ఆసీస్ జట్టుకు సేవ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ను ఆసీస్ ఆటగాడు హెడ్ అందుకున్న గ్రేట్ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. మరోవైపు భారత్ ఎక్స్ ట్రాల రూపంలో 18 పరుగులు సమర్పించుకుంది.
షాట్ సెలక్షన్
వరల్డ్ కప్ లాంటి ఫైనల్లో చెత్త షాట్ సెలక్షన్ తో భారత ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ వేగంగా ఆడే క్రమంలో అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. యువ ఓపెనర్ గిల్ సైతం లూజ్ షాట్ ఆడి మిడాన్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక కోహ్లీ జాగ్రత్తగా ఆడే క్రమంలో తన షాట్ సెలక్షన్ తో వికెట్ల ముందు దొరికిపోయాడు.
వీటితో పాటు భారత పిచ్ మీద సరైన అవగాహన లేకపోవడం, కీలక దశలో ఒత్తిడిని జయించలేకపోవడం టీమిండియా ఓటమికి కారణాలయ్యాయి.