రాష్ట్రం ఏర్పడక ముందు తీవ్రమైన కోతలుండేవని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణాను చేశామని బీఆర్‌ఎస్ నాయకులు చేసే మరో వాదన. ఇందులో వాస్తవాలేంటో చూద్దాం.
2014కు ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగా దేశవ్యాప్తంగా 2014-–15 తరువాత విద్యుత్ కొరత భారీగా తగ్గింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ (CEA) నివేదిక ప్రకారం 2009-–10 కాలంలో దేశంలో 10.1% ఉన్న విద్యుత్ కొరత, 2014–-15 నాటికి 3.6శాతానికి తగ్గింది. 2015-–16లో కొరత 2.1%... ఇలా తగ్గుతూ 2018–-19 నాటికి 0.6 శాతానికి విద్యుత్ కొరత పడిపోయింది. ప్రస్తుతం దేశంలో సుమారు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విద్యుత్ కొరత లేదు.
మిగతా రాష్ట్రాలలో కూడా విద్యుత్ కొనే శక్తి ఉంటే మార్కెట్లో కొని విద్యుత్ కొరతను అధిగమించవచ్చు. మరో ముఖ్య విషయం. రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా స్థాపించని కారణంగా కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో కొన్ని కీలకమైన అంశాలను పెట్టింది. ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని విభజన చట్టంలో ఉన్నా
విద్యుత్ విషయంలో జనాభా ప్రాతిపదికన కాకుండా, విద్యుత్ డిమాండు ఆధారంగా విద్యుత్ విభజన జరగాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో చేర్చింది. దీంతో తెలంగాణ జనాభా 42% ఉన్నా, విద్యుత్ డిమాండు 54% ఉన్న కారణంగా, తెలంగాణకు అదనంగా సుమారు 1,800 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం లభించింది.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2015–-16 తరువాత విద్యుత్ కొరత లేకపోవడానికి కారణం బీఆర్‌ఎస్ పాలకుల ఘనత ఏమాత్రమూ లేదు. కేంద్రంలో, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పటికే తీసుకున్న అనేక చర్యలే తెలంగాణలో విద్యుత్ కొరతలు తగ్గడానికి ప్రధాన కారణం.
కె. రఘు, విద్యుత్వ రంగ నిపుణుడు