ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డిపై బీఆర్ఎస్​లో తిరుగుబాటు

  • మహబూబాబాద్ లో ఉద్యమకారుల మీటింగ్
     
  • హనుమకొండలో అర్ధనగ్న ర్యాలీతో నిరసన

హనుమకొండ/నెల్లికుదురు, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ బీఆర్​ఎస్​లోని తెలంగాణ ఉద్యమకారులు, నేతలు డిమాండ్ చేశారు. శంకర్ నాయక్​కు మళ్లీ టికెట్ ఇస్తే తామంతా నోటాకు ఓటేస్తామని హెచ్చరించారు. ధర్మారెడ్డి స్థానంలో ఉద్యమకారుడినే నిలబెట్టాలని స్పష్టం చేశారు. 

ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తిలోని మామిడి తోటలో తెలంగాణ ఉద్యమకారులు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసమ్మతి వర్గం నేతలు మునిగిలవీడు మాజీ సర్పంచ్ పట్నంశెట్టి నాగరాజు, తొర్రూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాదాద్రి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. ఉద్యమకారులమంతా ఎన్నో  కష్టాలకోర్చి పార్టీ నిర్ణయానికి కట్టుబడి గత ఎన్నికల్లో శంకర్ నాయక్ ను గెలిపిస్తే ఆగడాలు పెరిగిపోయాయని, ఆయన పేరు చెప్తేనే ప్రజలు మండిపడ్తున్నారన్నారు. తాము మీటింగ్ పెట్టుకుంటే నెల్లికుదురు జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి బెదిరిస్తున్నారని చెప్పారు. మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తవారిని ప్రకటించాలని బీఆర్ఎస్ హైకమాండ్​ను డిమాండ్ చేశారు. 

ALSO READ :నేపాల్​కు 84 వెహికల్స్ గిఫ్టిచ్చిన భారత్

ఉద్యమకారులను అణచేస్తున్నరు..  

చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా పరకాల నియోజకవర్గానికి చెందిన గజ్జి విష్ణు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది విద్యార్థి ఉద్యమకారులు ఆదివారం మధ్యాహ్నం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు అర్ధనగ్నంగా ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. విష్ణు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పరకాల ప్రజలు ఎంతో మంది పోరాటం చేశారన్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన ధర్మారెడ్డి ఉద్యమకారులను అణచివేస్తున్నాడని ఆరోపించారు. ఎస్సీలపై, మైనార్టీలపై దాడులు చేయించి, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తీరుతో ఉద్యమకారులు, సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని హైకమాండ్ కు తేల్చిచెప్పారు.