నిజాం రాజ్యంలో తిరుగుబాటు

నిజాం రాజ్యంలో  తిరుగుబాటు

1857 నాటి సిపాయిల తిరుగుబాటు ప్రభావం హైదరాబాద్​ సంస్థానంపై కూడా ఉంది. మే 10న మీరట్​లో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్​ నవాబ్​గా నాసీరుద్దౌలా ఉన్నారు. కానీ, తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకే మృతిచెందాడు. నాసీరుద్దౌలా మృతితో అఫ్జలుద్దౌలా హైదరాబాద్​ నవాబ్​ అయ్యాడు. 

1857 తిరుగుబాటు కంటే ముందే హైదరాబాద్​లో బ్రిటీష్​ వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది.ఈ వ్యతిరేకత వహాబీ ఉద్యమంలో భాగంగా ముబారిక్​ ఉద్దౌలా, గులాం రసూల్​ఖాన్​ అణచివేతతో ప్రజల్లో కలిగింది. బీరార్​ ఒప్పందం కూడా ఒక కారణం. అప్పటి హైదరాబాద్​ దివాన్ సాలార్​జంగ్​ సూచన్​ మేరకు నిజాం అఫ్జలుద్దౌలా బ్రిటీష్​ వారికి మద్దతు తెలిపాడు. ఈ కారణంగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైంది. మౌల్వీ అల్లా ఉద్దీన్​ హైదరాబాద్​లో తన ప్రసంగాల ద్వారా ప్రజలను బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా ఏకం చేశాడు. 

రెసిడెంట్​ కార్యాలయంపై దాడి

1857 తిరుగుబాటును మౌల్వీ అల్లావుద్దీన్​, మౌల్వీ అక్బరుద్దీన్​ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. హైదరాబాద్​ సమీపంలోని బొల్లారంలో గల బ్రిటీష్​ సైనిక రెజిమెంట్​లోని జామేదార్​ చిదాఖాన్​ బ్రిటీష్​ వారిపై తిరుగుబాటు ప్రకటించి తన అనుచరులతో హైదరాబాద్​ సంస్థానంలోకి ప్రవేశించాడు. మొదటి సాలార్​జంగ్​ చిదాఖాన్​ను అరెస్టు చేయించి బ్రిటీష్​ వారికి అప్పగించాడు.

 దీంతో మౌల్వీ అల్లావుద్దీన్​, తుర్రేబాజ్​ ఖాన్​ (రోహిల్లా సైనికుడు) బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా జులై 17న మక్కా మసీదులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిదాఖాన్​ను విడిపించడానికి మొదటి సాలార్​జంగ్​ దగ్గరకు ఒక రాయబారిని పంపాలని తీర్మానించారు. చిదాఖాన్​ విడుదలకు సాలార్​జంగ్​ నిరాకరిస్తే  బ్రిటీష్​ రెసిడెంట్​ ఆఫీ​స్​పై దాడి చేయాలని తీర్మానించారు. ఈ రాయబార విషయాన్ని ముందుగానే తెలుసుకున్న సాలార్​జంగ్​ అరబ్​ సైనికులను మక్కా మసీద్​కు పంపించి అక్కడ సమావేశమైన వారిని చెదరగొట్టించారు. 

తుర్రేబాజ్​ ఖాన్​ 

మక్కా మసీదు సమావేశం తీర్మానం ప్రకారం రోహిల్లా నాయకుడు సర్ధార్​ తుర్రేబాజ్​ ఖాన్​ బ్రిటీష్​  రెసిడెన్సీపై(ప్రస్తుతం సుల్తాన్​బజార్​లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయం) 1857, జులై 17న 500 మంది సైనికులతో దాడి చేశాడు. ఈ దాడిని బ్రిటీష్​ అధికారి కల్నల్​ డెవిడ్​సన్​ తిప్పికొట్టాడు. సుల్తాన్​బజార్​, పుత్లీబౌలీలోని డబ్బుసింగ్​, జయగోపాల్​దాస్​ ఇండ్ల నుంచి బ్రిటీష్​ రెసిడెన్సీపై రోహిల్లాలు కాల్పులు జరిపారు. బ్రిటీష్​కు, రోహిల్లాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 32 మంది రోహిల్లాలు మరణించారు. ఇక్కడ నుంచి తుర్రేబాజ్​ ఖాన్​ తప్పించుకున్నాడు. 

అయితే, ఖురాన్​బాన్​ అలీ సహాయంతో మెదక్​లోని తుప్రాన్​ వద్ద తుర్రేబాజ్​ఖాన్​ను బ్రిటీష్​ వారు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. తుర్రేబాజ్​ మృతదేహాన్ని బ్రిటీష్​ రెసిడెన్సీ ఎదుట రెండు రోజులపాటు వేలాడదీశారు. మౌల్వీ అల్లా వుద్దీన్​ను మంగళంపల్లి వద్ద అరెస్టు చేసి అండమాన్ నికోబార్​ జైలుకు 1859, జులై 28న పంపించారు. ఈ జైలులో మౌల్వీ అల్లావుద్దీన్​ తొలి హైదరాబాద్​ రాష్ట్ర ఖైదీగా నిలిచారు. ఇతను 1884లో అండమాన్ జైలులో మరణించాడు. 

కూకట్​పల్లి ఉదంతం

1859, ఏప్రిల్​లో కూకట్​పల్లి దగ్గర సైనిక అధికారి కాస్టన్ మాకిన్​ట్రేపైన దాడి జరిగింది. ఓ సైనికుడు విధులు ముగించుకొని వస్తూ మాకిన్​ట్రేను కత్తితో పొడిచాడు. అతణ్ని పట్టుకొని ఎలాంటి విచారణ లేకుండా ఉరితీశారు. అనంతరం జరిపిన విచారణలో కొంత మంది సైనికులు బ్రిటీష్​ వ్యతిరేక భావనతో ఉన్నారని, వారు నిజాంకు, బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని చూస్తున్నారని తేలింది. వారిలో అజ్మత్​జంగ్​, మిర్దాచంద్​, బాజ్​ఖాన్​, మల్వీ ఇబ్రహీంలు ఉన్నారు. వీరిని రాజ్యం నుంచి బహిష్కరించాలని నిజాంను కల్నల్​ డేవిడ్​ సన్​ కోరాడు. 

1857, జులై 17న రెసిడెన్సీపై జరిగిన దాడిలో మిర్దాచాంద్​ పాల్గొన్నాడు. బొల్లారం కంటోన్మెంట్​లో బ్రిగేడియర్​ మెకంజిని గాయపర్చిన సైనికులకు ఇతను సహాయం చేశాడు. ఇతను కల్నల్​ డేవిడ్​సన్​పై దాడి చేసిన జహంగీర్​ఖాన్​ అనుచరుడు. బాజ్​ఖాన్​ తిరుగుబాటుదారులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. మౌల్వీ ఇబ్రహీం బ్రిటీష్​ వారిని 
అణచడానికి ప్రయత్నిస్తున్నాడని, వీరిని విచారించి నిర్బంధించారు. 

రాంజీగొండు తిరుగుబాటు 

రోహిల్లాల మరో తిరుగుబాటు ఆదిలాబాద్​ జిల్లాలోని నిర్మల్​లో జరిగింది. నాయకుడు రాంజీ గోండు. ఇతడులో ఆదిలాబాద్​ చుట్టుపక్కల ప్రాంతాలను విముక్తం చేసి నిర్మల్​ను రాజధానిగా చేసుకొని పాలించాడు. కలెక్టర్ బలగాలు ఒకవైపు, రోహిల్లాలు, గోండు దళాలు, మరోవైపు 1860, ఏప్రిల్​లో నిర్మల్​లో యుద్ధం జరిగింది. కలెక్టర్​బలగాలు జరిపిన తుపాకుల దాడిలో రోహిల్లా – గోండులు చాలా మంది మృతిచెందారు. వారి నాయకుడు రాంజీ గోండు తప్పించుకున్నాడు. అయినా అతన్ని వెతికి పట్టుకొని విచారించి ఉరిశిక్ష విధించారు. అతనితోపాటు 1000 మంది అనుచరులను మర్రిచెట్టుకు ఉరితీశారు. దీంతో ఆ చెట్టు 1000 ఉరుల మర్రిగా పేరుగాంచింది. 

వహాబీ ఉద్యమ ప్రభావం

ఉత్తర భారతదేశంలో వహాబీ ఉద్యమం సయ్యద్​ అహ్మద్​ బ్రైల్వీ నాయకత్వంలో ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని బ్రైల్వీ అనుచరుడు మౌల్వీ విలాయత్​ అలీసలీం 1838లో దక్కన్​కు తీసుకొచ్చాడు. వహాబీ ఉద్యమానికి హైదరాబాద్​ సంస్థానంలో నజీరుద్దౌలా సోదరుడు ముబారిక్​ ఉద్దౌలా నాయకత్వం వహించాడు. ఈ ఉద్యమం మొదట బ్రిటీష్​ వారికి, ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగింది. 

హైదరాబాద్​లో బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా ముబారిక్​ ఉద్దౌలా ఉద్యమాన్ని నడిపాడు. కర్నూల్​ నవాబ్​ గులాం రసూల్​ఖాన్​ ముబారిక్​ ఉద్దౌలాకు మద్దతు పలికాడు. నిజాం సహాయంతో ఆంగ్లేయులు ముబారిక్​ ఉద్దౌలాను అరెస్టు చేసి గోల్కొండ కోటలో బంధించారు. ఈయన 1854లో కోటలోనే మృతిచెందాడు. గులాం రసూల్​ఖాన్​ను తిరుచురాపల్లి జైలుకు తరలించారు. ఈ చర్యల వల్ల హైదరాబాద్​ సంస్థానంలో వహాబీ ఉద్యమ ప్రభావం తగ్గింది. ఇది 1857 తిరుగుబాటుకు బాటలు వేసింది. 

ఔరంగాబాద్​ తిరుగుబాటు

1857 తిరుగుబాటు ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో బ్రిటీష్​ వారు పరాజయం పాలయ్యారు. దీంతో హైదరాబాద్​ సంస్థానం ఆధీనంలో ఉన్న ఔరంగాబాద్​ రెజిమెంట్​ నుంచి కొంత మంది సిపాయిలను బ్రిటీష్​ వారికి మద్దతుగా ఉత్తర భారతదేశానికి పంపుతారనే వార్త ఔరంగాబాద్​ రెజిమెంట్​లో వ్యాపించింది. దీనికి వ్యతిరేకంగా ఒకటో, రెండో అశ్వక దళాలకు చెందిన (ఔరంగాబాద్​ కాంటిన్​జెంట్​ సైనికులు) మీర్ పిదా అలీ, అమీర్​ఖాన్​ నేతృత్వంలో బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 

ఈ తిరుగుబాటులో మీర్ పిదా అలీ కెప్టెన్​ అబ్బాట్​ అనే ఆంగ్ల సైనిక అధికారిపై కాల్పులు జరిపాడు. ఇందకుగాను అబ్బాట్​ తిరుగుబాటును అణచివేసి, మీర్​ పిదా అలీ అనే దాఫేదార్​ను ఉరి తీయించాడు. అమీర్​ఖాన్​ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ తిరుగుబాటులో సైనికులపై ఫిరంగులతో దాడి చేయగా అమీర్​ఖాన్​ తప్పించుకున్నాడు. 

1853 బీరార్ ఒప్పందం

ఈ ఒప్పందం ప్రకారం బీరార్​, రాయచూర్​, ఉస్మానాబాద్​లను బ్రిటీష్​ వారికి అప్పగించారు. దీంతో నిజాం సంస్థానం ప్రజలలో నవాబ్​పై వ్యతిరేకత ఏర్పడింది. పెద్ద ఎత్తున ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. ఈ ఒప్పందం వల్ల బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటుకు హైదరాబాద్​ సంస్థానంలో ప్రజలు మద్దతు తెలిపారు.