తొలి సెషన్​లో బిల్లుల జల్లు

ఒక నాన్​–కాంగ్రెస్​ ఫ్రంట్​ అయిదేళ్లు పూర్తిగా కొనసాగడం, వరుసగా రెండోసారి గెలవడం అనేవి ఇండియన్​ పొలిటికల్​ హిస్టరీలోనే మైలు రాళ్లు. ఇప్పుడు మరో ల్యాండ్​ మార్క్​ని సృష్టించింది మోడీ సర్కారు. 17వ లోక్​సభ ఫస్ట్​ సెషన్​ బడ్జెట్​తో మొదలైంది. ఈ తొలి సమావేశాల్లోనే రికార్డు స్థాయిలో 26 బిల్లులను పార్లమెంట్​ ఆమోదించింది. ఫుల్​ మెజారిటీ లేని రాజ్యసభలో సైతం పలు వివాదాస్పద బిల్లులకు కొర్రీలు పడకుండా టిక్​ వేయడం ఎన్డీయే సాధించిన విజయంగా ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఈ సెషన్​ ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని బిల్లులకుకూడా ఆమోద ముద్ర పడవచ్చు.

ఒకటా రెండా… ఏకంగా 37 బిల్లులు పార్లమెంట్​ టేబుల్​ మీదకు వెళ్లాయి. ఇదొక అరుదైన రికార్డు. గడచిన 15 ఏళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో… ఫస్ట్​ సెషన్​లోనే పార్లమెంట్​ ముందు ఉంచడమనేది జరగలేదు. వీటిలో 32 బిల్లులు లోక్​సభలోనూ, అయిదు బిల్లులు రాజ్యసభలోనూ ప్రవేశించాయి. ఈ బిల్లుల్లో 26 ఆమోదం పొందగలిగాయి.  వీటిలో ఏడింటిని తొలిసారిగా ప్రవేశపెడితే ఓకే అయ్యాయి. 1952 తర్వాత బడ్జెట్ సమావేశాల్లో  ఇంత పెద్ద సంఖ్యలో బిల్లులు పాస్ చేయడం ఇదే తొలిసారిగా రికార్డుల్లో నమోదైంది. మరికొన్ని బిల్లులు ఆమోదం  పొందాలి కాబట్టి,  జూలై 26న ముగియాల్సిన పార్లమెంటు  సమావేశాలను  ఆగస్టు 7వరకు పొడిగించారు. అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయి.

కొత్తగా ఎన్నికైన ఎంపీల పరిచయ కార్యక్రమంలోనే ప్రధానమంత్రి మోడీ ఒక విషయాన్ని స్ఫష్టంగా చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘ప్రతి ఒక్కరూ సభ పనితీరుపై అవగాహన పెంచుకోవాలి. హోం వర్క్​ చేసి రావాలి. ఉభయ సభల్లోనూ ఎంపీలందరూ పూర్తి సమయం ఉండాలి’ అన్నారు. పార్లమెంట్​ బడ్జెట్​ సెషన్​ని ఆషామాషీగా తీసుకోలేదన్న సంగతి చాలా క్లియర్​గా ఎంపీలకు చెప్పేశారు. ఈ రోజున ఎన్డీయే–2 సర్కారు సాధించిన ఈ అరుదైన రికార్డును గమనిస్తే… మోడీ గవర్నమెంట్​ ఎంత సీరియస్​గా ఉందో తెలుస్తోంది.

బీజేపీకి  రాజ్యసభలో సంఖ్యా బలం లేదు. అయినప్పటికీ కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడంలో చతురత ప్రదర్శించింది. సక్సెస్ అయింది. ట్రిపుల్ తలాక్ వంటి కీలక బిల్లు మోడీ ఫస్ట్ టర్మ్  ప్రభుత్వంలో లోక్​సభ ఆమోదం పొందింది. బిల్లుకు రాజ్యసభలో బ్రేక్ పడింది. ట్రిపుల్ తలాక్ సహా అలా ఫస్ట్ టర్మ్​లో  రాజ్యసభలో ఆగిపోయిన అనేక బిల్లులను ఈసారి తన మార్క్  చతురతతో  కేంద్రం ఆమోదింపచేసుకుంది. రాజకీయంగా దీనిని బీజేపీ విజయంగా ఎనలిస్టులు పేర్కొంటున్నారు.

మూడేళ్ల నుంచి మూలన పడి ఉన్న బిల్లులను అలవోకగా సభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందడంలో మోడీ సర్కారు సక్సెసయ్యింది. వాటిపై మాట్లాడే అవకాశం కూడా తమకు ఇవ్వకుండానే  అధికార పక్షం బిల్లులను పాస్ చేయించుకుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేవలం ప్రతిపక్షాలే కాదు, ఎన్డీయే కూటమిలోని జేడీ (యు) కూడా  బిల్లుల ను చర్చించకుండానే సర్కార్ ఆమోదించిందని దుయ్యబట్టింది.

పార్లమెంటరీ విధానంలో కీలక బిల్లులను పాస్ చేయడానికి ముందుగా స్టాండింగ్  కమిటీకి పంపుతారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్​ఐఏ), నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ) వంటి కీలక బిల్లుల్ని స్టాండింగ్ కమిటీకి పంపకపోవడాన్ని జేడీ (యు) ప్రతినిధి కేసీ త్యాగి తప్పుబట్టారు. ఆదరాబాదరాగా పార్లమెంటు పాస్ చేసిందని త్యాగి ఆరోపించారు. బిల్లులకు సంబంధించి అవసరమైన క్లారిఫికేషన్లు అడిగితే ఇవ్వకుండానే ఆమోదిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. బిల్లులపై చర్చ జరిగేటప్పుడు తాము లేవనెత్తిన అంశాలకు జవాబివ్వడం రావడం లేదన్నారు శర్మ.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే…. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జరగలేదు. టెక్నికల్​గా స్టాండింగ్ కమిటీలకు పంపే వీల్లేదు. పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యమున్న స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జరగకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. అసలు ఈ కమిటీలు ఏర్పాటు చేసే  ఉద్దేశం ఉందా అని నిలదీశాయి. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కాకుండా, బిల్లులపై సమగ్ర చర్చ జరపకుండా కీలక బిల్లులను పార్లమెంటు ఆమోదించిందని దుయ్యబట్టాయి.

ఇదే ఫస్ట్​ టైమ్​ కాదు : బీజేపీ

అయితే, పార్లమెంటు ఫస్ట్​ సెషన్​ నాటికి స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు కాకపోవడం ఇదే తొలిసారి కాదంటోంది. ‘బిల్లులను కూలంకషంగా చర్చించకుండా ఆమోదించారనే ఆరోపణలు సరికాదు’ అని బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్దే అన్నారు.

గతంలో మరీ తక్కువ

పాత రోజుల్లోకి వెళితే 2004 నాటి 14వ లోక్​సభ బడ్జెట్ సెషన్​లో కేవలం ఆరు బిల్లులు మాత్రమే పాస్ అయ్యాయి. అప్పట్లో  జూలై 5 నుంచి ఆగస్టు 26 వరకు 53 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి.  2009నాటి 15వ లోక్​సభ విషయానికొస్తే బడ్జెట్ సమావేశాలు జూలై 2 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు 37 రోజుల పాటు జరగ్గా, కేవలం ఎనిమిది బిల్లులను మాత్రమే పార్లమెంటు ఆమోదించింది.  మోడీ సర్కారు ఫేజ్​–1నాటి 16వ లోక్​సభ సమావేశాలను పరిశీలిస్తే జూలై 7 నుంచి ఆగస్టు 14 వరకు 39 రోజుల బడ్జెట్ సెషన్​ జరిగాయి. ఈ సెషన్​లో కేవలం 12 బిల్లులనే పార్లమెంటు పాస్ చేసింది.

కీలక బిల్లులపై విమర్శలు ఏవంటే

బడ్జెట్ సెషన్​లో పార్లమెంటు అమోదించిన అనేక కీలక బిల్లులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

ఇందులో నేషనల్ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (సవరణ) బిల్లు కూడా ఉంది. ఈ బిల్లు ద్వారా ఎవరినైనా టెర్రరిస్టుగా ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు హక్కుల కార్యకర్తలు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ పేరుతో ముస్లిం మగవాళ్లను జైళ్లకు పంపడానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందన్న వాదన తెర మీదకు వస్తోంది.

రైట్​ టు ఇన్ఫర్మేషన్​ యాక్ట్​ (అమెండ్​మెంట్​) బిల్లు కూడా వివాదాస్పదమైంది. సమాచార హక్కుకు తూట్లు పొడిచేలా ప్రభుత్వం సవరణలు చేసిందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. ఈ సవరణల ద్వారా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారంపై కండిషన్లు ఏర్పడతాయి. మునుపటిలా స్వేచ్ఛగా పొందే హక్కును మోడీ సర్కారు హరించివేస్తుందని ప్రజాస్వామ్యప్రియులు విమర్శించారు.

నేషనల్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ద్వారా ఎంసీఐ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని డాక్టర్లు అంటున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో డాక్టర్లు డ్యూటీలను బహిష్కరించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక (సవరణ) బిల్లుపై కూడా విమర్శలున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని సాధారణ వ్యక్తిని కూడా ఈ చట్టం కింద వేధింపులకు గురిచేయవచ్చని హక్కుల  సంఘాలు అంటున్నాయి.