
లారెస్ గ్లోబల్ అవార్డులు
అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ, జమైకా స్ప్రింటర్ షెల్లిఆన్ ఫ్రేజర్ ప్రైస్ ఆయా విభాగాల్లో లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నారు.
ప్రపంచ కప్ షూటింగ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్–దివ్య థడిగోల్ సుబ్బరాజు (భారత్) ద్వయం విజేతగా నిలిచింది.
నేషనల్
రాజస్థాన్‌లో లిథియం నిక్షేపాలు
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు వెల్లడించారు.
భారత వృద్ధి రేటు 6 శాతం
ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్‌కు స్థిరత్వంతో కూడిన ‘బీబీబీ’ - సార్వభౌమ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు భారత్ నమోదు చేయొచ్చని పేర్కొంది.
కీర్తిచక్ర, శౌర్యచక్ర అవార్డులు
విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డులు, 29 శౌర్యచక్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అందజేశారు.
భారత హాకీ స్పాన్సర్‌గా ఒడిశా
భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్‌ను 2033 వరకు పొడిగించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్) స్పాన్సర్ గా ఉంటోంది.
వ్యక్తులు
ప్రాచీ దహబల్ దేబ్
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ కేకులతో అద్భుతమైన ఆకృతులు రూపొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా రాయల్ ఐసింగ్ విధానంలో 200 కిలోల భారతీయ రాజభవనం నమూనా కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
ప్రవీణ్
ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. హవానా (క్యూబా)లో జరుగుతున్న ఈవెంట్లో ప్రవీణ్ 17.37 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెంజిత్ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు (17.30 మీ., 2016)ను అతడు తిరగరాశాడు.
సబలెంకా
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. సబలెంకా కెరీర్‌లో ఇది 12వ సింగిల్స్ టైటిల్.
దలైలామా
ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసె పురస్కారం ఇటీవల వ్యక్తిగతంగా అందుకున్నారు. జీవన విధానం, సంస్కృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి నాయకత్వం వహించినందుకు ఈ అవార్డును అందించారు.
అన్ని భాషల్లోనూ ఆకాశవాణే
రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ ప్రసారాల సమయంలోనూ ‘దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో’ అని కాకుండా ‘దిస్ ఈజ్ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
తెలంగాణ
‘ఓడీఎఫ్ ప్లస్’ గ్రామాల్లో టాప్
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది.
ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్
మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఇంటర్నేషనల్ అరబ్ లీగ్‌లోకి సిరియా
అరబ్ లీగ్‌లోకి సిరియా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. లీగ్ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సిరియా లో జరిగిన ఆందోళనలతో సభ్యత్వం రద్దైంది.
పులిట్జర్ అవార్డులు
చార్లెస్ డికెన్స్ రచించిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్ రచించిన ‘డీమన్ కాపర్ ఫీల్డ్’ నవలతో పాటు 1920 నాటి న్యూయార్క్ నగరంలో మోసాల గురించి హెర్నన్ డియాజ్ రచించిన ‘ది ట్రస్ట్’ నవలకు పులిట్జర్ బహుమతులు ప్రకటించారు.
ముగ్గురి డీఎన్‌ఏతో శిశువు
బ్రిటన్ శాస్త్రవేత్తల ప్రయోగంతో ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్‌ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్‌ఏ తల్లిదండ్రులదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా ఈ సాంకేతికత ఉయోగిస్తున్నారు.