మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. భాగ్యనగరం ప్రజలు వందకి 46 మంది మాత్రమే ఓటేశారు. టీఆర్ఎస్ ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని నిలబెట్టారు. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఈ పరిస్థితులు యాదృచ్చికంగా జరిగి ఉండవచ్చు కానీ, ప్రజలు బీజేపీకి ఒక అవకాశం, టీఆర్ఎస్ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారని స్పష్టంగా అర్థమవుతోంది.
2018 నుంచే ప్రభుత్వ వ్యతిరేకత
టీఆర్ఎస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ. ఆ పార్టీపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలనే దానిపై చాలా ఆలోచనలు ప్రజల్లో ఉంటాయి. కానీ, సమస్యలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఉద్యమ భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని బయటపడటం, టీఆర్ఎస్ కుటుంబం పార్టీగా మారిపోవడం ప్రజలకు నచ్చలేదు. అందుకే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైమ్‌కే ప్రజల్లో అసంతృప్తి కనబడింది. ఆ ఎన్నికల్లో మహాకూటమిలో టీడీపీ ఉండటమే కేసీఆర్‌కు కలిసివచ్చింది. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చారు. అది ఎల్లకాలం సాగదనే విషయాన్ని గుర్తుంచుకోకుండా టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ఫలితమే జీహెచ్ఎంసీలో పరాభావం.
సరైన నాయకత్వం కోసం ఎదురుచూపులు
తెలంగాణకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే తెలంగాణ ప్రజల భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. ఆ భావోద్వేగాలకు అనుగుణమైన నాయకత్వం కోసం స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ఎదురుచూస్తోంది. నైజాం సర్కార్ నుంచి తెలంగాణ విముక్తి పోరాటం జరుగుతున్నప్పుడు ఇక్కడి ప్రజలకు కమ్యూనిస్టుల మీద ఏవో నమ్మకాలు దోబూచులాడాయి. కానీ చివరి దశలో కమ్యూనిస్టుల నైజం ప్రజలకు అర్థమైంది. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించారు. అప్పటి నుంచి కమ్యూనిస్టులు అధికారం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో గడీలు, దొరల నాయకత్వమే అసలు సమస్య అని భావించడమే వారిఓటమికి కారణం. కానీ తెలంగాణ అసలైన సమస్య నైజాం వారసత్వ ఆధిపత్యం. ఆ వారసత్వ ఆక్రమణలను, విధ్వంసాలను, వ్యతిరేకించే వాళ్లను మతతత్వవాదులుగా చిత్రించి కమ్యూనిస్టులు ప్రచారం చేశారు. నేటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. కానీ, నిజాం వారసత్వ ఆధిపత్యం నుంచి తెలంగాణను విముక్తి చేయకుండా శాంతి భద్రతలను కాపాడటం అసాధ్యమనే విషయాన్ని విస్మరించారు. దానితో ప్రజలకు దూరమయ్యారు.
ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమం
కమ్యూనిజం నుంచే పుట్టిన నక్సలిజం కూడా తెలంగాణలో తనదైన ప్రయత్నం చేసింది. గడీలు, దొరలకు వ్యతిరేకంగా పేదలకు అండగా నక్సలైట్లు ఉద్యమించారు. హింసాత్మకంగా సాగిన ఉద్యమంలో చివరకు అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆహుతయ్యారు. క్రమంగా ఆ ఉద్యమం పేద ప్రజల కోసం కాకుండా రాజ్యాధికారం లక్ష్యంగా మారిపోయింది. దాంతో ప్రజల నుంచి వాళ్లు కూడా దూరమయ్యారు. ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమం కొన్నేండ్ల పాటు సాగింది. అది బలహీనపడి మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం సాగిన విషయం మనందరికీ తెలుసు. ఉద్యమం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆ సమయంలో బీజేపీ బలమైన నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలకు అందించలేకపోయింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక సార్లు కర్ఫ్యూ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి గురించి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అసలు తెలంగాణకు ఏం కావాలో ఆలోచించలేదు. వందల ఏళ్లు నిజాం అరాచకాలతో నలిగిపోయిన ప్రభావం ప్రజల మనోభావాలపై తీవ్రంగా పడింది. నీ బాంచన్ అనే పదాలు కూడా దొర్లాయి. 1947 ఆగస్టు 15న దేశమంతటికీ స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మాత్రం నిజాం పాలన నుంచి విముక్తి కలగలేదు. దాని కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సివచ్చింది. మొత్తం మీద ఇండియన్ రిపబ్లిక్‌లో నైజాం ప్రాంతం కలిసిపోయింది. కానీ, నిజాం వారసుల ఆధిపత్యం ఇంకా తెలంగాణను వెంటాడుతూనే ఉంది. జంట నగరాలు, పరిసర జిల్లాల్లో 1978–90 మధ్య హిందువులపై దాడులు, హింసాత్మక ఘటనలు జరిగాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, పాలమూరును మతపరంగా సున్నితమైనవిగా గుర్తించింది. 1990 నుంచి 2012 వరకు ఉమ్మడి ఏపీలో 11 సార్లు కర్ఫ్యూ విధించారు. అందులో 10 సందర్భాల్లో హైదరాబాద్‌లోనే కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో 113 రోజులు భాగ్యనగరంలో కర్ఫ్యూ ఉంది. 1990–-91 మధ్య రాష్ట్రంలో 450 చిన్న, పెద్ద మత ఘర్షణలు జరిగి 208 మంది చనిపోగా.. 470 మంది గాయపడ్డారు. ఇవన్నీ భాగ్యనగరం, రంగారెడ్డి, కరీంనగర్, అనంతపూర్, నిజామాబాద్, కడపలో జరిగాయి.
అసలు నిజాం అంటేనే ఆక్రమణ, ఆధిపత్యం, అత్యాచారం. ఇక్కడి రాజకీయ పార్టీలు వాళ్లతో సర్దుబాటు చేసుకుని, వాళ్లను తమ అధికారం కోసం ఓటు బ్యాంకులుగా మలచుకొని పని చేసుకుంటూ వస్తున్నాయి. అలా నిజాం ఆధిపత్యం ఏదో రూపంలో ఇక్కడ ప్రభావం చూపిస్తూనే ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా ఎప్పటికప్పుడు మనకు నిజాం ఆధిపత్యాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో బాసర పుణ్యక్షేత్రం నుంచి మనం చూసినట్లయితే వాళ్ల ఆక్రమణలు ఆధిపత్యాలు ఎట్లా ఉంటాయో అర్థమవుతుంది. నిజాం వారసుల ఆధిపత్యం నుంచి పూర్తిగా బయటపడి శాంతిభద్రతలు కాపాడే నాయకత్వం కోసం తెలంగాణ ఎదురుచూస్తున్నది.
ప్రజల్లో సామరస్య భావనలను పెంచాలి
యాదృచ్ఛికమో కాదో తెలియదు గానీ, మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఉపన్యాసాలు భాగ్యనగర్ గత చరిత్రను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసాయి. తెలంగాణలో ఉదారవాదులు, కమ్యూనిస్టు మేధావులు, రాజకీయ నాయకులు ముస్లింలను వెనకేసుకొని వస్తూ హిందువులపై మాటల దాడులు చేస్తూ ఉంటారు. వాస్తవంగా మత ఘర్షణలు మనదేశంలో ఎక్కడేక్కడ జరుగుతున్నాయని గమనిస్తే, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నచోట్ల జరుగుతున్నాయనేది చరిత్ర చెబుతున్నది. ఇవన్నీ రాజకీయ నాయకులకు అర్థం కాలేదని అనుకుంటే మనం అమాయకులమే. ఓటుబ్యాంక్ రాజకీయాలకు అలవాటుపడి వాస్తవాలు మాట్లాడ లేక పోతున్నారని అర్థమవుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ శాంతిభద్రతలను కాపాడడం, ప్రజల్లో సామరస్య భావాలను పెంచడంపై లేదనేది స్పష్టంగా కనబడుతోంది. ఆ పరిస్థితులను చక్కదిద్దగల నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ దిశలో ప్రజల్లో బీజేపీపై కొంత విశ్వాసం ఏర్పడింది. కానీ బీజేపీ ఆశించిన మేరకు పని చేయటం లేదని ప్రజలు ఇప్పటివరకు భావిస్తున్నట్లుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ స్వరం సిటీ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం వైపు మొగ్గు చూపారు.. నిజాం, మావోయిస్టుల ఆధిపత్యం నుంచి బయటపడి తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపించాలనే ప్రజల ఆకాంక్షలను బీజేపీ అర్థం చేసుకోవాలి. దానికోసమే ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు సరైన నాయకత్వం అందించటానికి బీజేపీ ఎలా సిద్ధపడుతుందో చూడాలి.-ఆర్.మల్లికార్జునరావు, పొలిటికల్ ఎనలిస్ట్.
for more News…