- మూడు శాఖల సమన్వయంతో ముందుకు
- కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలతో చర్యలు
- నేడో రేపో కలెక్టర్ వద్దకు ఉద్యోగుల సర్దుబాటు ఫైల్
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో వైద్య రంగం పై ఇటీవలి సాధారణ బదిలీల ఎఫెక్ట్ పడింది. పీహెచ్‌సీలు, డీఎంఈ పరిధిలోని గవర్నమెంట్జనరల్ హాస్పిటల్, వైద్య విధాన పరిషత్ లలో ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కావడంలో సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇదివరకే పలు చోట్ల ఖాళీలుండగా, తాజా బదిలీలతో మరింత ఇబ్బంది ఏర్పడింది.
డైరెక్టరేట్ఆఫ్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ఆఫ్ మెడికల్ఎడ్యుకేషన్ శాఖలలోని ఉద్యోగులు కొందరు అటు ఇటుగా మారారు. దీంతో ఖాళీ అయిన పోస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కు టైం పట్టనుండగా, ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ మూడు శాఖల పరిధిలోని ఉద్యోగులను ఖాళీ స్థానాల్లో అడ్జస్ట్ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
సర్దుబాట్ల పై కసరత్తు
ఇటీవల కలెక్టర్రిజ్వాన్ బాషా షేక్ జిల్లా హాస్పిటల్, ఎంసీహెచ్‌లను సందర్శించి పేషంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్టాఫ్ కొరతను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా స్టాఫ్ ఉన్న శాఖ నుంచి మరో శాఖకు వారిని అడ్జస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో ఈ మూడు శాఖల అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో చాంబర్లో గురువారం సమావేశమయ్యారు.
ఇన్చార్జి డీఎంహెచ్‌వో రవీందర్ గౌడ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గోపాల్రావు, ఎంసీహెచ్హాస్పిటల్ సూపరింటెండెంట్మధు సూదన్ రెడ్డిలతో పాటు మెడికల్‌కాలేజీ సూపరింటెండెంట్ఫహీమ్, డీఎంహెచ్‌వో ఆఫీస్ సూపరింటెండెంట్ హేమ నాయక్ఖాళీలపై చర్చించారు. శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ స్థానాల్లో ఇతర శాఖల నుంచి ఎలా అడ్జస్ట్ చేయాలనే వివరాలను సేకరించారు.
డాక్టర్ల మార్పు కష్టమే
అయితే, జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో 12 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇటీవలి బదిలీల ఫలితంగా 17 డాక్టర్ పోస్టులు, 36 స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తంగా 165 మంది సిబ్బంది ఖాళీలు ఏర్పడ్డాయి. వైద్యవిధాన పరిషత్ లో 4 సీహెచ్‌సీలు ఉండగా, వాటిలోనూ సర్దుబాట్లు చేయాలన్న యోచనలో ఉన్నారు. జఫర్ఘడ్ మండల కేంద్రంలోని సీహెచ్‌సీలోని ఇద్దరు గైనకాలజిస్ట్‌లను డీఎంఈ పరిధిలోని ఎంసీహెచ్‌కు కేటాయించాలని భావిస్తున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ నుంచి డాక్టర్అశోక్ కుమార్, కరుణాకర్‌రాజు, మధుకర్ యాదవ్డీఎంఈ పరిధి బ్లడ్‌బ్యాంకుకు బదిలీ అయ్యారు.
బ్లడ్ బ్యాంక్‌లో వీరి ఉపయోగం పెద్దగా లేనందను క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్లుగా వినియోగిస్తున్నారు. దీంతో ఈ ముగ్గురు డాక్టర్లను తిరిగి జిల్లా వైద్యారోగ్య శాఖకు ఇవ్వాలని సదరు శాఖ అధికారులు కోరుతున్నారు. ఇందుకు డీఎంఈ అధికారులు వీలుకాదంటున్నారు. ఇదిలా ఉంటే వైద్య విధాన పరిషత్ పరిధి సీహెచ్సీలలో పనిచేస్తున్న డాక్టర్లు డీఎంఈ పరిధిలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. పైగా టెక్నికల్అంశాలను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు శాఖల్లో ఖాళీల సర్ధుబాటు ఫైల్ ను నేడో రేపో కలెక్టర్ కు అందించనున్నారు.
సీహెచ్సీలలో నిర్లక్ష్యం
జిల్లాలో స్టేషన్ ఘన్పూర్, బచ్చన్నపేట, జఫర్గడ్, పాలకుర్తి సీహెచ్‌సీలు ఉండగా, వైద్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్జరీలు నామ మాత్రంగా మారాయి. డాక్టర్లు సమయ పాలన పాటించడం లేదు. స్టాప్ నర్స్‌లు వంతులు పెట్టుకుని డ్యూటీ లు చేస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. గతంలో జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్, ఎంసీహెచ్‌లు వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉండగా, ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంఈ పరిధిలోకి వెళ్లాయి.
ఇదే క్రమంలో సర్కారు కొత్త కొలువుల అలాట్మెంట్లలో భాగంగా 157 మంది స్టాఫ్ నర్స్‌లు కొత్తగా విధుల్లో చేరారు. దీంతో ఇక్కడి స్టాఫ్ నర్స్ లు సీహెచ్సీలలోకి వెళ్లిపోయారు. కానీ, సదరు సీహెచ్సీలలో సర్జరీలు, పని కూడా సరిగా లేక స్టాఫ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సేవలు ఎక్కడెక్కడ ఎక్కువ అవసరమో గుర్తించి అక్కడ ఖాళీల భర్తీకి అనుగుణంగా చర్యలు చేపట్టాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి.