- వరద నష్టంలో సగానికి పైగా ఆ డిపార్ట్ మెంట్ కు లాస్
- రూ.434.07 కోట్ల నష్టం జరిగిందని అంచనా
- షార్ట్ టెండర్లు పిలుస్తున్న అధికారులు
ఖమ్మం, వెలుగు: ఇటీవల వచ్చిన భారీ వరదల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కే ఎక్కువ నష్టం వాటిల్లింది. అధికారుల తాజా అంచనాల ప్రకారం మొత్తం రూ.730 కోట్ల మేర అన్ని శాఖలకు నష్టం రాగా, అందులో ఏకంగా రూ.434.07 కోట్ల మేరకు ఇరిగేషన్ శాఖకు నష్టం వచ్చింది. ఊహించని విధంగా వచ్చిన విపత్తుతో చెరువులకే కాదు.. నాగార్జున సాగర్ కాల్వలకు కూడా గండ్లు పడగా కొన్ని చోట్ల కట్టలు కొట్టుకుపోయాయి. దీంతో 68 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
వ్యవసాయ సీజన్ లో రైతులకు నష్టం జరగకుండా పంటలకు సాగు నీరందించాల్సిన పరిస్థితిలో వెంటనే చెరువులకు, కాల్వలకు గండ్లు పూడ్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని చెరువులు, స్లూయిజ్ లకు మొత్తం 69 చోట్ల గండ్లు పడడం, డ్యామేజీ కాగా, ప్రాజెక్టులు, కాల్వలకు 24 చోట్ల గండ్లు పడడం, లైనింగ్ డ్యామేజీ అయ్యాయి. వీటన్నింటికి తాత్కాలిక రిపేర్ల కోసం రూ.37 లక్షలు అవుతాయని అధికారులు ప్రతిపాదించారు. శాశ్వతంగా వాటిని సరిచేయడం కోసం రూ.433.70 కోట్లు ఖర్చు అవుతాయని తేల్చారు. ఇవే లెక్కలను నష్టం అంచనాల కోసం వచ్చిన కేంద్ర అధికారుల బృందానికి ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అందజేశారు.
ఇదీ.. పరిస్థితి?
నాగార్జున సాగర్కాల్వలకు ఖమ్మం జిల్లాను ఆనుకొని సూర్యాపేట జిల్లా పరిధిలో గండిపడింది. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాల్వ 132 కిలోమీటర్ దగ్గర, ఎస్కేప్ రెగ్యులేటర్ సమీపంలోని ప్రధాన కాల్వ 133.6కిలో మీటర్ దగ్గర గండి పడింది. ఈ గండ్లు పూడ్చడంతో పాటు కాల్వ లైనింగ్ కోసం రూ.2.10 కోట్లతో అధికారులు టెండర్లు పిలిచారు. ఖమ్మం జిల్లా పరిధిలో గండ్ల పూడ్చివేత, లైనింగ్, ఇతర రిపేర్లకు రూ.17 కోట్లతో అంచనాలు రూపొందించారు. పాలేరు మినీ హైడల్ విద్యుత్ కేంద్రం దగ్గర కాల్వ కట్టకు గండి పడింది. రెండో జోన్ లో మెయిన్ కెనాల్ 140.200 కిలో మీటర్దగ్గర గండి పడగా, సమీపంలోనే మరో చోట కట్ట కోతకు గురైంది.
కాల్వలకు రిపేర్లను నామినేషన్ పద్ధతిలో కాకుండా, షార్ట్ టెండర్ పద్ధతిలో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రాసెస్ మొదలు పెట్టారు. నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, రెండు వారాల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. చెరువుల గండ్లకు త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.