పంట నష్టం లెక్కలు తీస్తున్నరు

  • సర్కారు ఆదేశాలతో రంగంలోకి వ్యవసాయ శాఖ 
  • గ్రామాల వారీగా సర్వే చేస్తున్న అధికారులు
  • కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే పరిహారం
  • ఇప్పటికే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దీంతో ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఏవోలు, హార్టికల్చర్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వెంటనే పంట నష్టం లెక్కలు తీయాలని ఆదేశించారు. పక్కాగా పంట నష్టం లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. దాని ఆధారంగానే ప్రభుత్వం రైతులకు ఇన్‌‌‌‌పుట్ సబ్సిడీ అందించనుంది. 

క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ.. 

వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై రెండ్రోజులుగా అగ్రికల్చరల్ ఎక్స్‌‌‌‌టెన్షన్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతు పేరు, తండ్రి పేరు, సోషల్‌‌‌‌ స్టేటస్‌‌‌‌, గ్రామం, మండలం, వేసిన పంట, జరిగిన పంట నష్టం, సర్వే నంబరు, 33 శాతం పంట నష్టం జరిగిందా? అంతకంటే ఎక్కువా? అనే వివరాలను సేకరిస్తున్నారు.

అలాగే ఆయా పంట భూములకు నీటి వసతి ఉందా? వర్షాధారమా? రైతుల బ్యాంకు అకౌంట్‌‌‌‌ నంబరు, బ్రాంచ్‌‌‌‌, ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీ కోడ్‌‌‌‌, ఆధార్‌‌‌‌ నంబరు, భూమి ఉన్న రైతా? కౌలు రైతా? ఇలా వివరాలను తీసుకుంటున్నారు. సర్వే అనంతరం గ్రామాలు, మండలాల వారీగా నివేదికలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించనున్నారు. ఈ వివరాల ఆధారంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలో పంట నష్ట పరిహారాన్ని జమ చేయనున్నారు. 

33 శాతం నష్టం జరిగితేనే..

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పంట కోల్పోయిన కౌలు రైతులను గుర్తించి వారికి సైతం పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రైతు వేసుకున్న పంటలో 33 శాతం నష్టం జరిగితేనే రైతుకు పరిహారం అందే వీలుంటుంది.

విపత్తుల సమయంలో పరిహారం విషయంపై కేంద్రం నిబంధనలే అమలవుతాయి. నిబంధనల మేరకు ఎంత నష్టం జరిగిందో దానికి అనుగుణంగానే రైతులకు పరిహారం అందనుంది.