ఇటీవల బాగ్‌అంబర్‌పేటలో కుక్కలు కొరికి చంపిన నాలుగేండ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తంతోపాటు మేయర్నిధి నుంచి ఆ బాలుడికి మరో రూ.2 లక్షలు కూడా అందజేయనున్నట్లు తెలుస్తున్నది. మేయర్, డిప్యూటీ మేయర్, 17 మంది కార్పొరేటర్లు తమ గౌరవ వేతనాన్ని కూడా ఆ బాలుడి కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మేయర్ తెలిపినట్టు వార్త కనిపించింది. వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి అవసరమైన చర్యలను కార్పొరేషన్ తీసుకుంటుందన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించాలన్న ప్రశ్న కూడా ఉదయిస్తున్నది. 30 వేల సంవత్సరాలకు పైబడి మనిషి కుక్కలతో సామరస్యంగా జీవిస్తున్నాడు. వీధి కుక్కలకు కూడా జీవించడానికి, వాటికి ఆహారం గురించి విడదీయరాని హక్కు ఉందని జంతు ప్రేమికులు, కార్యకర్తలు చాలా కాలంగా వాదిస్తున్నారు. దీన్ని నిషేధించడానికి వీల్లేదని కూడా వాళ్లు అంటున్నారు. ప్రజల ఆరోగ్యానికే కాదు జీవితాలకు కూడా వీధి కుక్కలు ముప్పుగా మారాయని, అందుకని జంతు ప్రేమికులు ఆ కుక్కలను దత్తత తీసుకోవాలని, వాటిని ఆశ్రమాల్లో ఉంచాలని వాదిస్తున్నారు. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. వీధి కుక్కలకు ఆహారం ఇవ్వకుండా నిరోధించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.
బర్త్ కంట్రోల్ నియమాలు
1960లో ప్రభుత్వం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం తీసుకొచ్చింది. జంతువులకు సరైన వసతులు, సౌకర్యాలు కల్పించి నాణ్యమైన జీవనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయకుండా, వాటి పట్ల క్రూరత్వంతో ప్రవర్తించకుండా ఉండటానికి ఈ చట్టం అత్యంత శ్రద్ధ తీసుకుంటుంది. క్రూరత్వం అంటే జంతువులను ప్రాణాంతకమైన గదుల్లో ఉంచి వాటిని నాశనం చేయకూడదు. అందుకని మున్సిపల్అధికారులు తమ విధిలో భాగంగా వాటిని అనాయసంగా చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో వారి అధికార పరిధిని చట్టం ప్రత్యేకించి చెప్పలేదు. ఈ అధికారాన్ని వారు ఎప్పుడు ఉపయోగించుకోవచ్చో కూడా చట్టంలో చెప్పలేదు. అయితే ప్రభుత్వం 2001లో వీధి కుక్కలను తగ్గించడానికి, జంతువుల బర్త్ కంట్రోల్నియమాలను ప్రకటించింది. ఈ నియమాల్లో కుక్కలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు. వీధి కుక్కల సంక్షేమం చూడటం కోసం జంతు సంక్షేమ సంస్థలను, ప్రైవేటు వ్యక్తులను గుర్తించాలని ప్రభుత్వం పేర్కొంది. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు ఇచ్చే విషయాన్ని పర్యవేక్షించడానికి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నియమాలు నిర్దేశిస్తున్నాయి. కుక్కకాటు బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ కమిటీ పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఆదేశాలను అమలు చేయడానికి స్థానిక మున్సిపల్అధికారులు వాటి కోసం జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. డాగ్ స్క్వాడ్లను నిర్వహించాలి. అనారోగ్యంగా ఉన్న వీధి కుక్కలను అనాయసంగా మార్చాలి. వాటిని స్టెరిలైజ్ చేసిన, టీకాలు ఇచ్చిన తర్వాతే బయటకు పంపించాలి.
నియంత్రణ నిరంతరం జరగాలి..
ప్రపంచంలోని చాలా దేశాల్లో వీధికుక్కల గురించి చట్టాలు ఉన్నాయి. వీధుల్లో కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడాన్ని జర్మనీ దేశం నిషేధిస్తున్నది. బహిరంగ స్థలాల్లో కుక్కలు తిరగడానికి వీల్లేదని స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఇలాంటి శాసనాలే అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్నాయి. మనిషి క్షేమంగా ఉండటం అవసరం. అలాంటి వాతావరణం, రక్షణ మనిషికి ఉండాలి. కుక్కల రక్షణ విషయంలో, అవి వీధుల్లో సంచరించడం విషయంలో బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించే విషయంలో మన దేశంలోని హైకోర్టులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులన్నీ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఈ విషయం గురించి సుప్రీంకోర్టు తన తీర్పును త్వరగా వెలువరించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా వీధి కుక్కలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అవి పిల్లలకు కాదు పెద్దలకు కూడా ప్రాణాంతకంగా మారిపోతున్నాయి. వీధికుక్కల బెడదను పరిష్కరించడానికి వాటి జనన నియంత్రణ కోసం స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ టీకాల అమలు నిరంతరం జరగాలి. ఒక దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించి ఆ తర్వాత నిర్వ్యాపకంగా ఉండటం వల్ల ప్రజల ప్రాణాలు హరించుకుపోతున్నాయి. నష్టపరిహారాలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి.. కానీ బాధను పోగొట్టలేవు.
కుక్కలకు బయట ఆహారం పెట్టడం నిషేధం?
ఈ మధ్యకాలంలో వీధి కుక్కల బెడద విషయం కేరళ హైకోర్టు దగ్గరకు వెళ్లింది. వీధి కుక్కలను తొలగించాలని ఒక వర్గం, అది సరికాదని మరో వర్గం వాదించాయి. క్రమబద్ధంగా స్టెరిలైజేషన్ చేస్తే సరిపోతుందని కూడా కొందరు వాదించారు. జంతు సంరక్షణ చట్టాలు, నియమాల కన్నా మానవ జీవితానికి కోర్టులు అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. 2021లో ఢిల్లీలోని ఇద్దరు వ్యక్తులు తమ ఇంటి ముందు వీధికుక్కలకు ఆహారం పెట్టే విషయంలో గొడవపడ్డారు. ఇదర్దూ ఒకరి మీద ఒకరు కేసులు దాఖలు చేసుకున్నారు. కమ్యూనిటీలో ఉండే కుక్కలకు ఆహారం అందించే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు బాంబే, కేరళ హైకోర్టు తీర్పులకు భిన్నమైనది. 2022 అక్టోబర్ 20న నాగ్పూర్బెంచ్ గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలను జారీ చేసింది.ఈ ఆదేశాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం ఎవరూ అందించకూడదు. వాళ్లు తమ ఇళ్లలోనే ఆహారం అందించాలి.
సుప్రీంకోర్టుకు చేరిన ఇష్యూ..
అంతరించిపోతున్న ఇతర జంతువుల కన్నా వీధి కుక్కల సంరక్షణ కోసమే ఈ నియమాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని కొంత మంది వాదన. పులులు, ఏనుగులు ఇతర అడవి జంతువుల రక్షణ కోసం తయారైన వన్యప్రాణి(రక్షణ) చట్టం1972 ఉన్నప్పటికీ, అమలు సరిగా లేక అవి అంతరించిపోతున్నాయని చాలా మంది భావిస్తున్నారు. వీధి కుక్కల సంరక్షణ కోసం సరైన మార్గదర్శకాల కోసం కొన్ని సంక్షేమ గ్రూపులు దేశంలోని కొన్ని హైకోర్టులను ఆశ్రయించాయి. ఈ రిట్ పిటిషన్లకు స్పందిస్తూ 2007లో బాంబే హైకోర్టు కొన్నిమార్గదర్శకాలను జారీ చేసింది. పబ్లిక్స్థలాల్లో, బీచ్‌ల దగ్గర వీధి కుక్కలకు ఆహారం ఇవ్వకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ ఆదేశాలు ప్రభుత్వం తయారు చేసిన నియమాలను అధిగమించాయని కొంత మంది కార్యకర్తలు విశ్వసించి, ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
- మంగారి రాజేందర్, జిల్లా జడ్జి(రిటైర్డ్)