ఇటీవల ‘ఇంటలెక్చువల్ ఒబెసిటీ’ ఎక్కువైన ఓ యువకుడు అయ్యప్పస్వామి జననంపై ‘జుగుప్సాకర’ వ్యాఖ్యలు చేసి, జైలుపాలయ్యాడు. కొందరు హద్దులు మీరి ఛీప్ ‘పాపులారిటీ’ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను చేసిన ప్రసంగం అశ్లీల అసభ్యంతో కూడి ఉందే కానీ ‘జ్ఞానం’తో చేసింది కాదు. ఆ అశ్లీలత వల్లనే అతనిపై ప్రజలు అంతగా తిరగబడ్డారు. ఈ వారంలో అయ్యప్పలు, ఇతర హిందూసంఘాలు చేసిన నిరసనను కమ్యూనిస్టులే చేస్తే ‘మహా విప్లవం’ అని వర్ణించేవారు. ఏ హిందూమతాన్ని అతను దూషించాలని సాహసించాడో, అది సజీవంగా ఉన్నంతకాలమే ఇటువంటి వారు ఇటువంటి విమర్శలు బహిరంగంగా చేయగలిగే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వంటి ఇస్లామిక్ రిపబ్లిక్ల లో గానీ, చైనాలాంటి బౌద్ధ, కమ్యూనిస్టు, నాస్తిక దేశంలోగానీ అది సాధ్యంకాదు. వీళ్లంతా కోరుకునేది ఈ రెండు రాజ్యాల ఆదర్శాలనే. ఇక ఈ గుంపు ఈ వెర్రిచేష్టలకు డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను, గౌతమబుద్ధుణ్ణి అడ్డుగా పెట్టుకుంటారు. ఈ సందర్భంలో ఓ చారిత్రక సత్యం చర్చించాలని ఉంది.
1947లో భారతదేశం రెండు ముక్కలయ్యాక పాకిస్తాన్, భారత్ రెండు దేశాలకు ఇద్దరు దళిత మేధావులు న్యాయశాఖ మంత్రులయ్యారు. ముస్లింలీగ్ అంతకు ముందు క్రియాశీలకంగా ఉన్నా జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్‌కు, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత్‌కు న్యాయశాఖామంత్రులయ్యారు. పాకిస్తాన్లో అక్కడి వాళ్లు హిందువులపై చేస్తున్న అరాచకాలు, మతహింస చూసి కొన్ని సంవత్సరాల్లోనే జోగేంద్రనాథ్ మండల్ భారత్‌కు తిరిగి వచ్చి, సాధారణ జీవితం గడిపాడు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఈ దేశం శిఖరాగ్రంపై నిలిపింది. ఆయన తన జీవితకాలంలో ‘పీడితప్రజల’ కోసం అనేక పోరాటాలు చేశాడు. ఆయన మతం మారిన వ్యవహారం కూడా ఈ సమాజంలో కరుడుగట్టిన కులోన్మాదులకు ‘ఝలక్’ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిందే. 14 అక్టోబర్ 1956 నాడు తనవెనుకున్న లక్షలాది మందితో కుల వ్యవస్థపై తక్షణ తిరుగుబాటుగా జరిగిన మతమార్పిడి అది. పైగా హిందూ సంస్కృతిలో భాగం అయిన బౌద్ధాన్నే అంబేద్కర్ స్వీకరించాడు. ఈ సూడో మేధావుల్లా ఇంటిలో క్రైస్తవం, వీధిలో బౌద్ధం కాదు.
తాత్వికత తెలియని అజ్ఞానులు
డా.అంబేద్కర్ అసలు పేరు భీంరావు. తనని చిన్నతనంలో ఆదరంగా చూసిన అంబేద్కర్ అనే బ్రాహ్మణ టీచర్ పేరును ఆయన ముందు పెట్టుకున్నారు. సనాతన ధర్మం కొరకు పోరాడిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కుమారుడు శ్రీధర్ పంత్ బాబాసాహెబ్‌కు ముఖ్య అనుచరుడు. బాబాసాహెబ్ తన జీవిత సంఘర్షణను శాస్త్రీయంగా, తర్కబద్ధంగా ప్రజలముందు పెట్టిన పరిశోధకుడే గానీ అవాకులు చవాకులూ మాట్లాడిన అజ్ఞాని ఎంతమాత్రం కాదు. అంబేద్కర్ బౌద్ధం స్వీకరించాక రెండు మాసాలు గడవకముందే మరణించాడు. తన లక్ష్యం పరిపూర్ణంగా నెరవేరలేదని బౌద్ధం అనే తాత్విక దృక్పథంతో దాన్ని సాధించాలని తలంచాడనిపిస్తుంది. ఇదంతా అర్థకాకుండా అంబేద్కర్ ముసుగువేసుకొని తిరిగే ‘మార్క్సిస్టులు’ కొందరు ఈ దేశంలో హిందూత్వను తిట్టేందుకు బౌద్ధం, అంబేద్కరును ఉపయోగిస్తున్నారు. బౌద్ధంలోని ‘తాత్వికదర్శనం’ వీళ్లకు పట్టదు.
2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో 500 అడుగుల ఎత్తు ఉన్న బమియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన తాలిబన్ల దుశ్చర్యలను ఈ ‘బుద్ధముసుగులు’ ఖండించవు. 1960-–70 దశకాల్లో చైనా కమ్యూనిస్టులు టిబెట్ లో బౌద్ధ ఆరామాలను, విగ్రహాలను, బౌద్ధ అధ్యయన కేంద్రాలను ధ్వంసం చేస్తుంటే చైనా, రష్యా రాగాలను ఆలపించారు.ఈ గుంపు హిందుత్వంపై చేసే విమర్శ అంతా పై పైన ద్వేషంతో కూడిందే. హిందూమత మూల సిద్ధాంతాలపై వీరికి పిచ్చి వ్యతిరేకత తప్ప ఇంకేం లేదు. స్వామి దయానందసరస్వతి, స్వామి వివేకానంద వంటివారు ఒక సకారాత్మక దృక్పథంతో హిందూమతాన్ని చాలా గట్టిగా విమర్శించారు, అలాగే హిందూత్వంలోని లోపాలను సరిదిద్ది ఉద్ధరించే ప్రయత్నమూ శాయశక్తులా చేశారు. వారి విమర్శలను స్వీకరించిన హిందూత్వం ‘సనాతనం’ ‘నిత్యనూతనం’ అవుతున్నది. ఈ నాస్తికవాదులు
అంతకన్నా ఎక్కువ విమర్శించగలరా?
అన్ని కులాలు ఆచరిస్తున్న దీక్షలు
వర్గ, వర్ణ, జాతి భేదం లేకుండా అందరూ సమానంగా జీవించాలనే దృక్పథాన్ని ఆచరణలో చూపించేందుకు హిందూ సమాజంలో ‘మాలధారణ’ అనేది ఒక సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకున్నది. అందులో అయ్యప్ప, శివ, హనుమాన్, శ్రీమాత వంటి దీక్షలలో అన్ని కులాలవారు పాల్గొనడం, కులభేదం ఎక్కడైనా ఉంటే దాన్ని తొలగించే పని చేయడం ఈ శక్తులకు ఇష్టం లేదు. అందుకే ఆ దేవుళ్లపై తమ ఇష్టం వచ్చినట్లు అనుచితమైన వ్యాఖ్యలు చేసున్నారు. ఈ దేశంలో దేవుడు అన్న అంశంపైన జరిగిన పరిశోధన అనంతం. బహుశా! ఏ దేశంలోనూ ఇంత లోతుగా పరిశోధన జరగలేదు.
హిందూ దేవుళ్లను పొగిడిన విదేశీ విజ్ఞులు
అసలు ‘దేవతా తత్వం’ తెలియనివాళ్లు ఈ కారుకూతలు కూయడం, దానికి బాబాసాహెబ్ పేరు పెట్టడం ఆశ్చర్యం. ‘Indian Symbolism is expert than Greak mythology’ అని పాశ్చాత్యులు తమ రచనల్లో రాసుకొన్నారు. సరస్వతి ఏ విశ్వవిద్యాలయంలో చదివింది?' అని నిస్సిగ్గుగా ప్రశ్నించే అజ్ఞానులకు ఏం చెప్పగలం? సరస్వతి జ్ఞాన ప్రతీక. వీణా పుస్తక ధారిణిగా ఆమెను అర్చిస్తాం. పుస్తకం విద్యకు, వీణ కళలకు ప్రతీక. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టడం అంటే సంపద శుద్ధంగా (వైట్ మనీ) ఉండాలని సంకేతం. ధర్మాన్ని ఎద్దుగా చెప్పారు. మన చైతన్యంలోని సృజనశక్తే జడపదార్థంగా కన్పిస్తుంది. ఈ శుద్ధ చైతన్యమే విష్ణు, శివ, శక్తి రూపాలుగా కన్పిస్తాయి. దీన్ని ‘Anthro Promarphism’ గా పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచంలో దేవుడిని నటరాజుగా చూపించే సంస్కృతి హిందూమతంలోనే ఉంది. శివతాండవమే ఈ సృష్టి. శబ్దానికి ఢమరుకం, చైతన్యానికి అగ్ని శివుడి చేతిలో ఉండే ప్రతీకలు. శబ్దం, చైతన్యం ఈ రెండూ సృష్టికి మూలం అని చెప్పడం దాని అంతరార్థం. ‘మార్క్స్ ముల్లర్’ మొదలుకొని ‘వెండీ డోనిగర్’ వరకు ఎందరో కొందరు హిందూదేవుళ్లను పొగిడారు, కొందరు తెగిడారు. అయినా ఈ ధర్మానికి ‘హిందూ మహాసాగరం’లా అన్ని నదులనూ కలుపుకునే ‘క్షమత’ ఉంది. హిమాలయాలంతటి ఎత్తులో తల ఎత్తి నిలబడగల సామర్థ్యమూ ఉంది.
ఉబ్బసం ఎప్పుడూ చైతన్యం కాదు
అందరికీ మనోభావాలున్నట్లే ఈ దేశంలో ఆయా దేవుళ్లను పూజించే వాళ్లకు కూడా ఉంటాయన్న విషయం కమ్యూనిస్టులు గుర్తించకపోవడం వల్లే మార్క్స్ మాయమయ్యాడు, మావో దోషిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ కొత్తరకం మేధావుల ‘ఉబ్బసం’ సమాజానికి కొత్తరోగం తెచ్చి పెడుతుంది తప్ప చైతన్యం రాదు. నాస్తికులు దేవుడు నాస్తి అంటూ తమ స్వశక్తిపై నిలబడాలిగానీ పరనింద చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు, సమాజంలో ఉద్వేగాలు రగిలించడం తప్ప. ఇలాంటి ఉద్వేగాలు మెజారిటీ ప్రజల మనోభావాలకు గొడ్డలిపెట్టుగా మారితే దాంతో కొత్త రకం విప్లవాలు పుడుతాయి.
అజ్ఞాన విమర్శలు
అది దైవత్వాన్ని ఒక వస్తువుకో, వ్యక్తికో పరిమితం చేయలేదు. అదొక నిరంతర నిత్య చైతన్యం. ఆ చైతన్యాన్ని అర్థం చేయించేందుకు 5 లక్షల శ్లోకాలతో 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, లక్ష శ్లోకాల భారతం, 24 వేల శ్లోకాల రామాయణం, భాగవతం వంటి అనేక మూలగ్రంథాలను హిందూ ఋషులు అందించారు. దైవిక శక్తుల జననం గురించి ఈ రోజు మన పద్ధతిలో ఆలోచించడం అజ్ఞానం. యోగశక్తులు, తంత్ర సూత్రాలు, ప్రతీకలతో ఉండే ‘దైవీ శక్తుల పుట్టుక’ ఈనాటి పాశ్చాత్య కళ్ళతో చూడటం ఇలాంటి అపార్థాలకే దారితీస్తుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులు కలిస్తే నీరు ఎలా ఏర్పడుతుంది అని అడగడం ఎంత అజ్ఞానమో అయ్యప్ప పుట్టుకకు కారణాలను ప్రశ్నించడం అంతే అజ్ఞానం. రావణుడి పది తలలకు తలనొప్పి వస్తే ఏ తలకు ‘జండూబామ్’ రాసుకుంటాడు అనే పిల్లచేష్టలాంటిది. ఇదంతా ఏమీ తెలియకుండా చేసే అజ్ఞాన విమర్శలు హిందూమతానికి కొత్తకాదు. కానీ తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్న వాళ్లకు ఇదంతా అర్థం కాదు. ఇక్కడి హిందూత్వం ధ్వంసం అయ్యాక మరుక్షణం ప్రజాస్వామ్యం పేకమేడలా కుప్పకూలిపోవడం ఖాయం.
సంకీర్తనలు అందించిన ఇద్దాసు
ఆర్య సమాజ దృక్పథంలోనే తెలంగాణ దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ, సుమిత్రాదేవి వంటి వారు, అచలమార్గంలో అరిగె రామస్వామి వంటివాళ్లు గొప్ప నాయకులయ్యారు. వందేళ్ల క్రితమే తమ ఆధ్యాత్మికతతో అందరినీ మెప్పించి గొప్ప తాత్విక పద సంకీర్తనలు అందించిన తెలంగాణ తొలి దళిత కవి మహాయోగి దున్న ఇద్దాసు సిద్ధాంతాలకు, ఆచరణకు విలువ లేదా? కొందరికి హిందూమతం ఇస్తున్న స్వేచ్ఛను గురించిన పరిజ్ఞానం లేకుండా నోరుందికదా అని ఏదో ఒకటి మాట్లాడటం అలవాటు అయ్యింది. ఈ చర్యలకు కారణమైన ఈ అల్పజ్ఞులకన్నా వీళ్లను వెనుక ఉండి నడిపించే ‘సూడో ఇంటలెక్చువల్స్’ ఇంకా ప్రమాదకారులు. మంచి భాషలో దైవదూషణ చేసే ఒక విజ్ఞానవేత్త ఇటీవల ఏకంగా కేంద్ర సాహిత్య పురస్కారమే పొందాడు.
- డా.పి.భాస్కరయోగి, సోషల్ ఎనలిస్ట్