మిర్యాలగూడలో అమృత-ప్రణయ్కు జరిగినట్టే.. సూర్యాపేటలో అమానుష ఘటన..

మిర్యాలగూడలో అమృత-ప్రణయ్కు జరిగినట్టే.. సూర్యాపేటలో అమానుష ఘటన..

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరువు హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి హత్యకు గురయ్యాడు.  పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాలవ కట్టపై మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే హత్యకు ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు నెలల కిందట పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న బంటి సూర్యాపేటలో కాపురం పెట్టాడు. ప్రేమ పెళ్ళిని నిరాకరించిన భార్గవి తల్లిదండ్రులు వారినే విడదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ALSO READ | బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

కులాంతర వివాహం చేసుకున్న బంటిపై  కక్ష్య పెంచుకున్న  భార్గవి సోదరుడు కోట్ల నవీన్ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం(జనవరి 26, 2025) 5 గంటల సమయంలో మహేష్ అనే మిత్రుడి నుంచి ఫోన్ కాల్ అందుకున్న బంటి భార్యకు ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళాడు. రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో బంటి ఆచూకీపై ఆందోళనకు గురైన బాధిత కుటుంబానికి పిడుగుపాటు వార్త తెలిసింది. భార్గవి ఇంటికి సమీపమైన పిల్లలమర్రి  చెరువు శివారులో మృత దేహాన్ని పడేశారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లు గుర్తులు కన్పిస్తున్నాయి.  దీనితో పాటు మృతుడి ఒంటిపై కమిలిన గాయాలున్నాయి. నిందితులను గుర్తించేందుకు పోలీసులు  గాలిస్తున్నారు.