
మహబూబాబాద్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ మారాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు.. సొంత పార్టీ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మరోసారి మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు నిరసన గళం తగిలింది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సర్పంచులు, ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వర్గీయులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, తెలంగాణ ఉద్యమకారులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టించుకోవడం లేదని సర్పంచులు, ముఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఉద్యమకారులు, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ టికెట్ కొత్త వ్యక్తికి ఇవ్వాలని, లేకపోతే శంకర్ నాయక్ కు ఇస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ టికెట్ ఇవ్వొద్దంటూ అధినేత కేసీఆర్ ను కలిసి వివరిస్తామంటున్నారు. మరోసారి శంకర్ నాయక్ కు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు.