
- ప్రతీకార సుంకాలపై వైట్‌హౌస్ అధికార ప్రతినిధి
- ఇండియా 100%, యూరప్ 50% సుంకాలు విధిస్తున్నయి
- నేటి నుంచి భారత్ సహా అన్ని దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్స్!
- ఏప్రిల్ 2 అమెరికాకు ‘లిబరేషన్ డే’ అన్న ప్రెసిడెంట్
వాషింగ్టన్: ఇండియా, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నీ అమెరికా వస్తువులపై అత్యధికంగా టారిఫ్‌లు వేస్తున్నాయని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లీవిట్ విమర్శించారు. తాము కూడా ఏ దేశాన్నీ మినహాయించకుండా అన్నింటిపైనా ప్రతీకార సుంకాలు (రెసిప్రోకల్ టారిఫ్ లు) విధిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమెరికాపై ఏ దేశం ఎంత టారిఫ్ వేస్తే.. తాము కూడా అంతే టారిఫ్ వేస్తామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.
ఏప్రిల్ 2వ తేదీ అమెరికాకు ‘లిబరేషన్ డే’గా నిలిచిపోతుందని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో డెడ్ లైన్ కు రెండు రోజుల ముందు మంగళవారం ఉదయం వైట్ హౌస్ వద్ద మీడియాతో కరోలిన్ మాట్లాడారు. ఆయా దేశాలు తమపై ఎంత మొత్తంలో సుంకాలు విధిస్తున్నాయన్న దానిని ఆమె వివరించారు. ‘‘ఈ అన్యాయమైన వ్యాపార విధానాలు చూడండి. అమెరికన్ డైరీ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50% టారిఫ్ వసూలు చేస్తోంది.
అమెరికన్ బియ్యంపై జపాన్ ఏకంగా 700% సుంకాలు వేస్తోంది. ఇక అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్టులపై ఇండియా 100% టారిఫ్ వసూలు చేస్తోంది. అలాగే అమెరికన్ బటర్, చీజ్ పై కెనడా 300% సుంకాలు అమలు చేస్తోంది. దీనివల్ల అమెరికన్ ఉత్పత్తులను ఆయా దేశాల మార్కెట్లలోకి ఎగుమతి చేయడం దాదాపుగా అసాధ్యమవుతోంది. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే తగిన సమయంగా భావిస్తున్నాం” అని ఆమె స్పష్టం చేశారు.
ట్రేడ్ బారియర్స్ రిపోర్ట్ విడుదల..
అమెరికాపై ఏయే దేశాలు ఎలాంటి ట్రేడ్ పాలసీలు, నిబంధనలను అమలు చేస్తున్నాయో వివరిస్తూ ట్రంప్ సర్కారు సోమవారం ‘ట్రేడ్ బారియర్స్ రిపోర్ట్’ కూడా రిలీజ్ చేసింది. అమెరికాకు వాణిజ్యపరంగా ఉన్న ఈ అడ్డంకులను దేశ చరిత్రలో ఏ ప్రెసిడెంట్ కూడా గుర్తించలేదని, ఇప్పుడు ట్రంప్ నాయకత్వంలో ఈ అన్యాయమైన విధానాలను సరిదిద్దుతున్నామని పేర్కొంది.
ఏప్రిల్ 2న ఒకరు అరెస్ట్ అవుతరు: మస్క్
అమెరికాలో అక్రమ వలసదారులను ఓటర్లుగా మార్చేందుకోసం 4 లక్షల సోషల్ సెక్యూరిటీ నెంబర్లను చోరీ చేశారని, ఈ స్కాంకు సంబంధించి బుధవారం ఒకరు అరెస్ట్ అవుతున్నారని డిపార్ట్ మెంట్ ఆఫ్గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) చీఫ్ ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీనిపై ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడగా.. ఆ వాయిస్ నోట్ ను మంగళవారం ఉదయం ‘ఎక్స్’లో డోజ్ డిజైనర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.
‘‘సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి 4 లక్షల మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి అమ్మేశారన్న ఆరోపణలకు సంబంధించి రేపు ఓ వ్యక్తి అరెస్ట్ అవుతారు. చోరీ చేసిన ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్లతో అమెరికా పౌరసత్వం లేని వలసదారులనూ ఓటర్లుగా మార్చేశారు. వలసదారులకు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, నిరుద్యోగ ప్రయోజనాలను డెమోక్రాట్లు కల్పించారు. అక్రమ వలసదారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని అన్ని అవకాశాలనూ వారు వాడుకున్నారు” అని మస్క్ ఫైర్ అయ్యారు.
హెల్త్ ఏజెన్సీలలో లే ఆఫ్‌లు షురూ
అమెరికా హెల్త్ ఏజెన్సీలలో లే ఆఫ్ లు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్ హెచ్ ఎస్) ఉద్యోగులకు నోటీసులు అందడం ప్రారంభమైంది. హెచ్ హెచ్ఎస్ లో10,000 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.