త్వరలో సింగరేణిలో ‘గుర్తింపు’ ఎన్నికలు

  • ఈనెల 4న మేనేజ్‌‌మెంట్‌‌, యూనియన్లతో ఆర్‌‌ఎల్‌‌సీ మీటింగ్‌‌
  • ఓటర్ల జాబితా విడుదల, 27న ఎన్నికల ప్రక్రియపై చర్చ

గోదావరిఖని, వెలుగు :  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుండడంతో ఇక ఆరు జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి సంస్థలో 'గుర్తింపు సంఘం' ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఈనెల 27న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈనెల 4న హైదరాబాద్‌‌లో డిప్యూటీ సెంట్రల్‌‌  లేబర్‌‌  కమిషనర్‌‌ (డీవైసీఎల్‌‌సీ) ఆఫీసు‌లో సింగరేణి మేనేజ్‌‌మెంట్‌‌కు, 13 రిజిస్టర్డ్‌‌  కార్మిక సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో మీటింగ్‌‌  ఏర్పాటు చేశారు. ఈ సమావేశం‌లో మేనేజ్‌‌మెంట్‌‌ అందజేసిన కార్మికుల ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ను యూనియన్ల ప్రతినిధులకు అందజేయనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న మీటింగ్‌కు మేనేజ్‌‌మెంట్‌‌ ప్రతినిధులు, యూనియన్ల ప్రతినిధులు తప్పక హాజరు కావాలని డిప్యూటీ సీఎల్‌‌సీ డి.శ్రీనివాసులు పేర్కొన్నారు. దీంతో సమావేశానికి హాజరయ్యేందుకు యూనియన్ల లీడర్లు సమాయత్తమవుతున్నారు. కాగా, 2017 సెప్టెంబర్‌‌ 5న జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌  అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌‌) 11 ఏరియాల్లో తొమ్మిది ఏరియాలు గెలుచుకుని గుర్తింపు సంఘమైంది.

అయితే, నాలుగేళ్ల కాలపరిమితియా లేక రెండేళ్ల అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో గతంలో ఉన్న యూనియన్ల మాదిరిగానే నాలుగేళ్ల పాటు తాము గుర్తింపు సంఘంగా ఉంటామని టీబీజీకేఎస్‌‌  కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల సమయం కూడా పూర్తవడంతో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని పలు యూనియన్లు కోర్టును ఆశ్రయించాయి. అలాగే కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశాయి. దీంతో సెంట్రల్‌‌  లేబర్‌‌  కమిషనర్‌‌  ఆఫీస్‌‌ అధికారులు స్పందించి సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. మొదట ఈ ఏడాది అక్టోబర్‌‌ 28న సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి లేబర్‌ ‌ కమిషనర్‌‌  నిర్ణయం తీసుకున్నారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదల కావడంతో పాటు ఈ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సపోర్ట్‌‌  ఉండదని సింగరేణి మేనేజ్‌‌మెంట్‌‌  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం సహకారం అందిస్తుందని అండర్‌‌ టేకింగ్‌‌ ఇవ్వడంతో అక్టోబర్‌‌ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను డిసెంబర్‌‌  27వ తేదికి వాయిదా వేశారు. ఆ మేరకు డిప్యూటీ సీఎల్‌‌సీ సింగరేణి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన చర్యలను చేపట్టారు.