- ఇయ్యాల్టి నుంచి ఏప్రిల్ 5 వరకు అఫిలియేషన్లకు దరఖాస్తులు
- నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది (2022–23) ఇంటర్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలంటే ఫైర్ ఎన్వోసీ సర్టిఫికెట్ ఉండాల్సిందేనని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇది లేకుంటే అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. అప్లికేషన్‌తోపాటు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జత చేయాల్సిందేనని చెప్పింది. 2022–23 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి జూనియర్ కాలేజీల అఫిలియేషన్ కోసం ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ మంగళవారం నోటిఫికేషన్ ఇచ్చారు. అడిషనల్ సెక్షన్లకు అప్లై చేసుకోవచ్చని, ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 23 నుంచి ఏప్రిల్ 5 వరకు, రూ.20 వేల ఫైన్‌తో మే 17 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు. రూ.వెయ్యి ఫైన్‌తో ఏప్రిల్ 12 వరకు, రూ.3 వేల ఫైన్‌తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఫైన్‌తో 26 వరకూ, రూ.10 వేల ఫైన్‌తో మే 3 వరకు, రూ.15 వేల ఫైన్‌తో మే 10 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. గుర్తింపు కాలేజీల లిస్టును మే 31న ప్రకటిస్తామని వెల్లడించారు. జీవో నంబర్ 29 ప్రకారం బిల్డింగ్ సెఫ్టీ నిబంధనలు పాటించాలని, ఎఫ్డీఆర్, బిల్డింగ్, ప్లే గ్రౌండ్ రిజిస్ట్రేషన్ లీజ్ డీడ్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలన్నారు.
అఫిలియేషన్ ఫీజులు పెంచారు
రెండేండ్ల నుంచి ప్రైవేటు కాలేజీల మేనేజ్‌మెంట్ల విజ్ఞప్తుల మేరకు ఇన్‌స్పెక్షన్, అఫిలియేషన్ ఫీజులు పెంచలేదని సర్కారు గుర్తుచేసింది. అయితే ఈసారి వాటి ఫీజులు పెంచుతున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలేజీల ఇన్‌స్పెక్షన్ ఫీజును రూ.46 వేల నుంచి రూ.65 వేలకు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని కాలేజీలు చెల్లించే ఫీజులను రూ.36 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. సెక్షన్ ఫీజు, ఒకేషనల్ కాలేజీల ఫీజులను కూడా పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.