ట్రాన్స్ జెండర్ల హక్కుల్ని గుర్తించాలి

ఈ దేశంలో పుట్టిన ప్రతి ‘వ్యక్తి’కీ సమానమైన హక్కులు ఉంటాయని మన రాజ్యాంగం చెబుతోంది. ఇక్కడ వ్యక్తి అనే పదం ఆడ, మగకు మాత్రమే కాదు. హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లకూ  వర్తిస్తుంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు అన్ని పౌర హక్కులు ఉంటాయి. కానీ సమాజంలో ఎప్పటి నుంచో హిజ్రాలు విషయంలో వివక్ష కొనసాగుతోంది. తోటి మనిషితో సమానంగా చూడలేని దుస్థితి ఉంది. ఏళ్లుగా అనుభవించిన వేదనలకు ఎట్టకేలకు కొంత ఉపశమనం ఇచ్చేలా కేంద్రం ట్రాన్స్ జెండర్స్ హక్కుల పరిరక్షణ చట్టం చేసింది. కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా వారి హక్కులను గుర్తించకపోవడం శోచనీయం.

పుట్టుకతో వచ్చిన భౌతిక లింగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ.. పూర్తి భిన్నంగా జీవించాలని కోరుకునే హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లు.. మన దేశం బ్రిటిషర్ల పాలనలోకి వెళ్లకపూర్వం గౌరవంగానే బతికారు. మన దేశంలో ఈ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని  హిజ్రాలు, అరువనీలు, తిరునంగీలు, జోగప్పలు, శివశక్తులు, యునక్ లు అని వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కోలా పిలుస్తుంటారు. రామాయణ కాలంలో శ్రీ రాముడు ట్రాన్స్ జెండర్లకు ఇతరులను ఆశీర్వదించే వరం ప్రసాదించాడని కొన్ని రాష్ట్రాల్లో నమ్ముతారు. వారిని శివపార్వతుల ప్రతిరూపంగా చూస్తారు. ఏ శుభకార్యం జరిగినా ముందుగా వారి నుంచి ఆశీస్సులు తీసుకునే అచారాన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముస్లిం సామ్రాజ్యాలైన ‘ఒట్టోమన్’ మరియు ‘మొఘల్’ న్యాయస్థానాల్లో వీరు ముఖ్యమైన పాత్ర పోషించేవారు. మన దేశంలో అప్పటి వరకు హాయిగా సాగుతున్న ట్రాన్స్ జెండర్ల జీవితాలను బ్రిటిషర్లు వచ్చాక క్రిమినల్ ట్రైబ్స్ చట్టం–1871 తెచ్చి ఆగం చేశారు. నేరాలు జరిగినప్పుడు ఆధారాలు లేకుండా ట్రాన్స్ జెండర్లను నేరస్తులుగా చిత్రించి.. హింసించడం, ఏళ్లతరబడి జైళ్లలో పెట్టడం వంటివి చేయడంతో అది నమ్మి సమాజంలో తోటివాళ్లు హిజ్రాలను దూరంగా పెట్టడం స్టార్ట్ చేశారు. క్రమంగా వాళ్లను పనుల్లోకి రానీయకుండా చేయడంతో బతుకు బండి నడపడానికి ఉపాధి లేకుండా పోయింది.

ఏళ్ల తరబడి న్యాయపోరాటం తర్వాత..

దేశానికి స్వతంత్రం వచ్చాక బ్రిటిష్ కాలపు అమానవీయ చట్టాన్ని రద్దు చేశారు. దీంతో హిజ్రాలతో పాటు అనేక గిరిజన తెగలకు రిలీఫ్ వచ్చింది. అయితే అప్పటికే సమాజంలో వివక్ష పెరిగిపోవడంతో వాళ్ల బతుకులు చిద్రమైపోయాయి. ఏళ్లు గడిచినా భిక్షాటనే వృత్తిగా బతకాల్సిన దుస్థితి పట్టింది. కొన్ని చోట్ల ట్రాన్స్ జెండర్లు, హిజ్రాలు సెక్స్ వర్కర్లుగా బతుకుతున్నారు. స్వతంత్ర్యం వచ్చి ఏళ్లు గడిచినా వాళ్లకు హక్కులు కల్పించడంపై ఏ ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. వారికి ఓటు హక్కు కూడా ఇవ్వలేదు. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు రాష్ట్రాల హైకోర్టుల్లో పిటిషన్లు వేశారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2014లో సుప్రీం కోర్టు వారికి థర్డ్ జెండర్ గా గుర్తింపు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. పుట్టుకతో వచ్చిన భౌతిక లింగాన్ని బట్టే కాకుండా వారు మానసికంగా అనుకుంటున్న లింగాన్ని బట్టి లీగల్ జెండర్ ఐడెంటిటీని ఇవ్వాలని ఆదేశించింది. అలాగే రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండాలని, విద్య, ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు ప్రాథమిక హక్కుల విషయంలో కుల, మత, లింగ, జాతి వివక్షకు తావు ఉండకూడదని పేర్కొంది.

చట్ట ప్రకారం ఇవి తప్పనిసరి

ట్రాన్స్ జెండర్ల హక్కులపై ఆ తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చివరిలో ట్రాన్స్ జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం–2019ని తెచ్చింది. దీనిని 2020 జనవరిలో రాష్ట్రపతి ఆమోదించారు. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ట్రాన్స్ జెండర్స్ హక్కులకు రక్షణ కల్పించాల్సి ఉంది. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్క ప్రభుత్వ హెచ్ఐవీ హాస్పిటల్ పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో హెల్త్ కేర్ వసతుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి. హిజ్రాలకు కూడా ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించాలి. ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలి. పక్కా గృహాలు నిర్మించి వసతులు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. కల్చరల్, సోషల్ లైఫ్ లో వారు ఒకప్పుడు ఎలా అయితే గౌరవంగా జీవించారో మళ్లీ ఆ గౌరవాన్ని తిరిగి పొందడానికి చర్యలు తీసుకోవాలి. ప్రజలు వారి పట్ల చిన్న చూపు చూడకుండా అవగాహన కల్పించాలి. ట్రాన్స్ జెండర్లను సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల వారిగా గుర్తించి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని రకరకాల హక్కులను చట్టంలో కల్పించింది కేంద్రం. అయితే చట్టం అమలులో నిర్లక్ష్యం వల్ల వారి పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను రాష్ట్రాలు సీరియస్ గా తీసుకుని అమలు చేస్తే.. వారికి సమాజంలో అందరితో ఈక్వల్ గా బతికే అవకాశం కలుగుతుంది.