- సర్కార్ పెద్దలు, మంత్రులను కలుస్తున్న ఆశావహులు
- రెండు, మూడ్రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీ భేటీలు
- మూడు పేర్లను ఫైనల్ చేసి గవర్నర్కు పంపనున్న కమిటీ
- ఈ నెలాఖరులోపే ప్రక్రియ పూర్తిచేసే యోచనలో సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీల్లో వీసీ పోస్టులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఆ పోస్టులను ఎలాగైనా దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను సీనియర్ ప్రొఫెసర్లు కలుస్తూ పైరవీలకు తెరలేపారు. అయితే, ప్రస్తుతం పని చేస్తున్న పలువురు వీసీలపై అనేక ఆరోపణల నేపథ్యంలో సర్కారు ఆచితూచి అడుగులు వేస్తున్నది.
సెర్చ్ కమిటీల భేటీపై ఫోకస్
స్టేట్లో ఖాళీగా ఉన్న 10 వర్సిటీల్లోని వీసీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియను పూర్తికాగా.. సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కాకతీయ వర్సిటీ మినహా మిగిలిన ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన , తెలంగాణ, పాలమూరు, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లో కాకతీయ వర్సిటీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్ల ఎంపిక
ఈ నెల21తో వర్సిటీ వీసీల పదవీకాలం ముగియనుంది. అంతలోపే కొత్త వీసీలను నియమించాలని సర్కారు భావించింది. కానీ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెర్చ్ కమిటీల ఏర్పాటు, సమావేశాలు జరగలేదు. విద్యాశాఖ లేఖ రాయడంతో పోలింగ్ తర్వాత వీసీల రిక్రూట్మెంట్కు ఈసీ అనుమతి ఇచ్చింది.దీంతో కేయూ మినహా మిగిలిన వర్సిటీలకు సెర్చ్ కమిటీలను సర్కార్ వేసింది. ఈ కమిటీలు312 మంది ప్రొఫెసర్ల బయోడేటాను పరిశీలించి, ఒక్కో వర్సిటీకి మూడు పేర్లను ఎంపిక చేసి గవర్నర్కు పంపించనున్నాయి. గవర్నర్ దాంట్లో ఒక పేరును వీసీగా ప్రకటిస్తారు.
పైరవీల జోరు..
గతంలో బీఆర్ఎస్ సర్కారు వీసీలను నియమించకుండా రెండేండ్ల పాటు ఐఏఎస్ లను ఇన్ చార్జీలుగా నియమించి వర్సిటీలను ఆగం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వీసీ పోస్టులు ఖాళీ అయిన వెంటనే, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పైరవీల జోరు పెరిగింది. జేఎన్టీయూ, ఓయూ, కాకతీయ వర్సిటీలకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. మంత్రుల చుట్టూ నిత్యం పలువురు ఆశావహులు తిరుగుతున్నారు.
ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన మంత్రులను ఇప్పటికే చాలామంది ప్రొఫెసర్లు కలిసి తమ బయోడేటాను అందజేశారు. తమ నియోజకవర్గ, సామాజికవర్గ నేతలను కలిసి వీసీ పోస్టులకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతమున్న వీసీలు కూడా మళ్లీ ఆ పదవుల్లోకి వచ్చేందుకు జోరుగా పైరవీలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ ప్రొఫెసర్ నల్గొండలోని కీలక నేతలతో పాటు మెదక్ లోని కీలకనేతను వీసీ పోస్టు కోసం కలిశారు.
ఓయూ, జేఎన్టీయూ, కేయూకు చెందిన పలువురు ప్రొఫెసర్లు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మైనార్టీ వర్గానికి వర్సిటీ వీసీల్లో ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆ వర్గానికి చెందిన ప్రొఫెసర్లు లాబీయింగ్ చేస్తున్నారు. ఎంఐఎం నేతలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన ఓ మైనార్టీ నేత ద్వారా రెకమండ్ చేయిస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీల ద్వారా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యనేతల ద్వారా వీసీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
సర్కారు ఆచితూచి..
గత సర్కార్ నియమించిన వీసీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వర్సిటీ వీసీ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన ఏకంగా డబ్బులిచ్చి వీసీ పోస్టు తెచ్చుకున్నానని బహిరంగంగానే తన సన్నిహితులతో అన్నట్టు వార్తలు వచ్చాయి. కేయూ,జేఎన్టీయూ, ఓయూ,శాతవాహన వర్సిటీల వీసీలపైనా పలు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీసీల నియామకం విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది.
పైరవీలకు దూరంగానే ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వీసీ అభ్యర్థుల వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించినట్టు తెలిసింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరులోపే వీసీల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిచేయాలనే యోచనలో ఉంది. అయితే, కొత్త వీసీల అపాయింట్ జరిగే వరకు ఏమి చేయాలనేదానిపై ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకోనున్నది.