ఉమ్మడి పౌరస్మృతితోనే అందరికీ సమన్యాయం

‘‘దేశంలో ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఉమ్మడి చట్టాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష! పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఆ మేరకు బిల్లును ప్రవేశపెడితే వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి చట్టం తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు లేవు. ఉమ్మడి పౌరస్మృతి రావడానికి సమాజాన్ని సమాయత్తం చేయాలి’’ దేశ తొలి ప్రధాని నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఉమ్మడి పౌరస్మృతి కోసం రాజ్యాంగ నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు అప్పటి ముస్లిం మత పెద్దల నుంచి వచ్చిన వ్యతిరేకతకు ఈ మాటలు అద్దం పడతాయి. మహిళల పట్ల  వివక్షకు కారణమైన హిందూ వ్యక్తిగత చట్టాలను సంస్కరించి హిందూ సోదరీమణులకు న్యాయం చేయగలిగినా, షరియా చట్టాలను మార్చ లేకపోవడం ద్వారా ముస్లిం అక్కాచెల్లెళ్లకు న్యాయం చేయలేక పోయినట్లు తర్వాతి కాలంలో నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత తొలితరం నాయకుల ప్రయత్నాలను మినహాయిస్తే ఇప్పటివరకు వివిధ మత చట్టాల్లోని అసంగతాలను సరిదిద్దేందుకు గట్టి కృషి జరగలేదు. ప్రస్తుతం దేశంలో పెండ్లిళ్లు, విడాకులు, దత్తత, జనన, మరణాలు, ఆస్తుల పంపకం, వారసత్వం వంటి అంశాల్లో వేర్వేరు మతాలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.
ఇది అంబేద్కర్ ఆకాంక్ష
భిన్న మతాలు, తెగలు, ఉప తెగల్లో అనాదిగా కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దేశంలో 200కు పైగా వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. మతాలతో నిమిత్తం లేకుండా ఏ సమూహానికి చెందిన సమస్యైనా కోర్టుల పరిధిలో నిగ్గు తేల్చే ఈ ఉమ్మడి శాసనం పూర్తిగా న్యాయానికి సంబంధించిన అంశం. వ్యక్తిగత చట్టాల స్థానంలో 44 వ అధికరణ రూపంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రజలు, ప్రభుత్వాలు సాధించుకోవాలని ఆదేశ సూత్రాల్లో ప్రస్తావించారు. బీఆర్​ అంబేద్కర్ తదితర రాజ్యాంగ నిర్మాతలు ఉమ్మడి శిక్షాస్మృతి తరహాలోనే ఉమ్మడి పౌర స్మృతిని సాధించుకోవాలని ఆకాంక్షించారు. సామాజిక పురోగతికి, అభ్యుదయానికి మత చట్టాలను సంస్కరించడం తప్పనిసరని అంబేద్కర్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానికి ముందే 1941లో హిందూమత చట్టాల సమీక్షకు "హిందూ లా రిఫార్మ్స్ " కమిటీని ఏర్పాటు చేశారు. అది హిందూ కోడ్ బిల్లు రూపంలో 1954–55 అమలులోకి వచ్చింది. మత చట్టాల సవివర పరిశీలన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి హిందూ వ్యక్తిగత ఆచారాల సంస్కరణలను మూడు దశల్లో ఆమోదించారు. మరోవైపు విడాకులు, బహుభార్యత్వం,  మహిళల వారసత్వ హక్కులకు సంబంధించి ముస్లింల షరియాలోని అసంగతాలను సరి  చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు ముస్లిం మత పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగ ఆదర్శంగా మిగిలిపోయింది.
పలుమార్లు గుర్తు చేసిన సుప్రీంకోర్టు 
మూడున్నర దశాబ్దాల కింద అహ్మద్ ఖాన్ తన భార్య షాబానోకు మూడుసార్లు తలాక్ చెప్పి, విడాకులు ఇచ్చి సరైన మనోవర్తి చెల్లించేందుకు నిరాకరించిన కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇస్లామిక్ చట్టాల మేరకు జీవితాంతం తన భార్యకు మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. భారతీయ నేర న్యాయ స్మృతి లోని 125వ నిబంధన ప్రకారం తల్లిదండ్రుల, భార్య, పిల్లల పోషణ భారం భర్తదేనని సుప్రీంకోర్టు షాబానోకు మద్దతుగా 1985లో తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా- ప్రజాస్వామ్య వ్యవస్థలకు వ్యక్తిగత మత చట్టాలు అడ్డంకిగా మారుతున్న తీరును ప్రస్తావించింది. ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను గుర్తు చేసింది. ఆ తరువాత 1995లో సరళా ముద్గల్ కేసు, 2003లో జాన్ వల్ల మట్టం కేసు, 2015లో క్రైస్తవ కుటుంబ విడాకుల కేసు విచారణ సందర్భంగా కూడా ఉమ్మడి పౌర స్మృతి ఆవశ్యకతను సుప్రీం గుర్తు చేసింది.  మత చట్టాలను మొత్తంగా సవరించాలి లేదా మహిళల అణచివేతకు కారణమవుతున్న కట్టుబాట్లను అంతర్గత సంస్కరణల ద్వారా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు 2016లో దీనిపై స్టడీ చేసిన లా కమిషన్ 185 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. "భిన్నాభిప్రాయం బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతం. కాబట్టి వ్యక్తిగత చట్టాల్లోని దుర్విచక్షణకు అంతమొందించి వాటిలో సమానతకు తావిచ్చే మార్పులవైపు ప్రయత్నాలు సాగాలి " అని వ్యాఖ్యానించింది.

వివక్ష పోతది
ఉమ్మడి పౌరస్మృతి వలన అందరికీ సమాన న్యాయం లభిస్తుందనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని అభిప్రాయపడుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ప్రస్తావన లేకుండా సామాజిక న్యాయం, లింగవివక్ష రహిత సమాజం అనే ప్రధాన సూత్రాలపై ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మనదేశంలో అన్ని మతాల, వర్గాల వారికి సమాన అవకాశాలు ఉన్నాయి. ‘‘త్రిపుల్ తలాక్’’కు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన ‘‘భారతీయ ముస్లిం ఆందోళన సంస్థ” ప్రతినిధులు ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తామని ప్రకటించడం కీలక పరిణామం. ఉమ్మడి పౌరస్మృతి వల్ల దేశంలో వివిధ మతాలు, వర్గాల మధ్య తారతమ్యాలు లేకుండా సామాజిక సంబంధాలు కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. హెచ్చుతగ్గుల భావన తొలగిపోతుంది. భారతదేశం లౌకిక సమాజానికి కట్టుబడి ఉన్న దృష్ట్యా ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టడం ఎంతైనా అవసరం.