- సౌతాఫ్రికా 236/4
చెన్నై : సౌతాఫ్రికాతో ఏకైక టెస్టులో టీమిండియా అమ్మాయిలు చెలరేగిపోతున్నారు. చెపాక్ స్టేడియంలో వరుసగా రెండో రోజూ బ్యాటింగ్‌లో దుమ్మురేపుతూ విమెన్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరుతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఓవర్‌నైట్ స్కోరు 525/4తో రెండో రోజు శనివారం ఆట కొనసాగించిన ఇండియా 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపైనే ఆస్ట్రేలియా చేసిన 575/9 స్కోరు (డిక్లేర్డ్) తో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రిచా ఘోష్ (86), హర్మన్‌ప్రీత్ కౌర్ (69) ఫిఫ్టీలతో సత్తా చాటారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 143 రన్స్ జోడించారు.
స్కోరు 600 దాటించి రిచా ఔటైన తర్వాత లంచ్‌కు ముందు ఇండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా కూడా దీటుగా బదులిచ్చింది. రెండో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 236/4 స్కోరు చేసింది. సున్ లూస్ (65), మరిజేన్ కాప్ (69 బ్యాటింగ్) సత్తా చాటారు. ఓపెనర్లు లారా వోల్‌వర్ట్ (20), అనెక్ బాష్ (39)తో పాటు డెల్మి టక్కర్ (0)ను స్నేహ్ రాణా ఔట్ చేయగా..
సున్ లూస్‌ను దీప్తి శర్మ వెనక్కుపంపింది. ప్రస్తుతం కాప్ తోపాటు డిక్లెర్క్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. ఇండియా స్కోరుకు సఫారీలు ఇంకా 367 రన్స్ వెనుకంజలో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలన్నా.. మరో 167 రన్స్ చేయాలి.