హైదరాబాద్, వెలుగు: ఉన్నతాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితోనే 2023–24లో రికార్డు స్థాయి ఆస్తి పన్ను వసూలు సాధ్యమైందని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. బుధవారం బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. లక్ష్యానికి మించి ప్రాపర్టీ ట్యాక్స్వసూలు కావడం సంతోషంగా ఉందన్నారు. జోనల్ స్థాయిలో మైక్రో ప్లానింగ్, ఓటీఎస్పథకం అమలుతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.261 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైందన్నారు. 2022-23లో రూ.1660.38 కోట్లు రాగా, 2023-24లో రూ.1921.58 కోట్లు వచ్చాయన్నారు.
మార్చి 31న ఒక్కరోజే 129.35 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు నమోదైందన్నారు. ఎర్లీ బర్డ్ అమలుతో ఈసారి రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. అత్యధికంగా పన్ను వసూలు చేసిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ కలెక్షన్ ఇన్స్పెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, స్నేహ షబరిష్, శివ కుమార్ నాయుడు, కె.శ్రీవాస్తవ, నళిని పద్మావతి , గీతారాధిక, యడియాగిరి రావు, సత్యనారాయణ, జోనల్ కమిషనర్లు, రవి కిరణ్, అభిలాష అభినవ్ హేమంత్ బార్కడే తదితరులు పాల్గొన్నారు.