రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు..రెండు సీజన్లలో రూ.67 వేల182 కోట్ల రుణాలు

రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు..రెండు సీజన్లలో  రూ.67 వేల182 కోట్ల రుణాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 39.90 లక్షల మంది రైతులకు లబ్ధి
  • ఈసారి ఇప్పటికే 74% లోన్లు అందించిన బ్యాంకర్లు
  • అమౌంట్, పర్సెంటేజీ పరంగా ఇదే రికార్డు 
  • --కలిసి వచ్చిన రూ. 2 లక్షల పంట రుణమాఫీ
  • గతంలో ఎన్నడూ 60 శాతం టార్గెట్​ రీచ్​కాలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులకు గడిచిన వానాకాలం, యాసంగి సీజన్​లలో రికార్డు స్థాయిలో పంట రుణాలు అందాయి.  ఏడాది కాలంలో బ్యాంకులు 39.90 లక్షల మంది రైతులకు  రూ.67,182.92 కోట్ల క్రాప్​లోన్లను మంజూరు చేశాయి. ప్రభుత్వం పెట్టిన క్రాప్​లోన్ల  టార్గెట్​లో  ఏకంగా 74 శాతం చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ బ్యాంకర్లు 60 శాతానికి మించి  పంట రుణ లక్ష్యం చేరింది లేదు. అదీగాక ఏడాదిలో ఇంతపెద్ద మొత్తంలో పంట రుణాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల వరకు ఉన్న క్రాప్​లోన్లను మాఫీ చేయడం, రైతులకు ఉదారంగా కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదే పదే విజ్ఞప్తి చేయడం కలిసివచ్చిందని అధికారులు చెప్తున్నారు. కాగా, ఇంత పెద్దమొత్తంలో పంట రుణాలు అందడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొన్నది. 

74% టార్గెట్​ రీచ్​..

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే  కాంగ్రెస్​ సర్కారు రూ.2 లక్షల వరకు క్రాప్​లోన్లను మాఫీ చేసిన సంగతి తెలిసిందే.  సుమారు రూ.21 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, రైతులకు బ్యాంకర్లు ఉదారంగా లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమమార్క సూచించారు.  ఈ క్రమంలో  గత వానాకాలం సీజన్​ నుంచే బ్యాంకులు రైతులకు పంట రుణాలను పెంచుతూ వచ్చాయి.  2 సీజన్లలో కలిపి ఎస్ఎల్ బీసీ (స్టేట్​ లెవల్​ బ్యాంకర్స్​ కమిటీ)కి  ప్రభుత్వం రూ.90,795.19 కోట్ల పంట రుణాలు  ఇవ్వాలని టార్గెట్​ పెట్టింది. వానాకాలంలో 60 శాతం , యాసంగి లో 40 శాతం చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని  బ్యాంకర్లకు నిర్దేశించింది.  వానాకాలంలో రూ.54,480 కోట్ల లక్ష్యం పెట్టుకోగా, బ్యాంకులు  24 లక్షల 5 వేల419 మంది రైతులకు రూ.44,438 కోట్ల రుణాలు అందించాయి. దీంతో ఆ సీజన్​లో 82 శాతం క్రాప్​లోన్లు రైతులకు అందాయి. ఇక యాసంగిలో రూ.36,315.19 కోట్ల లక్ష్యం పెట్టుకోగా,  ఇప్పటి వరకూ 15 లక్షల 84 వేల772 మంది రైతులకు రూ.22,744.92 కోట్ల రుణాలు ఇచ్చాయి. ఇలా 2 సీజన్లలో   39 లక్షల 90 వేల191 మంది రైతులకు రూ.67,182.92 కోట్ల రుణాలు(74 శాతం) అందించాయి.  గతంలో ఏనాడూ ఇంత భారీ మొత్తంలో పంట రుణాలు ఇవ్వలేదని, అమౌంట్​పరంగా చూసినా, పర్సెంటేజీ పరంగా చూసినా ఇదే రికార్డు అని బ్యాంకర్లు, అధికారులు చెప్తున్నారు. 

అప్పుడు ​అడ్జస్ట్​మెంట్లు.. ఇప్పుడు కొత్త లోన్లు 

గత బీఆర్ఎస్​హయాంలో ఐదేండ్లపాటు పంట రుణ మాఫీ సక్రమంగా జరగకపోవడంతో కొత్త లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురాలేదు.  వాస్తవానికి  రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తాననే హామీతో 2018లో బీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చింది.  ఆ లెక్కన మొత్తం 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని బ్యాంకులు లెక్కతేల్చాయి. కానీ  తొలి నాలుగేండ్ల లో  రూ. 37 వేల లోపు రుణాలున్న రైతులకు  కేవలం రూ. 1,207 కోట్లు మాత్రమే గత బీఆర్ఎస్​ సర్కారు మాఫీ చేసింది.  తీరా ఎన్నికల ముందు 2023లో ఓఆర్ఆర్​ను ఓ ప్రైవేటు సంస్థకు 33 ఏండ్లపాటు అప్పగించి.. వచ్చిన రూ.7 వేల కోట్లను క్రాప్​లోన్లకు మళ్లించారు. ఇలా రుణమాఫీ సకాలంలో, పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, సర్కారు రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతో రైతులు వడ్డీ చెల్లించకపోవడంతో ఒక్కో బ్యాంకు 13 నుంచి 14శాతం వరకు వడ్డీల భారం మోపాయి. 

ఈ క్రమంలో 20 లక్షల మంది రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించి, నోటీసులు అందజేశాయి. 2018 నుంచి 2023 వరకు ఐదేండ్లపాటు కొత్తగా ఎవరికీ లోన్లు ఇవ్వని బ్యాంకర్లు..  కేవలం బుక్​అడ్జస్ట్​మెంట్లతోనే సరిపెట్టారు. 2023 వానాకాలంలోనూ రూ.40,718 కోట్ల క్రాప్​లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా,  కేవలం రూ.21, 272 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే బ్యాంకులు టార్గెట్​లో 52 శాతమే చేరుకున్నాయి. ఆ యేడు యాసంగిలో లక్ష్యంలో 40 శాతమే రుణాలు అందడం గమనార్హం. అవి కూడా బుక్​ అడ్జస్ట్​మెంట్లే తప్ప కొత్త లోన్లు కావు. 2014  నుంచి 2023 వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉండడం వల్ల బీఆర్ఎస్​ తొమ్మిందేడ్ల పాలనలో ఏకంగా వడ్డీల రూపంలోనే రైతులు  రూ.11 వేల కోట్లు కోల్పోయారని బ్యాంకర్లు లెక్కతేల్చారు.  కానీ  కాంగ్రెస్​ సర్కారు  అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే  25 లక్షల 35 వేల 963 మంది రైతులకు రూ.20,616.89 కోట్ల  క్రాప్​ లోన్లు మాఫీ చేయడంతో బ్యాంకర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.