జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకం బల్దియాకు కనకవర్షం కురిపిస్తోంది. అధికారుల అంచనాలకు మించి ఒకే నెలలో రికార్డు స్థాయి ఆస్తి పన్ను వసూలైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ముందస్తుగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తూ ఎర్లీ బర్డ్ పథకాన్ని మరోసారి తీసుకొచ్చింది GHMC. దీంతో.. సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నిర్ణీత గడువుకు ముందే 617కోట్లు వసూలయ్యాయని బల్దియా రెవెన్యూ విభాగం చెప్తోంది. మొత్తం 18 లక్షల మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉండగా, 6.51లక్షల మంది పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది.
ఎర్లీ బర్డ్ రాయితీకి ఇవాళ లాస్ట్ డే. దీంతో,.. ఇవాళ మరో 50 నుంచి 60 కోట్లు పన్ను వసూలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. గతేడాది ఎర్లీబర్డ్ లో 541 కోట్ల పన్ను వసూలు కాగా.. ఇప్పటికే 76 కోట్లు అధికంగా వసూలైంది. మొత్తంగా ఈ ఏడాది 650 నుంచి 675 కోట్ల పన్ను వసూలవుతుందని అంచనా వేస్తున్నారు బల్దియా అధికారులు. మొదట 600 కోట్ల పన్ను వసూలును జీహెచ్ ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కువ మొత్తం పన్ను చెల్లించే వారికి రాయితీ విషయం చెప్పి.. పన్ను వసూలు చేయాలని ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎర్లీబర్డ్ గడువుకు.. రెండ్రోజుల ముందే 600కోట్ల మార్క్ దాటడంతో టార్గెట్ ను 700 కోట్లుగా సవరించారు.
టార్గెట్ పై చివరిరోజు పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న GHMCకి ఈ ఆదాయం భారీ ఉపశమనం కానుంది. ఎర్లీ బర్డ్ తో వచ్చే ఆదాయంను.. రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ఇతరత్రా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది.