టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు

టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు
  •     ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌
  •     ఏటికేడు పెరుగుతున్న దరఖాస్తులు
  •     నిరుడు 75 వేలు..ఈ సారి 80 వేలకు పైగానే..
  •     ఇంకా పది రోజుల గడువు ఉండడంతో మరిన్ని పెరిగే ఛాన్స్‌‌‌‌

హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. డిగ్రీ తర్వాత వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో చాలా మంది ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీఎస్‌‌‌‌ ఐసెట్‌‌‌‌కు ఏటికేడు అప్లికేషన్లు పెరుగుతున్నాయి. గత ఐదారేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. ఐసెట్‌‌‌‌కు గతేడాది 75 వేలకు పైగా అప్లికేషన్లు రాగా, ప్రస్తుతం 80 వేలు దాటాయి. అప్లికేషన్లకు మరో పది రోజుల గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

80 వేలు దాటిన అప్లికేషన్లు

టీఎస్‌‌‌‌ ఐసెట్‌‌‌‌ను ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 265 ఎంబీఏ కాలేజీలు ఉండగా వాటిలో 34,270 సీట్లు, 52 ఎంసీఏ కాలేజీల్లో 4,092 సీట్లు ఉన్నాయి. ఎంబీఏలో వివిధ స్పెషలైజేషన్స్‌‌‌‌ను బట్టి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. హ్యూమన్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, పైనాన్షియల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, అకౌంటింగ్, ఆపరేషన్స్‌‌‌‌ రీసెర్చ్, బిజినెస్ రీసెర్చ్‌‌‌‌ మెథడాలజీ ఇలా వివిధ కోర్సులకు డిగ్రీతో పాటు ఇంజినీరింగ్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ సైతం మొగ్గు చూపుతుండడంతో ఈ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరిగింది. దీంతో ఐసెట్‌‌‌‌కు 2019లో 49,465 అప్లికేషన్లు రాగా, 2020లో 58,392, 2021లో 66,034, 2022లో 75,954 అప్లికేషన్లు వచ్చాయి. 2023లో 75,925 అప్లికేషన్లు రాగా ఈ సారి రికార్డ్ స్థాయిలో 80,631 వచ్చాయి.

మరో 10 రోజులు గడువు

టీఐసెట్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌కు లేట్‌‌‌‌ ఫీ లేకుండా ఏప్రిల్‌‌‌‌ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆ తేదీని మే 7 వరకు పొడిగించారు. అలాగే రూ.250 ఫైన్‌‌‌‌తో 17వ తేదీ వరకు అవకాశం ఇవ్వగా బుధవారం వరకు 80,631 అప్లికేషన్లు దాటాయి. రూ.500 ఫైన్‌‌‌‌తో 27 వరకు అవకాశం ఉంది. దీంతో మరిన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు. జూన్‌‌‌‌ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో ఐసెట్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌ జరగనుండగా, తెలంగాణలో 16, ఏపీలో 4 ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.