- ఖమ్మం జిల్లాలో 1,69,631, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,00,494 దరఖాస్తులు
- ఎక్కువగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసమే అప్లయ్
- ఉమ్మడి జిల్లాలో సభలు సక్సెస్
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ మంది అప్లికేషన్లు ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల్లో మొత్తం 1,69,631 అప్లికేషన్లు వచ్చాయి. అందులో జిల్లాలోని 20 మండలాల్లో కలిపి 1,45,152 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 51,712, రేషన్ కార్డుల కోసం 50,914, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 36,994, రైతు భరోసా కోసం 5,532 అప్లికేషన్లు వచ్చాయి.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 24,479 అప్లికేషన్లు రాగా, అందులో రేషన్ కార్డుల కోసం 7,401, ఇందిరమ్మ ఇండ్ల కోసం 7,191, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం 4,593, వివిధ స్కీములకు కలిపి కంబైన్డ్ దరఖాస్తులు 5,228 వచ్చాయని అధికారులు ప్రకటించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 481 పంచాయతీలతో పాటు ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లో నిర్వహించిన గ్రామ సభల్లో సంక్షేమ పథకాల కోసం జిల్లావ్యాప్తంగా 1,00,494 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో అత్యధికంగా 45,332 దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చాయి.
ఇందిరమ్మ ఇండ్ల కోసం 38,369, రైతు భరోసా కింద 1,121, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 15,672 దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 34,083, రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం 11,249 అప్లికేషన్స్ వచ్చాయి. జిల్లాలోని 481 గ్రామపంచాయతీల్లో మొత్తం 80,752 అప్లికేషన్స్ రాగా, నాలుగు మున్సిపాలిటీల్లో 19,742దరఖాస్తులు వచ్చాయి. 2,456.22 ఎకరాల్లో సాగుకు యోగ్యం కాని భూములను గ్రామసభల్లో గుర్తించారు.
ఎక్కువగా ఇండ్ల కోసమే లొల్లి
పలు గ్రామ సభల్లో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల జాబితాపైనే ప్రజలు ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు జాబితాలో పేర్లు ఉండడంపై పలు చోట్ల ప్రజలు ఆఫీసర్లను నిలదీశారు. గ్రామ సభలు నిర్వహించకుండా అడ్డుపడ్డారు. ఇండ్ల జాబితా విషయంలో అర్హులైన లబ్ధిదారులకు సంబంధించి మరోసారి సర్వే చేసి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నాలుగో రోజు ఎక్కడ.. ఏ పరిస్థితి..
అశ్వారావుపేట/చండ్రుగొండ/ఖమ్మం టౌన్ : అశ్వారావుపేట ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభకు ఇన్‌టైంలో అధికారుల ఎవరూ రాకపోవడంతో ప్రజలు ఫోన్ ద్వారా కలెక్టర్ జితేశ్ వి పాటేల్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వచ్చిన అధికారులపై గ్రామస్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే జారే ఆదినారాణ మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని చండ్రుగొండలో ఉపాధిహామీ పథకం కూలీలు ధర్నా చేశారు. రఘునాథ పాలెం మండలం బావాజీ తండాలో గ్రామసభ జరుగుతుండగా సెక్రటరీ ఉమ విధులకు తేజవత్ కుమార్ అనే వ్యక్తి ఆటంకం కలిగించడంతో మండల కేంద్ర పీఎస్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుసీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.