వరిసాగులో నల్గొండ టాప్

 వరిసాగులో నల్గొండ టాప్
  • రాష్ట్రంలో అధిక సాగు  ఉమ్మడి జిల్లాలోనే 
  • ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు 

నల్గొండ/యాదాద్రి: వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సాగు జోరందుకున్నది.  రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగు  జిల్లాలోనే చేస్తున్నారు.  ఆరు తడి పంటల వైపు రైతులు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో వరి నారు దశలో ఉండగా మరో వారం రోజుల్లో నాట్లు పూర్తి కానున్నాయి. యాసంగిలో గతంలో అన్ని రకాలు పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొనుగోలు సమయాల్లో కొంత ఇబ్బందులు ఎదురైనా వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు.  గడిచిన సీజన్ల మాదిరిగా ఈసారి కూడా వరి వైపే రైతులు మొగ్గు చూపుతారని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు.  

సూర్యాపేట జిల్లాలో 4.15లక్షల ఎకరాల్లో.. 

సూర్యాపేట జిల్లాలో 4,15,759ఎకరాల్లో పంట లు వేయగా..  వీటిలో 4.15లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. మరో 759 ఎకరాల్లో ఆరు తడి పంటలను సాగు చేస్తున్నారు. ఆరు తడి పంటల్లో అత్యధికంగా పల్లి 350ఎకరాలలో సాగవుతోంది. మొక్కజొన్న 260ఎకరాలు, జొన్నలు 65ఎకరాలు పెసర కేవలం 25ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు..

నల్గొండ జిల్లాలో

నల్గొండ  జిల్లాలో 5.83,620 ఎకరాల్లో పంట సాగు చేయగా వీటిలో 5,56,920 ఎకరాల్లో వరి ఉంది.  మరో 26,700  ఎకరాల్లో ఆరు తడి పంటలను సాగు చేస్తున్నారు. ఆరు తడి పంటలలో అత్యధికంగా వేరు శనగ 21 వేల ఎకరాలలో సాగు చేయగా పెసర్లు 2 వేల ఎకరాలలో, 2,200 ఎకరాలలో  జొన్నలు సాగు చేశారు..

యాదాద్రిలో 2.88 లక్షలు

యాదాద్రి జిల్లాలో సాగు చేయడానికి 6 లక్షలు ఎకరాల అనువైన భూమి ఉంది. అన్ని పంటలు, తోటలు కలుపుకొని 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.ఈ సీజన్​లో అన్ని పంటలు కలిపి 3.29 లక్షల ఎకరాలను సాగు చేస్తారని, ఇందులో 2.98 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇప్పటివరకూ జిల్లాలో 2.88 లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా, మరో వెయ్యికి పైగా ఎకరాల్లో వెదజల్లుడు పద్ధతిలో విత్తనాలు వేశారు. మిగిలిన ఎకరాల్లో నాట్లు వేయడానికి అవసరమైన నారు రెడీగా ఉంది.  ఈ సీజన్​లో అన్ని పంటలు కలిపి 21,150 ఎకరాలో సాగు చేస్తారని, ఆఫీసర్లు అంచనా వేసినా ఇప్పటివరకూ కేవలం 551 ఎకరాల్లో సాగు చేశారు. 

ఇతర పంటలూ మరీ తక్కువ

ఈ సీజన్​లో మొక్కజొన్న, జొన్న, సెసర్లు, ఉలవలు సాగు చేసుకునే అవకాశముంది. అయితే యాదాద్రి జిల్లాలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతం తక్కువగా ఉండడం వల్ల ఇవి పంట పొలాలపై పడుతున్నాయి. పప్పు దినుసులు పండిస్తే చాలు వాటి పంట పండినట్టే. పల్లి సహా పప్పుల పంటలను పీకి పారేస్తున్నాయి. దీంతో ఆ పంటల జోలికి వెళ్లడాన్ని రైతులు తగ్గించారు.

రికార్డ్ స్థాయిలో వరి.. 

తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో వరి సాగవుతుంది. వానాకాలం కొంత ఆలస్యం అయిన చెరువులు, కుంటలు నిండుగా ఉండడంతో పాటు జిల్లా రైతాంగానికి సాగు నీరందించే నాగార్జున సాగర్, మూసీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు సైతం నిండుగా ఉండడంతో గత సీజన్ కంటే ఈ సీజన్ లో 95,458ఎకరాల్లో పెరిగింది. ఇప్పటికే వరి సాగు చివరి దశకు చేరుకోగా మరో వారం రోజుల పాటు నాట్లు కొనసాగే అవకాశం ఉండగా మరో 80 వేల ఎకరాలలో వరి సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయి.