హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పత్తి ధరలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసాలో క్వింటాలు పత్తి ధర 9 వేల 300 రూపాయలు పలికింది. ఆదిలాబాద్ లో క్వింటాలు పత్తిని 9 వేల 120 రూపాయలకు చేరుకుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక మినహా... ఇతర రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల పత్తికి డిమాండ్ పెరిగింది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నాణ్యమైన పత్తి లభిస్తుండటంతో ధరలు ఊపందుకున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోనూ పత్తికి డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో క్వింటాలు పత్తికి 10 వేలు దాకా పలికే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా ధర పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెస్పీ కన్నా ఎక్కువ ధర వస్తుండటంతో స్థానికంగానే రైతులు పత్తిని అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 13 లక్షల 50 వేల ఎకరాల్లో పత్తి సాగుచేయగా, ఎకరానికి ఏడున్నర క్వింటాళ్ల చొప్పున దాదాపు కోటి క్వింటాల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి ధర ప్రైవేట్ మార్కెట్లో ఆశాజనకంగా ఉండటంతో.. రైతులు ఈ దఫా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాపారులు ఆశిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లోనూ పత్తికి డిమాండ్ పెరిగింది. మహారాష్ట్రలోనూ క్వింటాలు పత్తి ధర 9 వేల 600 దాటింది. పత్తి ధర ఇదే విధంగా నమోదైతే.. పెట్టుబడులు దక్కుతాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మీ పాన్ కార్డు అసలైందేనా ? తెలుసుకోండి ఇలా..
బండ్లు, కార్ల అమ్మకాల్లో జోష్.. రాష్ట్రంలో కోటిన్నరకు చేరువైన వెహికల్స్