
ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని నర్సరీలో మామిడి తోటను బహిరంగ వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తా ఆధ్వర్యంలో మామిడి తోటకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో ఉట్నూర్ ఉద్యాన నర్సరీలో ఉన్న 350 మామిడి చెట్లు ఉండగా, ఒక్కో చెట్టుకు రూ.2,870 చొప్పున రూ.10.05 లక్షల ధర పలికింది. ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, జైనూర్ ప్రాంతాల నుంచి 17 మంది ఔత్సాహికులు హాజరై వేలం పాటలో పాల్గొన్నారు.
మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందని పీవో తెలిపారు. సరైన సమయంలో ఎరువులు, నీళ్లు అందించడంతో పాటు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడంతోనే ఆదాయం ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు. డీటీడీవో జాదవ్ అంబాజీ, ఏవో దామోదర్ స్వామి, ఉద్యానవన ప్రాజెక్టు అధికారి సందీప్ కుమార్ ఉన్నారు.