- 6 నెలల్లోనే రూ.1100 కోట్లు వసూలు
- అధికారుల చర్యలతో ప్రజల నుంచి రెస్పాన్స్
- జీహెచ్ ఎంసీ పెట్టుకున్న టార్గెట్ 2 వేల కోట్లు
- 50 శాతానికి పైగా సమకూరిన ఆదాయం
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్కలెక్షన్ అవుతుంది. ఈ ఆర్థిక ఏడాదికి రూ. 2 వేల కోట్లు టార్గెట్ పెట్టుకుంది. దీంతో గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.1100 కోట్లు వసూలైంది. ఆరునెలల్లో ఇంత పెద్దమొత్తంలో రావడం బల్దియాకు ఇదే తొలిసారి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి 50 శాతానికి పైగా టార్గెట్ రీచ్ అయింది. ఖజానా ఖాళీగా ఉంటుండగా ఒక్కో నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. కొన్ని సందర్భాల్లో 15 తారీఖు దాటినా కూడా జీతాలు ఇవ్వని నెలలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం ఆదుకోవడం తప్ప బల్దియాకు ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో ప్రాపర్టీ ట్యాక్స్కలెక్షన్పైనే ప్రధానంగా ఫోకస్పెట్టింది. ఎలాగైనా వందశాతం రాబట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించి కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. నెలవారీ టార్గెట్లతో కలెక్ట్ చేయడం, ట్యాక్స్‌పేయర్స్‌కు డైలీ మెసెజ్ లు పంపడం, బకాయిదారుల ఇంటికి రెగ్యులర్ గా వెళ్లడం వంటి చర్యల ద్వారా ఆస్తి పన్ను వసూలు పెరిగింది.
స్కీమ్ లకు స్పందిస్తున్నరు..
ఆస్తి పన్నుకు సంబంధించి బల్దియా స్కీమ్‌లను అమలు చేస్తుండగా భారీగా స్పందన వస్తుంది. గత ఏప్రిల్ లో ఎర్లీబర్డ్ స్కీమ్‌ద్వారా ఊహించని విధంగా రూ.750 కోట్లు, వన్ టైమ్ సెటిల్ మెంట్‌కింద మరో రూ.80 కోట్లకుపైగా వచ్చాయి. ఇక రెగ్యులర్ గా కలెక్ట్ అయ్యే ప్రాపర్టీ ట్యాక్స్‌తో కలిపితే రూ.1100 కోట్లు వచ్చినట్టు బల్దియా అధికారులు తెలిపారు. ఇలా స్కీమ్ లు పెట్టిన ప్రతిసారి భారీగా ఆదాయం సమకూర్చుకుంటుండగా.. ఎప్పుడులేని విధంగా ఈసారి కలెక్షన్ భారీగా పెరిగిందని పేర్కొంటున్నారు.
చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..
ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్వసూలులో బల్దియా లక్ష్యం చేరుకోవడంలేదు. ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టడంతో టార్గెట్ చేరుకునేలా కనిపిస్తుంది. నాలుగేళ్లలో వసూలైన ఆస్తి పన్ను వివరాలను పరిశీలిస్తే 2019–20 లో రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22లో రూ.1,681 కోట్లు వచ్చింది. ఈఏడాది మరో ఐదునెలలు మిగిలి ఉండగానే భారీగా ఆదాయం రావడంతో 2 వేల కోట్ల టార్గెట్ రీచ్ అవుతామనే ధీమాను జీహెచ్ఎంసీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ప్రజలు ఎర్లీబర్డ్ లాంటి స్కీమ్స్‌కు రెస్పాన్స్ అవుతుండగా తద్వారా ఈ ఏడాది భారీగా సమకూరింది. ప్రాపర్టీ ట్యాక్స్చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కలెక్షన్ లోపంతోనే ఆదాయం రావడంలేదని భావించిన బల్దియా ఉన్నతాధికారులు అందుకు తగు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కలెక్షన్ పెరిగింది.
ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడంతో..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్రావడంలేదు. కనీసం ప్రభుత్వ భవనాలకు సంబంధించిన రూ.5,564 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు కూడా చెల్లించడంలేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బల్దియా చేరుకోవడంతో అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుపైనే ఫోకస్ పెట్టారు. జనానికి మెసెజ్ పంపుతుండగా ఆన్ లైన్ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్ లైన్ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చింది. వచ్చిన1,100 కోట్లలో సగం ఆన్ లైన్ ద్వారానే సమకూరింది.