- రెండు గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం
- కుంగిన కుసుమహరినాథ బాబా టెంపుల్
- గుట్ట కింద ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు
- భద్రాద్రిలో పర్యటించిన కలెక్టర్
- ఇరిగేషన్ ఇంజినీర్లపై మంత్రి తుమ్మల ఆగ్రహం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రిని బుధవారం వాన వణికించింది. తెల్లవారుఝామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య రికార్డు స్థాయిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇరిగేషన్ ఇంజినీర్లు తేరుకునే లోపే డ్రైన్ల నీరు విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరుకుని రామాలయం పరిసరాలను ముంచెత్తింది. బొమ్మల దుకాణాల్లోకి నీళ్లు చేరడంతో పాడైపోయాయి. కూలర్లు, ఫ్రిజ్‌లు చెడిపోయాయి.
అన్నదాన సత్రంలోకి కూడా నీరు ప్రవేశించింది. శిల్పినగర్ వరకు బ్యాక్‌వాటర్ విస్తరించింది. అశోక్‌నగర్ కొత్త కాలనీ వద్ద కూడా ఎటపాక వాగు బ్యాక్ వాటర్‌తో పాటు, వర్షపునీరు చేరి 25 ఇండ్లు ముంపుకు గురయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి 35 అడుగుల మేర ప్రవహిస్తుండడంతో కరకట్టపై ఉన్న స్లూయిజ్ గేట్లు మూసి ఉంచారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోశారు. ఒక మోటారు పాడైపోవడంతో నీటిని తోడడం ఆలస్యమైంది. విషయం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియడంతో ఇరిగేషన్ ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా అజాగ్రత్తగా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ రాంప్రసాద్‌తో కలిసి కలెక్టర్ విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరుకుని మోటార్లను పరిశీలించారు. టౌన్లో డ్రైన్ వాటర్ విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిజ్ ద్వారా బయటకు పోతుందని, వరద వచ్చినప్పుడు స్లూయిజ్‌గేట్లు మూసి ఉంచడం వల్ల మోటార్లతో ఎత్తిపోస్తున్నామని ఈఈ కలెక్టర్‌కు తెలిపారు.
రెండు గంటల్లోనే భారీ వర్షం రావడం, ఒక మోటారు పనిచేయకపోవడం వల్ల నీరు చేరిందన్నారు. శాశ్వత పరిష్కారం కోసం గతంలో రూ.19కోట్లతో విస్తా కాంప్లెక్స్, అశోక్నగర్కొత్తకాలనీ, రెడ్ల సత్రం వద్ద స్లూయిజ్‌ల ఆధునీకరణకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. వర్షాకాలం తర్వాత విస్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిజ్ పంప్‌హౌస్‌ను పెద్దగా చేసి పెద్ద పెద్ద మోటార్లు పెడతామన్నారు.
కుంగిన మండపం..కూల్చేసిన సిబ్బంది
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి అనుబంధ కుసుమ హరనాథబాబా ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య మండపం వర్షానికి కుంగింది. రంగనాయకుల గుట్టపై ఉన్న 100 ఏండ్ల నాటి ఈ మండపం కింది భాగంలో రాళ్లు వర్షానికి జారి కింద పడ్డాయి. గుట్ట కింద ఉన్న ఇండ్లపై పడడంతో రెండు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ మండపం పూర్తిగా పడిపోతే మరిన్ని ఇండ్లకు ప్రమాదం పొంచి ఉం టుందని కలెక్టర్..ఎన్డీఆర్ఎఫ్ టీంలను రప్పించారు.
ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్, తహసీల్దార్ శ్రీనివాసరావులను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. గుట్ట కింద ఇండ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఐటీసీ బీపీఎల్ నుంచి వచ్చిన టెక్నికల్ టీంలు ఈశాన్య మండపాన్ని పరిశీలించాయి. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రాత్రి సమయంలో మండపాన్ని కూల్చివేశారు.
కిన్నెరసాని, తాలిపేరుకు వరద
పాల్వంచ రూరల్ : భారీ వర్షాలకు పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీ వరద చేరుతోంది. 407 అడుగుల కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్ నీటిమట్టం 404.08 అడుగులకు చేరింది. దీంతో కేటీపీఎస్ అధికారులు 12 క్లస్టర్ గేట్లలో నాలుగింటిని మూడు అడుగులు ఎత్తి 20వేల క్యూసెక్కులను విడుదల చేశారు. డ్యామ్ సైట్ అధికారులు రామకృష్ణ, సురేశ్ పాల్గొన్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం సాయంత్రం అధికారులు 24 గేట్లను ఎత్తి 80,467 క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. 81,418 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
డ్రైన్లో పడి వ్యక్తి మృతి
భద్రాచలంలో బుధవారం మధ్యాహ్నం డ్రైన్లో పడి చెత్త ఏరుకునే వ్యక్తి చనిపోయాడు. సతీష్(42) తన భార్య సునీతతో కలిసి టౌన్లో చెత్త కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని బతుకుతుంటాడు. బుధవారం భార్యతో కలిసి చర్ల రోడ్డులో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటున్నాడు. అదే టైంలో డ్రైన్లో బాటిళ్లు తీసే క్రమంలో అదుపు తప్పి పడిపోయాడు.
వర్షానికి డ్రైన్ నిండుగా ప్రవహిస్తుండడంతో గల్లంతయ్యాడు. తన భర్తను రక్షించాలని సునీత వేడుకున్నా అప్పటికే కొట్టుకుపోయాడు. సీఐ సంజీవరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎన్డీఆర్ఎఫ్ టీంలను రప్పించి వెతికించగా సాయంత్రం మృతదేహం దొరికింది. గతంలో కేటీఆర్ మీటింగ్‌కు బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్ కూడా డ్రైన్లో పడి చనిపోయాడు.