భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భారీ వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. ఆదివారం ఉదయాన్నే భారీ స్థాయిలో వరద ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాబాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మణుగూరులో అత్యధికంగా 31.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు దశాబ్దాల తర్వాత ఇదే రికార్డ్ స్థాయి వర్షపాతం అని ఆఫీసర్లు తెలిపారు. మణుగూరును వరద చుట్టుముట్టిన విషయం తెలుసుకున్న కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, ఎస్పీ బి.రోహిత్ ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఒక్కసారిగా వరద రావడంతో ఇండ్ల ముందు పెట్టిన బైక్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. మణుగూరు మండలంలోని అశోక్‌నగర్‌లో ఎస్టీ హాస్టల్ వరదలో చిక్కుకోవడంతో స్టూడెంట్స్‌ను పడవలు, తాళ్లతో బయటకు తీసుకొచ్చారు. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు ఎగువను భారీగా వరద వస్తోంది. దీంతో 12 గేట్లను ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా నీటిని రిలీజ్ చేయడంతో లోతట్టు ప్రాంతాల్లోని వందలాది ఎకరాల్లోని పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి.