Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే 15 రికార్డులు ఔట్.. వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేసిన రికార్డులివే!

Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే 15 రికార్డులు ఔట్.. వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేసిన రికార్డులివే!

ఒక యువ క్రికెటర్ కు ఐపీఎల్ లో సెంచరీ కొట్టడమే పెద్ద కల. ఇక 35 బంతుల్లోనే ఆ ఘనతను సాధిస్తే అద్భుతం. అదే 14 ఏళ్ళ వయసులో ఈ ఫీట్ నమోదు చేస్తే అంతకంటే ఇంకో అద్భుతం ఉండదు. ఆడుతోంది ఐపీఎల్.. ప్రత్యర్థి జట్టులో అంతర్జాతీయ బౌలర్లు.. ఈ దశలో ఒక 14 ఏళ్ళ కుర్రాడు 35 బంతుల్లో సెంచరీ చేస్తాడని ఊహిస్తామా... కానీ రాజస్థాన్ రాయల్స్  ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. జైపూర్ లో సోమవారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ టోర్నీలో బెస్ట్ బౌలింగ్ లైనప్ గా పేరున్న గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

మొదట 17 బంతుల్లో హాఫ్ సెంచరీ.. పూర్తి చేసుకున్న వైభవ్ ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ  35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఐపీఎల్ లో సంచలనంగా మారాడు. కేవలం తన మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని సంచలనం సృష్టించాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లున్నాయి. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టి ఔరా అనిపించాడు.ఇక కరీం జనతా వేసిన 10 ఓవర్లో ఏకంగా 30 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. తన సంచలన బ్యాటింగ్ తో వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేసిన రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

1)ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేసుకున్న పిన్న వయస్కుడు సూర్యవంశీ.. ఈ రికార్డ్ గతంలో రియాన్ పరాగ్ పేరిట ఉంది. 2019 లో పరాగ్ 17 ఏళ్ల 175 రోజులు వయసులో ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ కొట్టటాడు. 

2)  మెన్స్ టీ20 క్రికెట్ లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడు. 2022లో 15 సంవత్సరాల 360 రోజుల వయసులో హసన్ ఐసాఖిల్ (బూస్ట్ డిఫెండర్స్).. కాబూల్ ఈగల్స్ పై హాఫ్ సెంచరీ చేశాడు. 

3) మెన్స్ టీ20 క్రికెట్ లో  18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో సెంచరీ నమోదు చేసిన ఏకైక ప్లేయర్ సూర్యవంశీ.  

4) ఐపీఎల్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు సూర్యవంశీ. అంతకముందు 2009 లో 19 ఏళ్ల 253 రోజుల వయసులో మనీష్ పాండే పేరిట ఈ రికార్డ్ ఉంది.  

5) మెన్స్ T20 క్రికెట్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు సూర్యవంశీ. 2013 లో 18 సంవత్సరాలు 118 రోజు వయసులో సెంచరీ చేసిన విజయ్ జోల్‌ను అధిగమించాడు. మహారాష్ట్ర ప్లేయర్ అయిన  విజయ్ జోల్‌ ముంబైపై ఈ ఫీట్ సాధించాడు. 

6) ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 2013లో పూణే వారియర్స్ ఇండియాపై క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 

7) ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్స్ ప్లేయర్ గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 2010లో ముంబై ఇండియన్స్‌పై యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేసి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.

8) ఐపీఎల్ 2025 సీజన్ లో ఫాస్టెస్ట్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును అధిగమించాడు, 

9) గుజరాత్ టైటాన్స్ పై ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గుజరాత్ పై విల్ జాక్స్ 41 బంతుల్లో చేసిన సెంచరీని అధిగమించాడు. 

10) 11 సిక్సర్లతో ఐపీఎల్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డ్ ను సమం చేశాడు. 2010 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రాజస్థాన్ రాయల్స్ పై మురళీ విజయ్ చేసిన 11 సిక్సర్ల రికార్డును సమం చేశాడు.

11) 11 సిక్సర్లతో ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన అన్‌క్యాప్డ్ బ్యాట్స్‌మన్ - ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ తరపున ఇషాన్ కిషన్ రాయల్ ఛాలెంజర్స్ పై కొట్టిన 9 సిక్సులు కొట్టిన రికార్డును అధిగమించాడు.

12) 11 సిక్సర్లతో ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్  2018లో రాయల్ ఛాలెంజర్స్ పై సంజు శాంసన్ కొట్టిన 10 సిక్సర్లను అధిగమించాడు.

13) ఐపీఎల్ సెంచరీలో అత్యధిక బౌండరీ శాతం వైభవ్ (93.07) పేరిట ఉంది. ఐపీఎల్ 2023 లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ (90.32) బౌండరీ శాతాన్ని అధిగమించాడు. 

 14) ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు. అంతకముందు 17 ఏళ్ల 39 ఏళ్ల వయసున్న ముజీబ్ ఉర్ రెహమాన్‌ పేరిట ఉన్న రికార్డ్ ను అధిగమించాడు. 

15) మెన్స్ T20 చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్. 15 సంవత్సరాల 74 సంవత్సరాల వయస్సులో అలుసిన్ తురేను వైభవ్ అధిగమించాడు.