- ఇండోర్ లో రికార్డులు బద్దలు
ఇండోర్: ఈసారి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నియోజకవర్గంలో రికార్డులు బద్దలయ్యాయి. ఇక్కడ నోటాకు 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వా ణీ 10 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. ఈ రెండింటికి కారణం.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడమే. కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ల చివరి రోజు తన నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు.
దీంతో కాంగ్రెస్ మరో అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలంటే, నోటాకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. బీజేపీ అభ్యర్థి గెలిచినప్పటికీ, కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. నోటాకు ఏకంగా 2,18,674 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక నియోజకవర్గంలో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు పడడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2019 ఎన్నికల్లో బిహార్ లోని గోపాల్ గంజ్ లో నోటాకు 51,660 ఓట్లు పడ్డాయి. ఇక ఇండోర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వాణీ ఏకంగా 12,26,751 ఓట్లు సాధించారు.