
- ఈ -పంచాయతీ వెబ్ సైట్ లో ప్రైవేట్ స్థలాలు
- ప్రభుత్వ స్థలాలుగా నమోదు
- ప్రభుత్వ రికార్డులో 427 ఇండ్లు, స్థలాలు
- రిజిస్ట్రేషన్లు అయితలేవు.. లోన్లు ఇస్తలేరు
- సంగారెడ్డి జిల్లా చేర్యాల గ్రామస్తుల దీనగాథ
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామంలో మొత్తం 847 ఇండ్లు ఉండగా అందులో దాదాపు 427 ఇళ్లు ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ పంచాయతీ వెబ్సైట్లో రికార్డులు తప్పుగా నమోదు చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఆయా ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితలేవు. ఇంటిని తాకట్టు పెట్టేందుకు బ్యాంకులకు పోతే లోన్లు ఇస్తలేరు. ఇండ్లు వాళ్లవే కానీ ఓనర్లు కాలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల దగ్గరకు వెళ్తే ప్రభుత్వం నుంచి ఎడిట్ ఆప్షన్ వస్తేనే ఇది పరిష్కారమవుతుందని చెబుతున్నారు.
2016 నుంచి సమస్య
చేర్యాల గ్రామంలో 2016 నుంచి మ్యాగ్జిమం ఇండ్లు, కొన్ని స్థలాలు ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు చూపిస్తోంది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల రికార్డులను ఈ -పంచాయతీలో నమోదు చేసే సందర్భంలో అధికారుల తప్పిదం వల్ల ప్రైవేట్స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా నమోదుచేశారు. 9 ఏళ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ బయటికి రాలేదు. కొద్ది రోజుల కింద చేర్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిపై రుణం కావాలని బ్యాంకుకు వెళ్లడంతో ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకోవడం వల్ల మీకు లోన్ రాదని బ్యాంక్ అధికారులు చెప్పడంతో అతను అవాక్కయ్యాడు.
వెంటనే ఆ వ్యక్తి గ్రామ సెక్రటరీకి ఫోన్ చేసి వాస్తవం ఏంటని అడుగగా అవును ఈ -పంచాయతీ వెబ్ సైట్ లో ప్రభుత్వ స్థలంగా చూపిస్తుందని బదులిచ్చాడు. మరో వ్యక్తి వారసత్వ ఆస్తి కింద తన కొడుకుకి గిఫ్ట్ డీడ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లగా అతడికి కూడా అక్కడ చుక్కెదురైంది. ప్రభుత్వ స్థలాన్ని వారసత్వ ఆస్తిగా మార్చడం కుదరదని రిజిస్ట్రేషన్ చేయకుండా వెనక్కి పంపించారు. ఇలా అనేక సందర్భాల్లో చేర్యాల గ్రామస్తులు రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక, బ్యాంకుల నుంచి లోన్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వమే పరిష్కారం చూపించాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు.
న్యాయం చేయండి మేడం
ఈ -పంచాయతీ కారణంగా గ్రామంలోని అనేక ఇండ్ల స్థలాలు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారు. తాత ముత్తాతల నుంచి ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటున్నాం. వంశపార్యంగా వచ్చిన ఆస్తి ప్రభుత్వ స్థలం ఎలా అయితది. ఆఫీసర్లు చేసిన తప్పులకు మమ్ములను బలి చేయవద్దు. తప్పుడు నమోదు వల్ల రిజిస్ట్రేషన్లు చేసుకోలేక, వాటిపై రుణాలు పొందులేక ఇబ్బందులు పడుతున్నాం. కలెక్టర్ స్పందించి గ్రామస్తులకు న్యాయం చేయాలి.
రాములు, చేర్యాల
ఎడిట్ ఆప్షన్ వస్తేనే..
ప్రభుత్వం నుంచి ఎడిట్ ఆప్షన్ వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మేము ఎడిట్చేయడానికి వీలులేదు. అప్పట్లో ఈ- పంచాయతీలో రికార్డుల నమోదు కారణంగా తప్పిదాలు జరిగినట్టు తెలిసింది. చేర్యాల గ్రామస్తుల సమస్యపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం.
శ్రీనివాస్, ఎంపీడీవో, కంది